Telangana Formation Day Celebrations 2024 : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఆహ్వానం పంపారు. జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. తన ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్‌కు లేఖను అందజేసే బాధ్యతలు అప్పగించారు.
’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ధి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదే వేడుకల సందర్భంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు.