Kobbari Pulao: కొబ్బరి పులావ్ ఇలా చేశారంటే రుచి మామూలుగా ఉండదు
Kobbari Pulao: పచ్చి కొబ్బరితో చేసే కొబ్బరి పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి జతగా చికెన్ కర్రీ తింటే ఆహా అనిపించేలా అదిరిపోతుంది. ఇక్కడ మేము కొబ్బరి పులావ్ రెసిపీ ఇచ్చాము.
Kobbari Pulao: తెలుగిళ్లల్లో కొబ్బరికాయల వాడకం ఎక్కువే. వాటిని కొబ్బరి పచ్చడిగా ఎక్కువమంది చేసేస్తూ ఉంటారు. ఒకసారి దాంతో కొబ్బరి పులావ్ చేసుకొని చూడండి. కొబ్బరి పులావ్ కి జతగా మటన్ కూర లేదా చికెన్ కూర ఉంటే వాటి కాంబినేషన్ అదిరిపోతుంది. కొబ్బరి పులావ్ చేయడం చాలా సులువు.
కొబ్బరి పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
పచ్చి కొబ్బరి ముక్కలు - ఒక కప్పు
బాస్మతి బియ్యం - ఒక కప్పు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - నాలుగు
యాలకులు - రెండు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - మూడు
పసుపు - పావు స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
పుదీనా తరుగు - మూడు స్పూన్లు
నీరు - తగినంత
బిర్యానీ ఆకు - రెండు ఆకులు
కొబ్బరి పులావ్ రెసిపీ
1. పచ్చి కొబ్బరిని తీసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దాంట్లో నీళ్లు వేసి కొబ్బరి పాలను వేరు చేయాలి.
2. ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి.
3. స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు వేసి వేయించుకోవాలి.
4. అవి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి.
5. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.
6. పసుపును వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
7. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఆ బియ్యం ఉడకడానికి సరిపడా కొబ్బరి పాలలో నీళ్లు కలిపి వేయాలి.
8. పైన కొత్తిమీర తరుగును, పుదీనా తరుగును చల్లుకోవాలి.
9. కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా వదిలేయాలి.
10. ఆవిరి పోయాక తీస్తే ఘుమఘుమలాడే కొబ్బరి పులావ్ రెడీ అయిపోతుంది. దీన్ని తిన్నారంటే అమోఘంగా ఉందంటారు. ఈ పులావ్ కు పక్కన చికెన్ కర్రీ ఉంటే ఆ రుచే వేరు. ఒక్కసారి తిని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.
కొబ్బరి పులావ్ పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీగా వినియోగించవచ్చు. రాత్రిపూట లైట్ గా డిన్నర్ తినాలనుకుంటే ఒక కప్పు కొబ్బరి పులావ్ తింటే సరిపోతుంది. కొబ్బరి పులావ్ లా చికెన్ గ్రేవీ లేదా మటన్ గ్రేవీ వేసుకొని కలుపుకొని తింటే స్వర్గం కనిపిస్తుంది. ఆహార ప్రియులకు ఈ రెండింటి కాంబినేషన్ కచ్చితంగా నచ్చుతుంది.