KCR : జాగ్రత్తగా ఉండండి, ఏదో చెబితే విని ట్రాప్‌లో పడొద్దు...! కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
BRS Party News : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు.
KCR Meeting With MLAs: గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అనంతరం నంది నగర్ లోని ఆయన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు, ఎమ్మెల్సీల తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
తెలంగాణను సాధించి, స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతికాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని కేసీఆర్ అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిపిన బిఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందని పునరుద్ఘాటించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు కార్యాచరణ గురించి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాల గురించి చర్చించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ కీలక సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని… ఏదో చెబితే విని ట్రాప్ లో పడొద్దని సూచించారని సమాచారం. మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలిసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారట..! అభివృద్ధి కోసం మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వొచ్చని…. అదికూడా మంత్రులు జనం మధ్యలో ఉన్నప్పుడే ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కలిసే విషయంలో పార్టీకి ముందే సమాచారం ఇవ్వాలని చెప్పినట్లు సమాచారం. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రకటించన హామీలపై కూడా చర్చించారట…!
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. గజ్వేల్ ఎమ్మెల్యేగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంర్‌లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. కేసీఆర్‌తో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయక ముందే కాలు జారి పడటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
గురువారం మధ్యాహ్నం 12.30 సమయంలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. కేసీఆర్ రాక సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు శాసనసభకు తరలి వచ్చారు. కాసేపు సహచరులు, పార్టీ నాయకులతో కలిసి వేచి ఉన్నారు. అనంతరం ముహుర్తం సమయానికి స్పీకర్ కార్యాలయంలో శాసన సభ్యుడిగా ప్రమాణం చేశారు. అసెంబ్లీకి వచ్చిన సమయంలో కేసీఆర్ చేతి కర్ర సాయంతో మెల్లగా నడుచుకుంటూ వచ్చారు. ఆయన వెంట ఎంపీ సంతోష్ ఉన్నారు. స్పీకర్ ఛాంబర్‌లో సభాపతి గడ్డం ప్రసాద్ కేసీఆర్‌తో ప్రమాణం స్వీకారం చేశారు.
ప్రమాణం అనంతరం అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో పూజలు చేశారు. బీఆర్‌ఎస్ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్‌ను ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.అంతకుముందు, కేసీఆర్ అసెంబ్లీ వద్దకు చేరుకున్న కేసీఆర్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీకి కేసీఆర్ వస్తున్నారన్న వార్త నేపథ్యంలో బీఆర్‌ఎస్, కేసీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో అసెంబ్లీలో సందడి వాతావరణం నెలకొంది.