Peanut Sprouts । మొలకెత్తిన వేరుశనగలు తినండి.. టైం పాస్ కోసం కాదు, బోలెడు ప్రయోజనాలున్నాయి!-know how to grow peanut sprouts and kacha badam amazing health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know How To Grow Peanut Sprouts And Kacha Badam Amazing Health Benefits

Peanut Sprouts । మొలకెత్తిన వేరుశనగలు తినండి.. టైం పాస్ కోసం కాదు, బోలెడు ప్రయోజనాలున్నాయి!

HT Telugu Desk HT Telugu
Dec 15, 2022 08:31 PM IST

Peanut Sprouts Health Benefits: మీకు పల్లికాయలు ఇష్టమా? మొలకెత్తిన వేరుశనగ కాయలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎలా మొలకెత్తించాలి, తింటే ఏం లాభమో ఇక్కడ చూడండి.

Peanut Sprouts Health Benefits
Peanut Sprouts Health Benefits (Stock Photo)

బాదాం బాదాం దాదా కచ్చా బాదాం.. అమర్ కచ్చే నైకో బాబు వజా బాదాం. అనే పాట ఎంత పాపులర్ అయిందో మీకు తెలిసిందే. ఇక్కడ కచ్చా బాదాం అంటే పచ్చి వేరుశనగ కాయలు అని అర్థం. ఈ పల్లికాయలతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, పైగా అందరికీ ఇవి అందుబాటు ధరలో లభిస్తాయి. అందుకే వేరుశనగను 'పేదల బాదాం' అని కూడా పిలుస్తారు.

మరి వేరుశనగ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఉడకబెట్టిన వేరుశనగలు, వేయించిన వేరుశనగలు అందరినీ సంతృప్తిపరుస్తాయి. అయితే ఇలా ఉడకబెట్టడం, వేయించడం కాకుండా మొలకెత్తిన వేరుశనగలు తినడం వలన మరిన్ని అద్భుత ప్రయోజనాలు లభిస్తాయట.

మనకు మొలకెత్తిన గింజలు అంటే ఎక్కువగా పెసర్లు, తెల్ల శనగలు, అలసందలు వంటివే మాత్రమే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ మొలకెత్తిన వేరుశనగలు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది అని చాలా మందికి తెలియదు.

Peanut Sprouts Health Benefits - మొలకెత్తిన వేరుశనగలతో ఆరోగ్య ప్రయోజనాలు

2/3 కప్పు వేరుశనగలను చల్లటి నీటిలో 4-12 గంటలు నానబెట్టండి. ఆపైన బాగా ఝాడించి, నీరు పూర్తిగ పోయేలా చూడండి. అనంతరం ఒక గుడ్డను నానబెట్టి ఆ తర్వాత నీరు పిండేసి, ఆ గుడ్డలో ఈ వేరుశనగలను ఉంచాలి. ఒకరోజులో మొలకలు రావడం జరుగుతుంది.

ఈ మొలకెత్తిన వేరుశనగలను తినడం ద్వారా ఎన్ని విధాలుగా ఆరోగ్యానికి మేలు జరుగుతుందో ఇక్కడ తెలుసుకోండి.

గుండెకు మేలు

మొలకెత్తిన వేరుశెనగ ముఖ్యంగా గుండెకు మేలు చేస్తుంది. ఇందులో సమృద్ధిగా లభించే మెగ్నీషియం, పొటాషియం వంటి మూలకాలు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి. మొలకెత్తిన వేరుశనగలో గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.

అధిక బరువు సమతుల్యం

మొలకెత్తిన వేరుశనగ తినడం బరువు తగ్గడానికి చాలా మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి బరువును సమతుల్యం చేస్తాయి. ఇవి రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రిస్తాయి.

మలబద్ధకం నివారణకు

వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇది ప్రేగు కదలికలను కూడా సులభతరం చేస్తుంది. మొలకెత్తిన వేరుశనగ కూడా పొట్టను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.

డయాబెటీస్ వారికి మంచిది

మొలకెత్తిన వేరుశనగలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికంగా ఉంటాయి, ఇది మీ ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు మొలకెత్తిన వేరుశనగలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లోని ఒక నివేదిక ప్రకారం, మొలకెత్తిన వేరుశనగలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

కీళ్ల నొప్పులు దూరం

కీళ్ల నొప్పులతో బాధపడే వారు ప్రతిరోజూ కొన్ని మొలకెత్తిన వేరుశనగ తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని కాల్షియం ఎముకలను బలపరుస్తుంది.

జుట్టు పెరుగుదలకు

వేరుశెనగలో ఫోలేట్ పుష్కలంగా ఉండటమే కాకుండా విటమిన్ బి కూడా మంచి మొత్తంలో ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మొలకెత్తిన వేరుశెనగలో జుట్టును బలపరిచే మెగ్నీషియం కూడా ఉంటుంది.

అందువల్ల, మొలకెత్తిన వేరుశనగను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మర్చిపోవద్దు.

WhatsApp channel

సంబంధిత కథనం