Varla Ramaiah | రేషన్ బియ్యంలో అక్రమాలు.. కోట్ల విలువైన బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్నారు
రేషన్ బియ్యంలో అక్రమాలు జరుగుతున్నట్టు టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీని వెనక బియ్యం మాఫియా ఉందన్నారు. సమగ్రంగా విచారణ చేసి అక్రమాలను అరికట్టాలని పేర్కొన్నారు.
రేషన్ బియ్యం అనేది.. పేదల ఆకలి తీరుస్తుందని.. టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. అలాంటిది బియ్యాన్ని.. విదేశాలకు తరలిస్తూ.. డబ్బులు చేసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ చేసి.. నిందితులను విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యం... విదేశాలకు తరలిపోవడం దారుణమన్నారు. కాకినాడ పోర్టు నుంచి.. పెద్ద మెుత్తంలో రేషన్ బియ్యం విదేశాలకు తరలిస్తున్నట్టు వర్ల చెప్పారు. ఈ మేరకు బియ్యం మాఫియాపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
'2020-21 లో రూ.7,972 కోట్ల విలువ గల 31.51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమంగా తరలించారు. 2021-22లో రూ.7,710 కోట్ల విలువ గల 30.3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమంగా ఎగుమతి చేశారు. ఐవరీకోస్ట్, టాంగో, సెనెగల్, బెనిన్, గునియా లాంటి ఆఫ్రికా దేశాలకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తు్న్నారు. కాకినాడ ఓడరేవు నుంచి ఎగుమతి చేసిన బియ్యం మొత్తం మన రాష్ట్రానిదే. అయితే ఈ పీడీఎస్ బియ్యం తరలింపు వెనక అధికార పార్టీ నేతలు ఉన్నట్టు ప్రచారం ఉంది. సమగ్ర విచారణ జరిపించాలి.' అని వర్ల రామయ్య అన్నారు.
వివేకా హత్య కేసులో జగన్ ను విచారణ చేయాలి: కొల్లు
వివేకా హత్య కేసులో సీఎం జగన్ ను విచారణ చేయాలని.. టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. అసలు నిందితులు ఎవరో గుర్తించి.. కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. హత్య జరిగిన రోజు అసత్య ప్రచారాలు చేశారని.. కావాలనే.. సొంత మీడియాలో చంద్రబాబే హత్య చేయించారంటూ ప్రచారం చేయించారని పేర్కొన్నారు. వివేకా మృతదేహానికి.. జగన్ మామ.. గంగిరెడ్డి కుట్లు వేయడం నేరమే కదా అన్నారు.
'ప్రతిపక్ష నాయకుడిగా సీఎం జగన్ ... సీబీఐ విచారణ కోరారు. జగన్ విషయం బయటకు వస్తుందనే సమయంలో సీబీఐపైనే ఆరోపణలు చేయించారు. అప్పు జేసి.. రూ.7 లక్షల కోట్లు తెచ్చారు. కానీ ఖర్చు చేసింది.. రూ.3 లక్షల కోట్లే. మిగిలిన డబ్బులు ఏం చేశారు. రాష్ట్రంలో అన్ని పదవులు తమ సామాజికవర్గానికే కేటాయిస్తున్నారు.' అని కొల్లు రవీంద్ర అన్నారు.