TS Govt Caste Census : తెలంగాణ అసెంబ్లీలో కుల గణన తీర్మానం - ఎలాంటి అనుమానాలొద్దన్న సీఎం రేవంత్-caste census resolution moved in telangana legislative assembly 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Govt Caste Census : తెలంగాణ అసెంబ్లీలో కుల గణన తీర్మానం - ఎలాంటి అనుమానాలొద్దన్న సీఎం రేవంత్

TS Govt Caste Census : తెలంగాణ అసెంబ్లీలో కుల గణన తీర్మానం - ఎలాంటి అనుమానాలొద్దన్న సీఎం రేవంత్

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 16, 2024 02:56 PM IST

TS Govt Caste Census Resolution: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ బీసీ కుల గణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు.

అసెంబ్లీలో కుల గణన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం .
అసెంబ్లీలో కుల గణన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం .

TS Govt Caste Census Resolution 2024: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కుల గణనపై హామీ ఇచ్చి న కాంగ్రెస్ పార్టీ… అధికారంలోకి రావటంతో ఆ దిశగా అడుగులు వేసింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా… బీసీ కుల గణన తీర్మానాన్ని శాసన సభలో ప్రవేశపెట్టింది. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…. ఈ తీర్మానాన్ని సభ ముందుకు తీసుకువచ్చారు.

సూచనలు ఇవ్వండి - సీఎం రేవంత్ రెడ్డి

ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలు అంశాలను లెవనెత్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కులగణన తీర్మానం పై అనుమానం ఉంటే సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు. తీర్మానం పై ఏదైనా లీగల్ చిక్కుల పై అంశాలు ప్రతిపక్షాలకు తెలుస్తే తీర్మానం అమలు అయ్యే విధంగా సహకరించాలన్నారు. కుల గణన వల్ల అరశాతం ఉన్న వాళ్లకు బాధ ఉంటుందని కామెంట్స్ చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే మంత్రివర్గ ఆమోదంతో సభలో తీర్మానం పెడుతున్నామన్న ముఖ్యమంత్రి… ఈ పదేళ్లు మీరేం చేశారని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. ఈ తీర్మానం బలహీన వర్గాలను బలంగా తయారు చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్‌ చేసిన సమగ్ర కుటుంబ సర్వే సభలో ప్రవేశపెట్టారా? అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల కోసమే బీఆర్‌ఎస్‌ అప్పుడు ఆ సర్వే వివరాలను వాడుకుందన్నారు.

తెలంగాణ నుంచే మొదలు - భట్టి

ఇదే తీర్మానంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ…. బీసీ కులగ‌ణ‌న తీర్మాణం ప్ర‌వేశ‌పెట్ట‌డం దేశ చ‌రిత్ర‌లోనే చారిత్రాత్మ‌కమన్నారు. దేశ వ్యాప్తంగా కుల గ‌ణ‌న జరుగాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న‌దన్న ఆయన… ఎన్నిక‌ల్లో చాలా స్ప‌ష్టంగా మేము అధికారంలోకి రాగానే కుల గ‌ణ‌న చేస్తామ‌ని చెప్పామని గుర్తు చేశారు. కుల‌గ‌ణ‌న తెలంగాణ నుంచి మొద‌లు పెడ‌తామ‌ని చెప్పి క్యాబినెట్‌లో చాలా కులంకుశంగా చ‌ర్చించి నేడు అసెంబ్లీలో కుల గ‌ణ‌న‌పై తీర్మాణం పెట్ట‌డం జ‌రిగిందని చెప్పుకొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కుల‌ గ‌ణ‌న తో పాటు సోష‌ల్‌, ఎకాన‌మిక్‌, ఎడ్యుకేష‌న్‌, పొల్టిక‌ల్‌, ఎంప్లాయిమెంట్ అంశాల‌పై స‌ర్వే చేయ‌డం జ‌రుగుతుందన్నారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యులు కుల గ‌ణ‌న‌పై ఏలాంటి ఆందోల‌న గంద‌ర‌గోళం కావొద్దని సూచించారు. సామాజిక ఆర్ధిక రాజాకీయ మార్పున‌కు పునాధిగా తెలంగాణ మార‌బోతుందన్నారు. పది సంవ‌త్స‌రాలు అధికారంలోకి ఉన్న గ‌త బిఆర్ఎస్ ప్ర‌భుత్వం కుల గ‌ణ‌న చేయ‌లేదన్న భట్టి… ఇప్పుడు కుల గ‌ణ‌న చేయాల‌ని ఈ ప్ర‌భుత్వం తీసుకున్న మంచి కార్యాక్ర‌మానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండ ర‌న్నింగ్ కామెంట్రీ చేయ‌డం స‌రికాదని హితవు పలికారు.

అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన తీర్మానంపై పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ తీర్మానాన్ని స్వాగతిస్తూనే… పలు అంశాలను ప్రస్తావించారు. కులగణనపై తీర్మానం మాత్రమే కాదు చట్టం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా… ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంలో… పూర్తిస్థాయిలో స్పష్టత లేదన్నారు. ఎలాంటి చట్ట బద్ధత లేకుండా తీర్మానం పెడితే లాభం ఉండదన్నారు. కులగణన చేప్పట్టిన పలు రాష్ట్రాలు న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని…. అలాంటివి రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నంతో పాటు సీఎం, డిప్యూటీ సీఎం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

IPL_Entry_Point