Telangana Assembly Session : బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జల దోపిడీ - ఇరిగేషన్‌పై 'శ్వేతపత్రం' విడుదల-telangana government has introduced a white paper on irrigation projects in the assembly session 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Assembly Session : బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జల దోపిడీ - ఇరిగేషన్‌పై 'శ్వేతపత్రం' విడుదల

Telangana Assembly Session : బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జల దోపిడీ - ఇరిగేషన్‌పై 'శ్వేతపత్రం' విడుదల

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 17, 2024 11:08 AM IST

TS Govt White Paper On rrigation projects : ఇరిగేషన్ శాఖపై శాసనసభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులతో పాటు శ్రీశైలం, సాగర్ ప్రాజెక్ట్ అంశాలను ప్రస్తావించింది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - 2024
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - 2024

White Paper On rrigation projects : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. శుక్రవారమే సమావేశాలు పూర్తి అవుతాయని అంతా భావించినప్పటికీ… ఇవాళ కూడా సభ నడుస్తోంది. ఇందులో భాగంగా… జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. ఇగిరేషన్ ప్రాజెక్టుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టులో పూర్తిస్థాయి లోపాలు జరిగాయన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ…. గత బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ తో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో జల దోపీడీ జరిగిందని చెప్పారు. కృష్ణా జలాల విషయంలో కూడా అన్యాయం జరుగుతున్నప్పటికీ మాట్లాడలేదని అన్నారు. ఫలితంగా దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. సొంత ఇంజినీరింగ్ ద్వారా ప్రాజెక్టులను నిర్మించటం ద్వారా… ఇవాళ వాటిలో నాణ్యత లేకుండా పోయిందన్నారు. “ ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అని చెప్పారు. ఇందులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ మూడేళ్లకే కుంగిపోయింది. నిట్టనిలువునా ఫిల్లర్లకు పగుళ్లు వచ్చాయి. అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కుంగిపోయే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని కేంద్ర అధికారుల బృందం కూడా చెప్పింది. నీటి నిల్వ చేస్తే ప్రమాదం ఉందని హెచ్చరిచింది. గత ప్రభుత్వ హయాంలోనే ఈ బ్యారేజీల నుంచి నీటిని తీసివేశారు. ఇప్పుడేమో నీటిని నింపాలని బీఆర్ఎస్ వాళ్లు అంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో నీటి ప్రాజెక్టులు అస్తవ్యస్థం అయ్యాయి. కొత్త ఆయకట్టు ఎక్కడ కూడా లేదు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే కాకుండా… ఎక్కువ ఆయకట్టుకు నీటిని ఇవ్వటమే మా ప్రభుత్వ లక్ష్యం” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

రాయలసీమ ఎత్తిపోతల ద్వారా ఏపీ సర్కార్ నీళ్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తే… నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేదని, ఎన్నికల వేళ నార్లాపూర్ వద్ద కేవలం ఒక్క మోటర్ ను మాత్రమే నడిపించారని గుర్తు చేశారు. కృష్ణా జలాల నిర్వహణ విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కృష్ణా జలాల్లో ఉండే వాటా విషయంలో కూడా నాటి సర్కార్ పోరాటం చేయలేదన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే నోటిఫికేషన్ ను కూడా బీఆర్ఎస్ సర్కార్ సవాల్ చేయలేదని… ఆ ఫలితంగానే ఇవాళ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిందన్నారు. తెలంగాణలో పోలింగ్ జరిగిన రోజు కూడా సాగర్ ప్రాజెక్ట్ పై పోలీసులను ఉంచి.. ఏపీ సర్కార్ నీటిని మళ్లించుకుందన్నారు మంత్రి ఉత్తమ్. కనీసం ఈ ఘటనపై నాటి ప్రభుత్వం సరిగా స్పందించలేదని చెప్పారు.

మంత్రి ఉత్తమ్ మాట్లాడుతున్న సమయంలో…. బీఆర్ఎస్ సభ్యులు పలు అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో స్పీకర్ పలువురి ఎమ్మెల్యేలను హెచ్చరించారు. మంత్రి ప్రసంగం పూర్తి అయిన తర్వాత… బీఆర్ఎస్ కు సమయం ఇస్తామని, అప్పుడు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాట్లాడవచ్చని సూచించారు.

Whats_app_banner