Bellam Annam Recipe : బెల్లం అన్నం ఇలా చేస్తే.. చాలా ఇష్టంగా తింటారు-how to prepare sweet jaggery rice bellam annam recipe in 20 minutes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bellam Annam Recipe : బెల్లం అన్నం ఇలా చేస్తే.. చాలా ఇష్టంగా తింటారు

Bellam Annam Recipe : బెల్లం అన్నం ఇలా చేస్తే.. చాలా ఇష్టంగా తింటారు

Anand Sai HT Telugu
Feb 04, 2024 11:00 AM IST

Sweet Jaggery Rice : బెల్లం అన్నం ఎప్పుడైనా తిన్నారా? తినేందుకు చాలా రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారు. బెల్లం అన్నం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

బెల్లం అన్నం తయారీ విధానం
బెల్లం అన్నం తయారీ విధానం (Unsplash)

కొన్నిసార్లు పిల్లలు తినేందుకు మారం చేస్తారు. కర్రీ బాగాలేదని, కారంగా ఉందని ఇలా రకరకాల వంకలు పెడుతారు. అయితే వారికి ఇష్టంగా చేసి పెట్టేందుకు కొన్ని ఆహారాలు ఉన్నాయి. అందులో ఒకటి బెల్లం అన్నం. ఇది తింటే ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు దొరుకుతాయి. మధ్యాహ్నం భోజనంలా కూడా చేయెుచ్చు. లేదంటే సాయంత్రం స్నాక్స్ సమయంలో తీసుకోవచ్చు.

నిజానికి బెల్లం అన్నం ఎక్కువగా పండుగల సమయంలో చేస్తుంటారు. మీరు కావాలంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇందులో బెల్లం, పాలు, డ్రైఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది రుచికరమైన తీపి వంటకం. అన్నంతో చేసే సింపుల్ రెసిపీ. సమయం కూడా ఎక్కువగా పట్టదు.

బియ్యం, బెల్లం, నెయ్యి, జీడిపప్పు, ఎండుద్రాక్షలను ఉపయోగించి బెల్లం అన్నం చేసుకోవచ్చు. సులభమైన తీపి వంటకంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఈ రెసిపీని తయారు చేస్తారు. మీరు దీని రుచిని పొందేందుకు నచ్చిన డ్రైఫ్రూట్స్ వేసుకోవచ్చు.

బెల్లం అన్నం చేసేందుకు కావాల్సిన పదార్థాలు

బియ్యం - 400 గ్రాములు

బెల్లం - 250 గ్రాములు

పాలు - కొద్దిగా

నెయ్యి - 100 గ్రాములు

బాదం - 1/4 కప్పు

ఏలకుల పొడి - 1 tsp

ఎండుద్రాక్ష - 1/4 కప్పు

బెల్లం అన్నం తయారీ విధానం

ముందుగా బియ్యాన్ని అవసరమైన మొత్తంలో తీసుకుని 4-5 సార్లు కడగాలి. సుమారు 15-20 నిమిషాలు నానబెట్టాలి.

గ్యాస్ మీద పాన్ పెట్టాలి. రైస్‌కు సరిపడా నీటిని వేడి చేయండి. నీళ్లు మరిగేటప్పుడు నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. కాస్త రైస్ ఉడికించాలి.

బియ్యం ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.

తర్వాత మీడియం మంట మీద బాణలిలో నెయ్యి వేసి వేడి అయ్యేవరకు మరిగించాలి. నెయ్యి తగినంత వేడిగా ఉన్నప్పుడు పొడి బెల్లం వేయాలి. (బెల్లం పొడి అందుబాటులో లేకపోతే, బెల్లం ముక్కలుగా కట్ చేసి వేయవచ్చు.)

బెల్లం కరిగిపోవడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ మీకు అదే రుచిని ఇస్తుంది.

బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, ఉడికించిన బియ్యం, పచ్చి ఏలకుల పొడి వేయండి. అందులో పాలు కూడా పోసుకోవాలి.

కరిగించిన బెల్లంతో అన్నాన్ని బాగా కలపండి. దీనితో బియ్యం రంగు కొద్దిగా గోధుమ రంగులోకి మారుతుంది.

తరువాత మంటను మీడియం మీద పెట్టాలి. పాన్‌ను ఒక మూతతో కప్పి, బియ్యం సుమారు 5-8 నిమిషాలు ఉడికించాలి.

తర్వాత మీకు నచ్చిన బాదం, ఎండుద్రాక్ష వేసుకోవాలి. కాసేపు ఉడికించి దించుకోవాలి. స్వీట్ బెల్లం అన్నం తినేందుకు రెడీ అయినట్టే.

బెల్లం అన్నం రెసిపీ ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పాలలో పోషకాలు ఉంటాయి. ఏలకులు, బాదం, ద్రాక్ష కూడా శరీరానికి మంచి చేస్తాయి. ఈ రెసిపీని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం బెల్లం అన్నం రెసిపీని చేసేయండి. అనేక ప్రయోజనాలను అందిస్తుంది.