Green Mirchi Chutney: స్పైసీగా పచ్చిమిర్చి పచ్చడి ట్రై చేయండి, వేడి అన్నం లో టేస్టీగా ఉంటుంది-green mirchi chutney recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Green Mirchi Chutney: స్పైసీగా పచ్చిమిర్చి పచ్చడి ట్రై చేయండి, వేడి అన్నం లో టేస్టీగా ఉంటుంది

Green Mirchi Chutney: స్పైసీగా పచ్చిమిర్చి పచ్చడి ట్రై చేయండి, వేడి అన్నం లో టేస్టీగా ఉంటుంది

Haritha Chappa HT Telugu
Apr 24, 2024 06:38 PM IST

Green Mirchi Chutney: ఆంధ్ర స్టైల్ లో పచ్చిమిర్చి పచ్చడి ఒకసారి చేసి చూడండి... అందరికీ నచ్చడం ఖాయం. స్పైసీగా తినాలనుకునే వారికి ఈ పచ్చిమిర్చి పచ్చడి కచ్చితంగా నచ్చుతుంది.

పచ్చి మిరపకాయల చట్నీ రెసిపీ
పచ్చి మిరపకాయల చట్నీ రెసిపీ (Home Cooking Show/ Youtube)

Green Mirchi Chutney: పచ్చిమిర్చి పచ్చడి అనగానే... మరీ తినలేనంత కారంగా ఉంటుందేమో అనుకోవద్దు. తినగలిగే కారంతోనే ఉంటుంది. దీనిలో అనేక రకాల పదార్థాలు కూడా వేస్తాము. కాబట్టి రుచి అదిరిపోతుంది. కారం మద్యస్థంగా ఉండే పచ్చిమిర్చిని తీసుకొని చట్నీని చేసి చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం. అందులోను వేడి వేడి అన్నంలో ఈ పచ్చిమిర్చి చట్నీని కలుపుకొని తింటే ఆ రుచే వేరు. ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్లీ మళ్లీ చేసుకుంటారు. కేవలం అన్నంలోనే కాదు, దోశ, ఇడ్లీలో కూడా తినవచ్చు.

పచ్చిమిర్చి పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

పచ్చిమిరపకాయలు - పావు కిలో

మెంతి గింజలు - అర స్పూను

ఆవాలు - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

కరివేపాకులు - గుప్పెడు

మినప్పప్పు - ఒక స్పూను

నూనె - నాలుగు స్పూన్లు

చింతపండు - నిమ్మకాయ సైజులో

బెల్లం తురుము - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పచ్చిమిర్చి పచ్చడి రెసిపీ

1. పచ్చిమిర్చి పచ్చడి చేసేందుకు తక్కువ కారం ఉండే పచ్చిమిర్చిని ఎంపిక చేసుకోకండి. అలా అని మరీ ఘాటు అధికంగా ఉన్నవి కూడా వద్దు. మీడియం స్థాయిలో ఉన్న పచ్చిమిర్చిని ఎంపిక చేసుకుంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది.

2. పచ్చిమిర్చి కాడలను తీసి వాటిని శుభ్రంగా కడిగి గాలికి ఆరబెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. ఆ నూనెలో ఆవాలు, మెంతులు వేసి వేయించాలి.

5. వేగిన మెంతులలో, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకులు కూడా వేసి వేయించి వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

6. ఇప్పుడు అదే కళాయిలో మరి కాస్త నూనె వేయాలి.

7. మిరపకాయలను అందులో వేసి చిన్న మంట మీద వేయించాలి.

8. అవి మెత్తగా అయ్యేవరకు మగ్గించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి.

9. పచ్చిమిర్చి వేడి తగ్గాక మిక్సీలో వేసి బెల్లం తురుమును కూడా కలపాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి.

10. చింతపండును ముందుగానే నానబెట్టుకొని ఐదు స్పూన్ల చింతపండు రసాన్ని కూడా అందులో వేయాలి.

11. వీటన్నింటినీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసి బాగా కలుపుకోవాలి.

12. దీన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఈ పచ్చడికి తాలింపు వేసుకోవాలి.

13. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆవాలు, మినప్పప్పు, కరివేపాకులు, జీలకర్ర వేసి వేయించి ఈ పచ్చడిపై పోయాలి.

14. అంతే పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయినట్టే.

15. వేడి వేడి అన్నంలో ఈ పచ్చిమిర్చి పచ్చడిని కలుపుకొని తినండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.

పిల్లలకు ఈ పచ్చిమిర్చి పచ్చడిని పెట్టకండి. వారు ఈ కారాన్ని తట్టుకోలేకపోవచ్చు. కానీ పెద్దలకు మాత్రమే ఇది కచ్చితంగా నచ్చుతుంది. దోశ, ఇడ్లీలో అదిరిపోతుంది. ఒక్కసారి వండుకొని తింటే మీరే మళ్ళీ మళ్ళీ తింటారు. పచ్చిమిర్చిలో ఉండే పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి.

పచ్చిమిర్చిని కేవలం కారం కోసమే కూరల్లో వేసుకుంటాం అనుకుంటారు. కానీ నిజానికి పచ్చిమిరపకాయల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి పచ్చిమిరపకాయలను కూడా ఇలా చట్నీల రూపంలో తీసుకోవడం మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మన జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

టాపిక్