KRMB Issue: కృష్ణా బోర్డు పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులు..ఇరు రాష్ట్రాల అమోదం-management of andhra and telangana irrigation projects under krishna river board ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Krmb Issue: కృష్ణా బోర్డు పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులు..ఇరు రాష్ట్రాల అమోదం

KRMB Issue: కృష్ణా బోర్డు పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులు..ఇరు రాష్ట్రాల అమోదం

Sarath chandra.B HT Telugu
Feb 02, 2024 10:15 AM IST

KRMB Issue: కృష్ణానదీ పరివాహకంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్మించిన ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతల్ని కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్ బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అమోదం తెలిపాయి.

కృష్ణా బోర్డు పరిధిలోకి సాగునీటి ప్రాజెక్టులు
కృష్ణా బోర్డు పరిధిలోకి సాగునీటి ప్రాజెక్టులు

KRMB Issue: ఏపీ తెలంగాణ మధ్య చిచ్చు కారణమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరేలా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీ స్వాధీనం చేసుకున్న నాగార్జున సాగర్‌ గేట్లతో పాటు రెండు రాష్ట్రాల నడుమ ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్ని కృష్ణా బోర్డుకు అప్పగించడానికి అమోదం తెలిపాయి.

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. గురువారం హైదరాబాద్‌ జలసౌధలో కృష్ణాబోర్డు చైర్మన్‌ శివ్‌నందన్‌ కుమార్‌ అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది.

తెలంగాణ నుంచి ఈఎన్‌సీ సి.మురళీధర్‌, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ మోహన్‌కుమార్‌, నాగార్జునసాగర్‌ చీఫ్‌ ఇంజనీర్‌ అజయ్‌కుమార్‌, కృష్ణాబేసిన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌.విజయకుమార్‌, ఏపీ నుంచి ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డితో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు.

దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో జల విద్యుత్‌ కేంద్రాలు తప్ప మిగిలిన 10నీటి విడుదల ఔట్‌లెట్లు, శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వేతో పాటు రివర్‌ స్లూయిస్‌ గేట్లు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, హంద్రీ-నీవా సుజల స్రవంతి, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ హెడ్‌ రెగ్యులేటర్‌, నాగార్జునసాగర్‌ వరద నీటి కాల్వ -హెడ్‌రెగ్యులేటర్‌- పరిసర ప్రాంతాలు, ఏఎమ్మార్‌ ఎత్తిపోతల పథకం-పంప్‌ హౌస్‌ పరిసరాలు, సాగర్‌ ప్రాజెక్టు స్పిల్‌వేతో పాటు రివర్‌ స్లూయిస్‌ గేట్లు, నాగార్జునసాగర్‌ రైట్‌ కెనాల్‌ హెడ్‌ రెగ్యులేటర్‌పై చర్చించారు.

గేట్ల నిర్వహణ, నీటి విడుదల మొత్తం బోర్డు నియంత్రణలోకి తీసుకెళ్లడానికి రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు అంగీకరించారు. నీటి విడుదల కోసం కేఆర్‌ఎంబీ ప్రత్యక్ష నియంత్రణలో ప్రతి విభాగం వద్ద తెలంగాణ నుంచి ఒకరు, ఏపీ నుంచి మరొక ఉద్యోగిని నియమించాలని నిర్ణయించారు.

మొత్తం 10 పాయింట్లలో మూడు షిఫ్టుల్లో 30 మంది చొప్పున బోర్డు నియంత్రణలో పని చేయడానికి సిబ్బందిని కేటాయించడానికి రెండు రాష్ట్రాలు సమ్మతించాయి. నీటి విడుదల మాత్రం బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసక్తారు. ఈ బోర్డులో సభ్య కార్యదర్శి డీఎం రాయిపూరే, తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్‌, ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డిలు ఉంటారు.

త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు నీటి విడుదల జరిగేలా రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. దీంతో పాటు సాగర్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌ పనులను తెలంగాణ.. శ్రీశైలం పనులను ఏపీ చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల వారీగా వాటి కాంపోనెంట్ల తాత్కాలిక నిర్వహణకు నియమించిన సిబ్బందికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వేతనాలు చెల్లిస్తాయి.

సీఆర్‌పీఎఫ్‌ బలగాలను సాగర్‌ ప్రధాన కట్ట వద్దే పరిమితం చేయనున్నారు. మరోమారు వివాదం తలెత్తితే మాత్రం శ్రీశైలంతో పాటు ఇతర కాంపోనెంట్ల వద్ద కూడా సీఆర్‌పీఎఫ్‌ బలగాలను మోహరిస్తారు.

కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డు చేపట్టేలోగా నదీ జలాల పంపకాలపై స్పష్టత రావాలని ఇరు రాష్ట్రాలు పట్టుబట్టాయి. రాష్ట్రాల ఆధీనంలో ఉన్న జలవిద్యుత్ కేంద్రాలపై ఎలాంటి చర్చ జరగలేదు. కృష్ణా నదీ జలాల్లో 50 శాతం వాటా డిమాండ్ కు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ఈఎన్‌సి భేటీ తర్వాత పేర్కొన్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024