Rythu Bandhu : రైతు బంధు, రుణమాఫీపై కీలక అప్డేట్- ఈ నెలాఖరులోగా ఖాతాల్లో డబ్బులు!-nizamabad news in telugu minister tummala nageswara rao announced rythu bandhu funds deposited ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rythu Bandhu : రైతు బంధు, రుణమాఫీపై కీలక అప్డేట్- ఈ నెలాఖరులోగా ఖాతాల్లో డబ్బులు!

Rythu Bandhu : రైతు బంధు, రుణమాఫీపై కీలక అప్డేట్- ఈ నెలాఖరులోగా ఖాతాల్లో డబ్బులు!

Bandaru Satyaprasad HT Telugu
Jan 17, 2024 05:38 PM IST

Rythu Bandhu : రైతు బంధు, రైతు రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా రైతు బంధు నగదు జమ చేస్తామని తెలిపారు.

రైతు బంధు
రైతు బంధు

Rythu Bandhu : రైతు బంధు నిధులు జమపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. రైతు బంధు నిధులు ఒకేసారి విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో రైతు బంధు నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. నిజామాబాద్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రెండు లక్షల రైతుల రుణమాఫీని దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు.

రైతు రుణమాఫీపై

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండెకరాల లోపు భూమి ఉన్న 29 లక్షల మంది రైతులకు రైతు బంధు జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మిగిలిన రైతులకు రేపటి నుంచి రైతు బంధు నగదు జమ చేస్తేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతు డిక్లరేషన్ ను అమలు చేస్తామన్నారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతాంగం ప్రయోజనాల విషయంలో రాజీపడబోమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో పట్టుదలతో ఉన్నారన్నారు. యాసంగి(రబీ) సీజన్ లో రైతుబంధు జమ చేయడానికి రూ.7,625 కోట్లు అవసరం అవుతాయన్నారు. అయితే ఇప్పటి వరకు 29 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ.1,050 కోట్లు జమ చేసిందన్నారు. మిగతా రైతులకు నగదు జమ చేసేందుకు రూ.13,500 కోట్ల రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరామన్నారు. కేంద్రం రూ.9 వేల కోట్ల రుణానికి అనుమతి ఇచ్చిందన్నారు. ఈ రుణంలో రూ.2 వేల కోట్లు ఈనెలలో వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నిధులతో రైతు బంధు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

రేపటి నుంచి ఖాతాల్లోకి డబ్బులు

రైతుబంధు డబ్బుల కోసం తెలంగాణలోని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ కు సంబంధించి గతంలో ఉన్న స్కీమ్(రైతుబంధు) కు అనుగుణంగానే నిధులను జమ చేయాలని సర్కార్ నిర్ణయించటమే కాకుండా, ఇప్పటికే పలువురి ఖాతాల్లోకి డబ్బులను జమ చేసింది. నిధుల జమకు సంబంధించి మంత్రి తమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే 29 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు వెల్లడించారు. రేపటి నుంచి ఎకరం కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమయ్యే అవకాశం ఉంది. కొత్తగా పాస్ బుక్ వచ్చిన రైతులకు సంబంధించి కూడా కీలక అప్డేట్ అందింది. పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తులను స్వీకరించగా… కొద్దిరోజుల క్రితం దరఖాస్తులను స్వీకరించకుండా సైట్ ను ఫ్రీజ్ చేసినట్లు తెలిసింది. అయితే ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా పంట పెట్టుబడి సాయం కోసం దరఖాస్తులను స్వీకరించింది ప్రభుత్వం. వీటి ఆధారంగా కొత్త వారికి కూడా సాయం అందజేసే అవకాశం ఉంది.

Whats_app_banner