Black Color watch: నలుపు రంగు వాచ్ ధరించకూడదా? శుభ కార్యాలకు నలుపు రంగు ఎందుకు ధరించరు?
Black color watch: చాలా మంది చేతికి నలుపు రంగు వాచ్ పెట్టుకుంటారు. కానీ నలుపు అశుభంగా పరిగణిస్తారు ఎందుకు? శుభ కార్యాల సమయంలో నలుపు రంగు దుస్తులు ఎందుకు వేసుకోరు?
Black color watch: వివిధ సంస్కృతులు, మతాల ప్రకారం అన్ని రంగులు వేర్వేరు అర్థాలని కలిగి ఉంటాయి. దేవతలకు ఇష్టమైన రంగులు ఉంటాయి. ఆ రంగు వస్త్రాలు సమర్పించడం లేదంటే పూలు పూజకి ఉపయోగించడం వల్ల దేవతలు సంతోషిస్తారని నమ్ముతారు. సరస్వతీ దేవికి తెలుపు, హనుమంతుడికి సింధూరం, సూర్య భగవానుడికి ఎరుపు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రంగు ఇష్టంగా చెప్తారు.
పవిత్రమైన కార్యక్రమాలు, శుభ కార్యాల సమయంలో ఎక్కువగా పసుపు, ఎరుపు రంగు వస్త్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. కానీ నలుపు మాత్రం పక్కన పెట్టేస్తారు. ఇది అశుభ సూచకానికి సంకేతంగా పరిగణిస్తారు. కానీ నిజానికి నలుపు రంగు చాలా మందికి ఫేవరెట్ కలర్. మన చుట్టుపక్కల ఎంతో మంది నలుపు రంగు వస్తువులు వినియోగిస్తారు. వాటిలో చేతికి నలుపు రంగు వాచ్ ఉంటుంది. మరికొంతమంది బ్లాక్ కలర్ ఫోన్ ఉపయోగిస్తారు. ఇలా ఏదో ఒక సందర్భంలో నలుపు వినియోగిస్తూనే ఉంటారు.
నలుపు అశుభమా?
ఈ ఫ్యాషన్ ప్రపంచంలో బ్లాక్ కలర్ డ్రెస్, వాచ్, బూట్లు ఎక్కువగా ధరించేందుకు ఇష్టపడతారు. కానీ శుభ కార్యాల విషయానికి వస్తే మాత్రం నలుపు శుభప్రదంగా పరిగణించరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా నలుపు రంగు వాచ్ కొంతమంది పెట్టుకోకూడదని చెప్తారు. ఇది వారి పరిస్థితుల్లో తీవ్ర మార్పులకు కారణంగా మారుతుందని హెచ్చరిస్తారు.
హిందూ మతంలో వివాహం అయిన తర్వాత ఒక ఏడాది పాటు కొత్త దంపతులు నలుపు రంగు వస్తువులు ఉపయోగించకూడదని చెప్తారు. బ్లాక్ బెల్ట్ ఉన్న వాచ్ ధరించడం వల్ల చెడు శకునం ఆహ్వానిస్తుందని అంటారు. అయితే నిజంగానే నలుపు రంగు వాచ్ పెట్టుకోకూడదా? ఇది అశుభానికి సంకేతమా అంటే కొందరు కాదని, మరికొందరు అవునని వాదిస్తారు? అయితే వీటిలో నిజమెంత?
బ్లాక్ బెల్ట్ వాచ్ పెట్టుకోకూడదా?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బ్లాక్ బెల్ట్ ఉన్న వాచ్ ఎప్పుడు చెడు శకునాన్ని సూచించదు. నలుపు రంగు శనీశ్వరుడితో ముడి పడి ఉంటుంది. శనీశ్వరుడు ఆశీస్సులు ఉంటే ఏ పనిలోనైనా విజయం వరిస్తుంది. అందుకే రాజకీయ ప్రముఖులు ఎక్కువగా బ్లాక్ బెల్ట్ ఉన్న వాచ్ ధరిస్తూ ఉంటారు. వాళ్ళకి శని ఆశీస్సులు చాలా ముఖ్యమైనది.
జాతకంలో శని స్థానం మంచిగా బలంగా ఉంటే జ్యోతిష్యులు సైతం నలుపు రంగు ధరించమని సూచిస్తారు. అలాగే కొంతమంది నలుపు రంగు రాయి ఉన్న ఉంగరం లేదంటే బ్లాక్ బెల్ట్ ఉన్న వాచ్ ధరించమని సలహా ఇస్తారు. అలా శని ఆశీస్సులు పొందేందుకు ఇది ఒక మార్గంగా భావిస్తారు. శని అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తికి సమాజంలో గౌరవం, డబ్బు, ప్రజాదరణ కూడా పెరుగుతుంది. అందుకే బ్లాక్ బెల్ట్ వాచ్ ఎప్పుడు అశుభ శకునంగా పరిగణించరు.
నలుపు రంగు ఎప్పుడు ధరించకూడదు?
హిందూ సంప్రదాయం ప్రకారం పండగలు, ప్రత్యేకమైన శుభ కార్యాల సమయంలో నలుపు రంగు ధరించడం మంచిది కాదని భావిస్తారు. ఈ రంగు సంతాపంతో ముడి పడి ఉంటుంది. చెడు శక్తిని సూచిస్తుందని నమ్ముతారు. చీకటి, మరణానికి సంకేతంగా భావిస్తారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నరదిష్టి తగలకుండా ఉండటం కోసం నలుపు రంగునే ఆశ్రయిస్తారు.
ఏ వారం నలుపు రంగు ధరించకూడదు
సోమవారం శివుడికి అంకితం చేయబడి ఉంటుంది. ఆయన్ని అంతిమ దేవుడిగా పరిగణిస్తారు. అత్యంత శక్తిమంతుడు. హిందూ పురాణాల ప్రకారం శివుడిని విధ్వంసకుడిగా చూస్తారు. అందుకే సోమవారం నలుపు రంగు ధరించకుండా ఉంటారు. ఆరోజు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు పాలు, తేనెతో అభిషేకించాలి.
మంగళవారం కూడా నలుపు రంగు ధరించరు. ఎందుకంటే కుజుడు, శని శత్రువులుగా నమ్ముతారు. మంగళవారం కుజుడుకి సంబంధించిందని చెప్తారు. ఆరోజు శనికి ఇష్టమైన రంగు ధరించడం అశుభంగా పరిగణిస్తారు. అలాగే హనుమంతుడికి ఇష్టమైన రోజు కూడా మంగళవారమే. ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆరోజు ఎరుపు లేదా కుంకుమ రంగు దుస్తులు ధరిస్తారు.