Lord shiva: శివుడిని సోమవారం పూజించడం వెనుక ఉన్న కథ గురించి తెలుసా?-why lord shiva worshipped on monday what is story behind this ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Shiva: శివుడిని సోమవారం పూజించడం వెనుక ఉన్న కథ గురించి తెలుసా?

Lord shiva: శివుడిని సోమవారం పూజించడం వెనుక ఉన్న కథ గురించి తెలుసా?

Gunti Soundarya HT Telugu
Dec 15, 2023 09:00 AM IST

Lord shiva: సోమవారం శివుడిని పూజ చేసి అభిషేకం చేస్తే అందుకు ఫలితం తప్పకుండా దక్కుతుందని భక్తులు నమ్ముతారు. అసలు సోమవారం ఎందుకు పూజించాలో తెలుసా?

శివుడిని సోమవారం ఎందుకు పూజిస్తారు?
శివుడిని సోమవారం ఎందుకు పూజిస్తారు? (pixabay )

Lord shiva: సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరిన కోర్కెలు తీరుస్తాడని, సమస్యల నుంచి గట్టెక్కిస్తాడని నమ్ముతారు. అసలు సోమవారానికి, శివుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా? దీని వెనుక చిన్న కథ ఉందని పురాణాలు చెబుతున్నాయి. సోమ్ అంటే చంద్రుడి అని అర్థం. దక్షరాజు పెట్టిన శాపం నుంచి శివుడు చంద్రుడిని కాపాడతాడు. అందుకే శివుడిని సోమనాథుడని పిలుస్తారు.

ఏమిటి ఆ శాపం?

దక్ష రాజు తన 27 మంది కుమార్తెలని చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఈ 27 మంది భార్యల్ని 27 నక్షత్రాలుగా సూచిస్తారు. చంద్రుడికి అందరిలో కంటే రోహిణి అంటే ఎక్కువ ఇష్టం. ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశాడు. చంద్రుడు తమని పట్టించుకోవడం లేదని మిగిలిన భార్యలు తమ తండ్రి దక్షుడి వద్దకి వెళ్ళి గోడు వెళ్లబోసుకున్నారు.

కుమార్తెల బాధ విన్న చంద్రుడు మిగిలిన వారిని కూడ రోహిణితో సమానంగా చూసుకోమని చెప్తాడు. కానీ చంద్రుడు తన తీరు మార్చుకోకపోయే సరికి దక్షుడు ఆగ్రహించి శపిస్తాడు. దక్షుడి శాపం వల్ల చంద్రుడు క్రమ కరంగా పరిమాణం తగ్గిపోతూ తన ప్రభను కోల్పోవడం జరిగింది. తన ఉనికికె ప్రమాదం వచ్చిందని అర్థం చేసుకున్న చంద్రుడు బ్రహ్మ దేవుడి దగ్గరకి వెళ్ళి మొరపెట్టుకున్నాడు.

బ్రహ్మ సలహా.. శివుడికి పూజ

చంద్రుడి మొర ఆలకించిన బ్రహ్మ ఒక సలహా ఇచ్చాడు. ఈ సమస్య నుంచి శివుడు మాత్రమే బయట పడేయగలుగుతాడని చెప్తాడు. ఆయన్ని ప్రార్థించమని సలహా ఇస్తాడు. బ్రహ్మ సూచనల మేరకు చంద్రుడి శివుడిని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఎన్ని కష్టాలు ఎదురైన చంద్రుడి అన్నింటినీ తట్టుకుంటూ శివుడు ప్రసన్నం అయ్యే వరకు పూజించాడు. చంద్రుడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు.

అలా అమావాస్య, పౌర్ణమి వచ్చాయి

దక్షుడు పెట్టిన శాపం గురించి చంద్రుడు శివుడుకి చెప్పుకుంటాడు. తిరిగి తన శక్తి పొందే వరం ప్రసాదిస్తాడు. కానీ అప్పటికే దక్ష మహారాజు పెట్టిన శాపం వల్ల చంద్రుడు తన ప్రభని కోల్పోయాడు. దీంతో ప్రతి మాసంలో 15 రోజులు ప్రభని కోల్పోతూ పరిమాణం తగ్గుతూ అమావాస్యగా కనిపించాడు. ఆ తర్వాత 15 రోజులు తిరిగి తన ప్రభని పరిమాణాన్ని పొందుకుంటాడని పరమశివుడు వరం ఇస్తాడు. అలా అమావాస్య, పౌర్ణమి వచ్చాయని కథ చెప్తారు.

సోమవారం అందుకే ఇష్టం

చంద్రుడిని సోముడు అని కూడా పిలుస్తారు. దక్షుడి శాపం నుంచి చంద్రుడిని రక్షించినందుకు గాను పరమశివుడిని చంద్రశేఖరుడు, సోమనాథుడు అని కూడా పిలుస్తారు. ఈ కారణం వల్ల సోమవారం అత్యంత భక్తి శ్రద్దలతో శివుడిని ఆరాధిస్తారు. అలా చేస్తే మన కష్టాల నుంచి గట్టెక్కించి తిరిగి సంతోషం ప్రసాదిస్తాడనే నమ్మకంతో భక్తులు పూజిస్తారు.

WhatsApp channel