Khammam Politics : ఖమ్మం కాంగ్రెస్ లో జోష్- గులాబీ పార్టీలో నైరాశ్యం!
Khammam Politics : ఖమ్మం బీఆర్ఎస్ క్యాడర్ లో లోక్ సభ ఎన్నికల జోష్ కనిపంచడంలేదు. లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు అంతంత మాత్రంగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఖమ్మం బీఆర్ఎస్ క్యాడర్ ఇంకా కోలుకున్న దాఖలాలు కనిపించడంలేదు.
Khammam Politics : ఖమ్మం జిల్లా కారు పార్టీలో నైరాశ్యం అలుముకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల(TS Assembly Elections) ఫలితాలను నేతలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ముంగిటికొచ్చిన లోక్ సభ ఎన్నికలపై అంతగా కసరత్తు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ ఫలితంగా జెండా మోసే కార్యకర్తల్లో నిస్తేజం కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections)పై జిల్లా బీఆర్ఎస్ (BRS)పార్టీ నాయకత్వం ఇంకా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. అటు ఖమ్మంలో, ఇటు మహబూబాబాద్ లోనూ గులాబీ పార్టీ పెద్దగా ఫోకస్ పెట్టినట్లు లేకపోవడంతో కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి ఆ పార్టీ నాయకత్వం బయటకొచ్చినట్లు లేదు. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే రానున్న లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ, బిఆర్ఎస్ లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వరరావును ఒంటరిని చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలే ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ లో పెరిగిన జోష్
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ చేదు ఫలితాలనే చవిచూసింది. భద్రాచలం మినహా మిగిలిన 9 నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్(Congress) 8, సీపీఐ ఒక స్థానంలో గెలుపొందాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కాయి. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు కీలక పదవులు పొందారు. ముగ్గురికీ ప్రధానమైన శాఖలే దక్కడంతో రాష్ట్రంలో జిల్లాకు అమితమైన ప్రాధాన్యత దక్కినట్లైంది. దీంతో జిల్లా కాంగ్రెస్ లో జోష్ నెలకొంది. ఈ జోష్ తో రానున్న లోక్ సభ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ ను చిత్తు చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో భారీగా చేరికలను సైతం ఆ పార్టీ ప్రోత్సహిస్తోంది. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఖమ్మం కార్పొరేషన్ లో బీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాయి.
ఆ ఒక్క సమావేశమే..
బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ కు మరింత భిన్నంగా నైరాశ్యంలో కూరుకుపోతోంది. హైదరాబాద్ లో జరిగిన సమీక్షా సమావేశం మినహా లోక్ సభ ఎన్నికల్లో పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేసేందుకు ఆ పార్టీ ఎలాంటి సభలు, సమావేశాలూ నిర్వహించలేదు. ఓటమి నుంచి కోలుకోని మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గం పట్ల అంటీముట్టనట్లుగా ఉంటున్నట్లు కనబడుతోంది. ఒకరిద్దరు మినహా మిగతా వారు నియోజకవర్గానికి అడపాదడపా వచ్చి పోతున్నారు. దీంతో క్యాడర్ లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలు చోట్ల పార్టీ నాయకులు కండువాలు మారుస్తున్నారు. ఇదిలా ఉంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఎవరికి వారే...
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభావాన్ని చవిచూసిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే గడుపుతున్నట్లు తెలుస్తోంది. నెలలో ఒకటి, రెండ్రోజులు మాత్రమే ఆయన ఖమ్మంలో సమయం కేటాయిస్తున్నారన్న అసంతృప్తి పార్టీ క్యాడర్ లో ఉంది. ఖమ్మం ఎంపీ స్థానం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించుకునే క్రమంలో మాజీ మంత్రి ఈ ఏడు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాల్సి ఉంది. అయితే సొంత నియోజకవర్గమైన ఖమ్మంలోనే పువ్వాడ ఎక్కువ సమయం కార్యకర్తలతో గడుపుతున్నట్లు కనిపించడం లేదు. మరి మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ ఇంకెంత నైరాశ్యంలో ఉంటుందో అంచనా వేసుకోవాలి. అలాగే ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు సైతం అంతా ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తుండడం ఆ పార్టీ కార్యకర్తలకు మింగుడుపడడం లేదు. అందరూ కలిసి జిల్లా వ్యాప్తంగా ఒక్కసారైనా సమావేశం నిర్వహించిన దాఖలాలు కనిపించడం లేదు. హైదరాబాద్ లో సమీక్ష సమావేశాలు జరిగాక జిల్లాలో ఆ పార్టీ సభలు, సమావేశాలు ఉధృతమవుతాయని కార్యకర్తలు ఆశించారు. క్యాడర్లో నూతనోత్తేజం నింపేందుకు అందరూ కలిసికట్టుగా వ్యవహరిస్తారనే కార్యకర్తల ఆశలు ఆడియాసలయ్యాయి. ఇప్పటి వరకు అలాంటి ఉత్సాహాభరిత వాతావరణమే ఆ పార్టీలో కనిపించడంలేదని ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు ఎంతగూడు కట్టుకుని ఉన్నాయో ఇట్టే అర్థమవుతోంది.
గతం కంటే భిన్నం..
2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ఒక్క స్థానమే వచ్చింది. అయినా 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ పుంజుకుని ఖమ్మం, మహబూబాబాద్ స్థానాలను గెలుచుకుంది. గతంలో అసెంబ్లీ స్థానాలు ఓడిపోయినా పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో కార్యకర్తలు జోష్ తో పని చేశారు. అప్పుడు తుమ్మల, పొంగులేటి ఆ పార్టీ లోనే ఉన్నారు. దీంతో నామ నాగేశ్వరరావుకు గెలుపు సునాయాసమైంది. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. గతంలోలాగానే మొన్నటి ఎన్నికల్లోనూ బిఆర్ఎస్ కు ఒక్క స్థానమే వచ్చింది. అది మహబూబాబాద్ లోక్సభ పరిధిలో ఉంది. ఖమ్మం లోక్సభ పరిధిలో ఒక్క అసెంబ్లీలోనూ బీఆర్ఎస్ ఎంఎల్ఎలు లేరు. అంతా కాంగ్రెస్ ఎంఎల్ఎలే.. ఈ లోక్సభ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా వాటిలో మూడింటికి ప్రాతినిధ్యం వహించే వారు ఇప్పుడు మంత్రులుగా రాష్ట్ర మంత్రివర్గంలో ప్రధాన భూమికలో ఉన్నారు. అందుకే ఈసారి బిఆర్ఎస్ కు గెలుపు అంత సునాయాసం కాదనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. రెండు జిల్లాలోనూ పట్టున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖమ్మం, మహబూబాబాద్ లోక్ సభ స్థానాల ఇన్ఛార్జి బాధ్యతలను కాంగ్రెస్ అధిష్ఠానం అప్పగించింది. ఐక్యంగా ఉన్న కాంగ్రెస్ ను ఢీకొనడం బీఆర్ఎస్ కు సాధ్యం కాదనే అభిప్రాయం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. రానున్న కాలంలో పార్టీ క్యాడర్ ను ఏకతాటిపైకి తెచ్చి ఎన్నికలకు నామ నాగేశ్వరరావు ఎలా సమాయత్తమవుతారనేది వేచి చూడాల్సిందే.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.
సంబంధిత కథనం