Khammam Congress MP Ticket 2024 : ఆ ముగ్గురి మంత్రుల ప్రయత్నాలు..! 'ఖమ్మం' సీటు ఎవరికి..?
Khammam Congress MP Ticket 2024 : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ హాట్ హాట్ గా మారింది. రేణుకా చౌదరికి రాజ్యసభ సీటు ఖరారు కావటంతో… రేసు నుంచి వైదొలిగినట్లు అయిపోయింది. అయితే జిల్లాకు చెందిన మంత్రులు… సీటును తమ వాళ్లకు ఇప్పించుకునేందుకు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు.
Khammam Congress MP Ticket 2024: ఖమ్మం ఎంపీ టిక్కెట్ కోసం నిన్న మొన్నటి వరకు ఆశావహుల సంఖ్య పెరగగా తాజాగా ఈ పోటీ కొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ పోటీ చేస్తారని కొద్ది రోజులు హడావుడి చోటుచేసుకోగా, మరి కొన్ని రోజులు ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం హోరెత్తింది. కాగా సోనియా రాజస్థాన్ రాజ్యసభ స్థానం నుంచి పార్లమెంటుకు వెళ్లనుండగా, ప్రియాంక రాయబరేలీ లోక్ సభ స్థానం నుంచి పోటీ పడనున్నట్లు స్పష్టమైంది.
రేసు నుంచి రేణుకా ఔట్…!
ఇదిలా ఉండగా ఖమ్మం ఆడబిడ్డగా చెప్పుకునే కేంద్ర మాజీ మంత్రి, ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరిని రాజ్యసభ స్థానానికి పంపేందుకు అధిష్టానం నిర్ణయించడంతో ఖమ్మం ఎంపీ టిక్కెట్ పోటీ నుంచి ఆమె వైదొలిగినట్లైంది. ఫలితంగా ఈ పోటీ కొత్త మలుపు తిరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా పోటీలో ఉన్న జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు మాత్రమే ప్రధాన అభ్యర్థులుగా తెరపై కనిపిస్తున్నారు. ఖమ్మం ఎంపీ స్థానానికి 12 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో రేణుక చౌదరి, రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేత వి హనుమంతరావు మినహాయించి ఆ ముగ్గురు అభ్యర్థులే ప్రధాన పోటీలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఖమ్మం ఎంపీ స్థానంపై మొదటి నుంచీ కన్నేశారు. ఈ క్రమంలో తీవ్రంగా పావులు కలిపారు. అధిష్టానం వద్ద దరఖాస్తు చేసుకునే సమయంలోనూ ఖమ్మం నుంచి హైదరాబాద్ కు భారీ కార్ల ర్యాలీతో తరలివెళ్లి దరఖాస్తు చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన మరో మంత్రి, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం ఖమ్మం ఎంపీ టికెట్ ను తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇప్పించేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆయన సీఎం తర్వాత తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సవాల్ చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 స్థానాలను గెలిపించిన ఖ్యాతిని పొంగులేటి గడించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో తానే అన్నట్లుగా కొన్ని సంకేతాలను సైతం పంపారు. ఈ క్రమంలో ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి ఖమ్మం ఎంపీ స్థానం కోసం దరఖాస్తు చేసుకోవడం పై ఆసక్తి నెలకొంది.
తుమ్మల ప్రయత్నాలు…!
మరోవైపు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన ఉద్దండుడు, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఖమ్మం ఎంపీ టికెట్ ను తన తనయుడు యుగంధర్ కి ఇప్పించుకునేందుకు తీవ్రంగానే పావులు కదుపుతున్నారు. గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూ ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ల వద్ద పని చేసిన అనుభవం కలిగిన తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతూ రాష్ట్ర క్యాబినెట్లో కీలకంగానే వ్యవహరిస్తున్నారు. ఆయన సైతం తనయుడికి టికెట్ కోరుతూ అధిష్టానం వద్ద పోరాటం చేస్తున్నారు. కాగా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సైతం ఖమ్మం ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఇక్కడ విచిత్రమైన విషయంగా కనిపిస్తోంది. కాగా ఆయన స్థానికేతరుడు కావడంతో విహెచ్ పేరును పరిశీలించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ల మధ్య అవాంఛనీయ పోటీ నెలకొంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకతాటిపై నడుస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది స్థానాలు కైవసం చేసుకోవడంలో ఈ ముగ్గురు నేతలు కీలకపాత్ర పోషించారు. అయితే తాజాగా ఖమ్మం ఎంపీ టికెట్ కోసం ఈ ముగ్గురి నడమే అవాంఛనీయ పోటీ నెలకొనడం చర్చనీయాంశంగా మారింది.
ఈ పరిస్థితి నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ముగ్గురు మంత్రుల పోటీని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఏదేమైనా ఒక్కరినే సంతృప్తి పరిచే అవకాశం ఉండడంతో మరో ఇద్దరికి అసంతృప్తి తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.
సంబంధిత కథనం