Sprouts Idli । మొలకల ఇడ్లీలతో అల్పాహారం.. అనేక విధాలుగా ఆరోగ్యకరం!
ఉదయం అల్పాహారంగా మొలకెత్తిన విత్తనాలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే నేరుగా తినటానికి ఇబ్బందిగా ఉంటే వాటిని ఇడ్లీలుగా చేసుకోవచ్చు. స్ప్రౌట్స్ ఇడ్లీలు ఎలా చేసుకోవాలో ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.
ఆరోగ్యాన్ని ఎవరు కోరుకోరు..? అయితే ఆరోగ్యాన్ని పొందాలంటే మన ఆహరపు అలవాట్లు, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. మీరు అధిక బరువును నియంత్రించాలంటే కూడా అతిగా కష్టపడాల్సిన అవసరం లేదు. సరైన ఆహారాలు, సరైన విధానంలో తీసుకోవడం ద్వారా తేలికగా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. మీరు బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఉదయం లేచిన తర్వాత అల్పాహారంగా పచ్చి మొలకలు తీసుకోవాలని మీకు ఎవరైనా సలహా ఇచ్చి ఉండవచ్చు. అయితే ఎప్పుడూ సాంప్రదాయమైన రుచులకు అలవాటుపడి ఒక్కసారిగా ఆహారంలో మార్పులు చేసుకోవాలంటే అది కష్టంగా అనిపిస్తుంది. కానీ తయారు చేసుకునే విధానంలో మార్పు చేసుకుంటే తినడానికి సులభంగా ఉంటుంది, మంచి పోషకాలు శరీరానికి అందుతాయి.
మొలకలను నేరుగా కాకుండా ఇడ్లీలలో కలుపుకొని కూడా తినవచ్చు. మొలకలతో ఇడ్లీలను చేసుకోవచ్చు. ఈ ఇడ్లీలు తయారు చేసుకోవటం కూడా చాలా సులభం. సాధారణంగా మనం ఇడ్లీలు చేసేటపుడు మినపపప్పు, ఇడ్లీ రవ్వను కలుపుతాం. అయితే ఇక్కడ మొలకలను కలుపుకోవాల్సి ఉంటుంది. ఆ విధానం ఎలాగో ఇక్కడ అందించిన రెసిపీని చూసి తెలుసుకోండి. మొలకల ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూడండి.
కావలసినవి
- 200 గ్రాముల పెసర్లు
- 100 గ్రాముల మినప పప్పు
- 1/2 tsp మెంతులు
- 1 స్పూన్ ఉప్పు
- ఒక చిటికెడు బేకింగ్ సోడా
తయారీవిధానం
- మొలకల ఇడ్లీలో ముందుగా మీరు పెసర్లతో మొలకలు చేసుకోవాలి. ఒకరోజు ముందు పెసర్లను కడిగి రాత్రంతా నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని తీసివేసి ఒక మస్లిన్ గుడ్డలో పెసర్లను 8 గంటల పాటు ఉంచాలి. అప్పుడు వెళ్లి చూస్తే మొలకలు మొలిచి ఉంటాయి. వీటిని వెంటనే ఇడ్లీల తయారీకి ఉపయోగించాలి లేదా ఫ్రిజ్‌లో భద్రపరచాలి.
- మరోవైపు మినపపప్పును కూడా మెంతులతో కలిపి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. అనంతరం ఈ పప్పును మెత్తగా రుబ్బుకోవాలి.
- ఇక, మొలకెత్తిన పెసర్లను కూడా విడిగా మెత్తగా రుబ్బుకోవాలి.
- మెత్తగా రుబ్బుకున్న ఈ రెండు పప్పు బ్యాటర్లను ఒక గిన్నెలో కలిపేసి, మూతపెట్టి మరో 2 గంటల పాటు పులియబెట్టాలి. అనంతరం ఉప్పు, బేకింగ్ సోడా కలుపుకోవచ్చు.
- ఇప్పుడు ఇలా తయారైన మెత్తని పిండి బ్యాటర్ ను ఇడ్లీ పాత్రలో వేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి.
అంతే, స్ప్రౌట్స్ ఇడ్లీలు రెడీ అయినట్లే. మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకోండి.
సంబంధిత కథనం