Garlic Egg Fried Rice: వెల్లుల్లి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చాలా సులువు, ఇలా చేస్తే ఒక ముద్ద కూడా మిగలదు
Garlic Egg Fried Rice: కోడిగుడ్డు, వెల్లుల్లి... రెండూ ఆరోగ్యానికి మంచివే. ఈ రెండింటితో కలిపి చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ చాలా సులువు. వెల్లుల్లి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
Garlic Egg Fried Rice: గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అల్పాహారంగానే కాదు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో కూడా తినవచ్చు. ఇది తిన్నాక చాలా సేపు ఆకలి వేయకుండా అడ్డుకుంటుంది. అల్పాహారంగా తింటే లంచ్ చేసే వరకు శక్తిని అందిస్తూనే ఉంటుంది.
గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు
గుడ్డు - ఒకటి
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
అల్లం తరుగు - ఒక స్పూను
కారం - అర స్పూను
అన్నం - రెండు కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - ఒక స్పూను
సోయాసాస్ - ఒక స్పూన్
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు - రెండుటేబుల్ స్పూన్లు
నూనె - సరిపడినంత
గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
2. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి.
3. అందులోనే స్ప్రింగ్ ఆనియన్లు, అల్లం తరుగు, కారం వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
4. ఇప్పుడు గుడ్డును పగలకొట్టి వేయాలి. గుడ్డును బాగా కలపాలి.
5. అందులో ఉడికించిన అన్నాన్ని వేసి పొడిపొడిగా వచ్చేలా కలపాలి.
6. పైన రుచికి సరిపడా ఉప్పును, మిరియాల పొడిని చల్లుకోవాలి.
7. సోయాసాస్ ను వేసి అన్నం అంతా కలిసేలా కలపాలి.
8. మళ్లీ అన్నం పైన స్ప్రింగ్ ఆనియన్ చల్లాలి.
9. ఒక నిమిషం పాటు వేయించి పైన కొత్తిమీర తరుగు చల్లుకోవాలి.
10. అంతే టేస్టీ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ సిద్ధమైనట్టే.
ఈ రెసిపీలో ముఖ్యంగా వాడింది వెల్లుల్లి కోడిగుడ్డు. ఈ రెండూ కూడా మన శరీరానికి అత్యవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. వెల్లుల్లి తినడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ, విటమిన్ బి వంటివి అందుతాయి. వారికి వెల్లుల్లి ఎంతో సాయపడుతుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ చేరిన కొవ్వును కరిగించడంలో ఇది ఉపయోగపడుతుంది. శరీరంలో చేరిన వ్యర్ధాలను, విషాలను తొలగించడంలో కూడా వెల్లుల్లి ముందుంటుంది. వెల్లుల్లి రోజూ తినేవారికి జలుబు, దగ్గు వంటివి త్వరగా రావు. ఎందుకంటే రోగనిరోధక శక్తిని వెల్లుల్లి పెంచుతుంది. రోజుకి రెండు వెల్లుల్లి రెబ్బలు తిన్నాచాలు. రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. ఇందులో వాడిన కోడి గుడ్డులో మనకు అత్యవసరమైన ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కోడిగుడ్డును అందరూ తినాలని, ఇది శాఖాహారమేనని ఇప్పటికే ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. ప్రతిరోజూ ఒక ఉడకబెట్టిన కోడి గుడ్డును తింటే ఎన్నో రోగాలు దూరంగా ఉంటాయి. కోడిగుడ్డులో ఉండే మంచి కొలెస్ట్రాల్ మన శరీరానికి, గుండెకు మేలు చేస్తుంది. గుడ్డులో అమైనో ఆమ్లాలు ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు కోడిగుడ్డు తినడం వల్ల రక్తపోటు పెరగకుండా అదుపులో ఉంటుంది. గుడ్డు తిన్న తర్వాత ఆకలి త్వరగా వేయుదు. కాబట్టి ఇతర ఆహారాలు కూడా తక్కువగా తింటారు. ఇందులో ఉండే ప్రోటీన్ జీర్ణం కావడానికి కాస్త సమయం అవసరం. అలాగే శక్తి కూడా కావాలి. కాబట్టి బరువును కూడా అదుపులోనే ఉంచుతుంది. ప్రతిరోజు ఒక కోడి గుడ్డును ఉడికించి తినడం అలవాటు చేసుకోండి.