AP EAPCET Results 2024 Updates : ఏపీ ఎంసెట్ అభ్యర్థులకు మరో అప్డేట్ అందింది. వెబ్ సైట్ లో డిక్లరేషన్ ఫామ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫామ్ నింపాల్సిన అభ్యర్థులు… జూన్ 1వ తేదీ సాయంత్రం 5లోపు పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ఏపీ ఈఏపీసెట్-2024 ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇటీవలనే పరీక్షలు పూర్తి కాగా... ప్రాథమిక కీ లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కూడా మే 26వ తేదీతో పూర్తి అయిపోయింది. అయితే తాజాగా వెబ్ సైట్ లో డిక్లరేషన్ ఫామ్ ఆప్షన్ ను తీసుకొచ్చారు.
ఈ డిక్లరేషన్ ఫామ్ ను ఏపీ ఇంటర్ బోర్డు నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు నింపాల్సిన అవసరం లేదు. సీబీఎస్ఈతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసి ఏపీ ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్థులు నింపాల్సి ఉంటుంది. అందుకోసం ఈ డిక్లరేషన్ ఫామ్ ఆప్షన్ ను తీసుకొచ్చారు. జూన్ 1వ తేదీలోపు వివరాలను పంపాల్సి ఉంటుంది.
డిక్లరేషన్ పూర్తి అయితే వెంటనే ఫలితాలు ప్రకటించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది. జూన్ మొదటి వారంలో ఫలితాల విడుదలకు కసరత్తు చేస్తుందని సమాచారం. ఈఏపీసెట్ ఫలితాల విడుదలతో పాటు కౌన్సెలింగ్ షెడ్యూల్ ను అధికారులు ప్రకటించనున్నారు. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in/EAPCET లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
ఏపీ ఈఏపీసెట్‌ను కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. .ఏపీలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీ సెట్‌ను నిర్వహించారు.
ఏపీ ఈఏపీసెట్‌కు సంబంధించి ఇంజనీరింగ్ విభాగానికి అన్ని సెషన్లలో కలిపి 2,74,213 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2,58,373 మంది పరీక్షకు హాజరయ్యారు. 15840మంది గైర్హాజరు అయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 94.22 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి సంబంధించి అన్ని సెషన్లకు 88,638 మంది ఈఏపీ సెట్‌కు విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 80,766 మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రి, ఫార్మసీ విభాగాల్లో 7872మంది గైర్హాజరయ్యారు. ఈ విభాగంలో 91.12 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఈఏపీ సెట్ 2024కు మొత్తంగా 3,62,851 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. 23712మంది గైర్హాజరు కావడంతో 93.47 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు కన్వీనర్ ప్రొ.కె. వెంకటరెడ్డి తెలిపారు.