Ornaments In Pink Paper : బంగారం, వెండి నగలను పింక్ కలర్ పేపర్‌లో ఎందుకు ప్యాక్ చేస్తారంటే
Ornaments In Pink Paper : బంగారం, వెండి అంటే అందరికీ ఇష్టమే. వాటిని కొనేందుకు చాలా తిప్పలు పడుతారు. అయితే కొన్నాక ప్యాకింగ్ చేసేప్పుడు గమనిస్తే పింక్ కలర్ పేపర్లో పెడతారు. ఇలా ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా?
భారతదేశంలో ఆభరణాలకు ఉన్నంత క్రేజ్.. మరేదేశంలోనూ ఉండదు. ఇక బంగారం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కచ్చితంగా బంగారం కొనేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. మధ్యతరగతి వారికి కూడా బంగారమంటే మక్కువ ఎక్కువ. అప్పులు చేసి అయినా బంగారం తీసుకునేవాళ్లు ఉంటారు. పెళ్లైనా.. ఏదైనా.. బంగారం పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. బంగారు ఆభరణాలు ఉంటేనే మనిషికి విలువ అనే రోజులు వచ్చాయి.
ఇదంతా పక్కన పెడితే.. బంగారం, వెండి ఆభరణాలను పింక్ కలర్ పేపర్లో చుట్టి ప్యాక్ చేయడం మీరు చూసే ఉంటారు. ఇప్పుడంటే పెద్ద పెద్ద జ్యూవెల్లరీ షాపులు బాక్సుల్లో ప్యాక్ చేసి ఇస్తున్నాయి.. కానీ అంతకుముందు ఎక్కువగా గులాబీ రంగు పేపర్లోనే ప్యాకింగ్ జరిగేది. ఇప్పటికీ కొన్ని బంగారం దుకాణాల్లో అదే పద్ధతిని పాటిస్తారు. ఇలా ఎందుకు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దీని వెనక బిజినెస్ ట్రిక్ కూడా ఉంది.
ఆభరణాల వ్యాపారులు ఆభరణాలకు గీతలు పడకుండా కాగితపు షీట్లను వాడుతారు. ఈ కాగితాలు దాదాపుగా పింక్ కలర్లోనే ఉంటాయి. ఎందుకంటే ఇవి నిజంగా లోహపు రంగు, ఆభరణాలకు మెరుపును తెస్తాయి. అదే వేరే రకం పేపర్లో వేస్తే అవి అంతగా మెరుపును చూపించవు. సాధారణంగా కనిపిస్తాయి. అదే పింక్ పేపర్లో వేస్తే వాటి ప్రకాశవంతం పెరుగుతుంది.
'మేం నగలను తయారు చేసి వాటిని పింక్ కలర్ పేపర్లో ఇచ్చేందుకు కారణం ఉంది. తెలుపు, నలుపు లాంటి కాగితాల్లో వెండి, బంగారం పెడితే అవి అంతగా ఆకర్శించవు. అదే పింక్ కలర్ పేపర్లో చుట్టి ప్యాక్ చేసి ఇస్తే.. మీరు ఎప్పుడు చూసినా అవి మెరుస్తూనే ఉంటాయి. ప్రకాశవంతంగా ఉంటాయి. గీతలు పడకుండా ఉంటాయి. మీరు ఎన్ని రోజుల తర్వాత ఓపెన్ చేసి చూసినా.. పింక్ కలర్‌లో పెట్టి ఇచ్చిన ఆభరణాలను చూడగానే మెరుస్తూ కనిపిస్తాయి. ఇతర కాగితల్లో చుట్టి ఇస్తే అలా ఉండదు.' అని నగల వ్యాపారి అశోక్ ఆచార్య చెప్పుకొచ్చారు.
పింక్ పేపర్లో పెడితే బంగారం, వెండి వాటి కాంతిని ఎక్కువ రోజులు నిలుపుకొంటాయి. అదే ఇతర వాటిలో పెడితే మాత్రం అంతగా ఉండదు. వాటి సహజ మెరుపు బయటకు కనిపించేందుకే గులాబీ రంగు పేపర్లో బంగారం, వెండి పెట్టి ఇస్తారు. అంతే కాదు.. కొన్ని సంస్కృతులలో అదృష్టం, శ్రేయస్సుకు చిహ్నంగా బంగారు ఆభరణాలను తరచూగా పింక్ కలర్ పేపర్లో పెడతారు. గులాబీ రంగు ఆనందం, ప్రేమ, వేడుకలతో ముడిపడి ఉంది. పింక్ పేపర్లో బంగారు ఆభరణాలు చుట్టడం అనేది ఆశీర్వాదాలను తెలియజేసేందుకు అని కూడా కొందరు చెబుతారు.
అదే మీ ఇంట్లో బంగారాన్ని తెలుపు కాగితంలో పెట్టి చూడండి. ఆకర్శణీయంగా అనిపించవు. తెలుపు అన్ని రంగులను ప్రతిబింబిస్తుంది. దీంతో ఆభరణాల మెరుపు తగ్గుతుంది. నలుపు రంగును వాడినా అంతే. కాంతిని గ్రహిస్తుంది. ఎక్కువగా ఆకర్శణీయంగా నగలు కనిపించవు. అన్నింటిలోకెల్లా గులాబీ రంగులోనే ఎక్కువగా మెరుస్తూ ఆభరణాలు కనపడతాయి. అందుకే నగల వ్యాపారులు ఎప్పటి నుంచో ఈ పేపర్లోనే వాటిని పెట్టడం చేస్తున్నారు. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది.