Methi Pulao: మెంతి పులావ్ ఇలా చేసి చికెన్ కర్రీతో తింటే రుచి అదరహో, రెసిపీ ఇదిగోండి-methi pulao recipe in telugu know how to make this rice recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Methi Pulao: మెంతి పులావ్ ఇలా చేసి చికెన్ కర్రీతో తింటే రుచి అదరహో, రెసిపీ ఇదిగోండి

Methi Pulao: మెంతి పులావ్ ఇలా చేసి చికెన్ కర్రీతో తింటే రుచి అదరహో, రెసిపీ ఇదిగోండి

Haritha Chappa HT Telugu

Methi Pulao: ఎప్పుడూ ఒకేలాంటి పులావ్ తింటే బోర్ కొట్టేస్తుంది. ఒకసారి టేస్టీగా మెంతి పులావ్ చేసి చూడండి. ఇది మీకు నచ్చడం ఖాయం.

మెంతి పులావ్ రెసిపీ

Methi Pulao: పనీర్ పులావ్, చికెన్ పలావ్, పుదీనా పలావ్... ఇలా ఎన్నో రకాల పలావులు తిని ఉంటారు. కానీ మెంతి పలావును చేసుకునే వారి సంఖ్య తక్కువ. మెంతి ఆకులను పప్పులో మాత్రమే తీసుకుని తింటూ ఉంటారు. నిజానికి మెంతి పలావ్ రుచి అదిరిపోతుంది. చికెన్ కర్రీతో తింటే ఆ రుచి వేరు. దీన్ని సులువుగా ఎలా చేయాలో ఇక్కడ చెప్పాము. ఫాలో అయిపొండి.

మెంతి పలావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు

బాస్మతి రైస్ - రెండు కప్పులు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

పచ్చిమిర్చి - ఐదు

లవంగాలు - మూడు

యాలకులు - మూడు

జీలకర్ర - ఒక స్పూన్

బిర్యానీ ఆకులు - రెండు

అల్లం - చిన్న ముక్క

వెల్లుల్లి రెబ్బలు - ఐదు

జీడిపప్పు - గుప్పెడు

పుదీనా ఆకులు - ఒక కట్ట

మెంతి ఆకులు - ఒక కట్ట

ఉల్లిపాయ - ఒకటి

ఉప్పు - రుచికి సరిపడా

నీరు - తగినన్ని

నూనె - సరిపడినంత

మెంతి పులావ్ రెసిపీ

1. బాస్మతి బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నూనె వేయాలి.

3. నూనె వేడెక్కాక లవంగాలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు, జీలకర్ర, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు అన్నీ వేసి వేయించుకోవాలి.

4. అవి వేగాక అల్లం వెల్లుల్లిని ముద్దచేసి ఆ పేస్టుని కూడా వేసి వేయించుకోవాలి.

5. తర్వాత జీడిపప్పును వేసి వేయించుకోవాలి.

6. నిలువుగా తరిగిన పచ్చిమిర్చిని, నిలువుగా తరిగిన ఉల్లిపాయలను వేసి రంగు మారేవరకు వేయించాలి.

7. ఆ తర్వాత సన్నగా తరిగిన పుదీనాను, మెంతి ఆకులను వేసి వేయించుకోవాలి.

8. ఇవన్నీ ఇగురులాగా దగ్గరగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.

9. తర్వాత పసుపు పొడి వేసి కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.

10. ఒక నిమిషం వీటిని వేయించాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి కలుపుకోవాలి.

11. ఆ అన్నం ఉడకడానికి సరిపడా నీటిని వేసి కుక్కర్ మూత పెట్టేయాలి.

12. రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.

13. మూత తీస్తే టేస్టీ మెంతి పలావ్ రెడీ అయిపోతుంది.

14. ఒక స్పూన్ నెయ్యిని పైన అలా చల్లుకొని తినేందుకు సిద్ధమైపోండి.

15. దీనికి జతగా చికెన్ కర్రీ వండుకొని చూడండి. మీకు నచ్చడం ఖాయం.

మెంతి ఆకుల్లో ఎన్నో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉంటాయి. మెంతి ఆకుల తినడం వల్ల పేగు సమస్యలు రావు. అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా దూరంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు నొప్పి రాకుండా మెంతి ఆకు అడ్డుకుంటుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా తినాల్సిన ఆకుకూరల్లో మెంతి ఆకులు ఒకటి. డయాబెటిస్ పేషెంట్లు అప్పుడప్పుడు మెంతి పలావును చేసుకుని తింటే ఎంతో మంచిది. చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీతో తింటే అదిరిపోతుంది.