Pineapple badam Halwa: సాయంత్రం స్వీట్ రెసిపీ పైనాపిల్ బాదం హల్వా, చూస్తేనే నోరూరి పోతుంది-pineapple badam halwa recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pineapple Badam Halwa: సాయంత్రం స్వీట్ రెసిపీ పైనాపిల్ బాదం హల్వా, చూస్తేనే నోరూరి పోతుంది

Pineapple badam Halwa: సాయంత్రం స్వీట్ రెసిపీ పైనాపిల్ బాదం హల్వా, చూస్తేనే నోరూరి పోతుంది

Haritha Chappa HT Telugu
Jan 11, 2024 03:30 PM IST

Pineapple badam Halwa: సాయంత్రం ఏం తినాలా? అని ఆలోచిస్తున్నారా? పైనాపిల్ బాదం హల్వా తిని చూడండి. రెసిపీ చాలా సులువు.

పైనాపిల్ బాదం హల్వా
పైనాపిల్ బాదం హల్వా (pixabay)

Pineapple badam Halwa: ఎప్పుడూ ఒకే రకమైన స్వీట్లు తింటే బోర్ కొడుతుంది. ఒకసారి పైనాపిల్ బాదం హల్వా తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ పదార్థాలతో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇందులో వాడినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. కాబట్టి దీన్ని తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. పైనాపిల్ ముక్కలు, బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ముద్ద కోవా వంటి వాటితో దీన్ని తయారు చేస్తారు. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం.

పైనాపిల్ బాదం హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు

బాదంపప్పు - పావు కిలో

నెయ్యి - 150 గ్రాములు

ముద్ద కోవా - 150 గ్రాములు

జీడిపప్పు - గుప్పెడు

పైనాపిల్ ముక్కలు - ఒక కప్పు

చక్కెర - 100 గ్రాములు

యాలకుల పొడి - పావు స్పూను

పైనాపిల్ బాదం హల్వా రెసిపీ

1. పైనాపిల్‌ను శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. మంటను మీడియంలో పెట్టాలి.

3. తరిగిన పైనాపిల్ నేయిలో వేసి తేమ పోయేవరకు బాగా కలుపుతూ ఉండాలి.

4. ఇప్పుడు కొన్ని నీళ్లు కళాయిలో వేయాలి. మళ్ళీ పైనాపిల్ ముద్ద అయ్యేలా కలుపుతూ ఉండాలి.

5. బాదంపప్పులను రెండు గంటల ముందే నీళ్లల్లో నానబెట్టాలి.

6. వాటి పొట్టు తీసి మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేసుకోవాలి.

7. ఈ బాదంపప్పు ముద్దను కళాయిలోని పైనాపిల్ మిశ్రమంలో వేసి బాగా కలపాలి.

8. ఇప్పుడు పంచదారను, కోవా ముద్దను కూడా వేసి బాగా కలుపుకోవాలి.

9. మరీ జారుడుగా కాకుండా కాస్త ముద్దగా అయ్యాక స్టవ్ కట్టేయాలి.

10. పైన తరిగిన జీడిపప్పును చల్లుకోవాలి. అంతే వేడి వేడి పైనాపిల్ బాదం హల్వా రెడీ అయినట్టే.

ఇందులో బాదంపప్పును వినియోగించాం, వీటిని తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. వైద్యులు కూడా వీటిని కచ్చితంగా తినమని చెబుతారు. మరొక ముఖ్యపదార్థం పైనాపిల్. పైనాపిల్ అనేది విటమిన్ సి నిండిన పండు. దీనిలో కాల్షియం, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది. కొన్ని రకాల అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో జలుబు, జ్వరం, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా పైనాపిల్ లోని గుణాలు కాపాడుతాయి. ఆర్థరైటిస్ తో బాధపడేవారు పైనాపిల్ తో చేసిన వంటకాలు తినడం చాలా అవసరం.