Yoga for Constipation । మలబద్ధకం ఇబ్బంది పెడితే ఈ యోగా ఆసనాలు వేయండి, మిమ్మల్ని ఎవరూ ఆపలేరు!
Yoga for Constipation: నిన్న మసాలా ఫుడ్ బాగా తినేసి, అది జీర్ణంకాక ఈరోజు ఉదయం మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా? కొన్ని నిమిషాల పాటు ఈ యోగాసనాలు వేసి చూడండి.
మలబద్ధకం ఇప్పుడు ఒక సాధారణ సమస్యగా మారింది. మనలో చాలా మందికి ఈ సమస్య ఎదురవుతున్నా, దీనిని చాలా తేలికగా తీసుకుంటారు. కానీ తరచుగా ఈ సమస్య ఏర్పడుతుంటే కచ్చితంగా దీని నివారణకు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీర్ఘకాలికమైన మలబద్ధకం పెల్విక్ వ్యాధులు, ఇతర ఉదర సమస్యలకు దారితీస్తుంది.
మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు కేవలం ప్రేగు కదలికలు లేకపోవడమే కాదు, కడుపు నొప్పి, తలనొప్పులు కూడా ఉంటాయి. ఈ సమస్య రావటానికి కారణం తరచుగా విశ్రాంతి లేకపోవడం, అసంబంద్ధమైన పనిగంటలు, మాంసాహారం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఆహారంలో తాజాపండ్లు, కూరగాయలు లేకపోవడం, నీరు తక్కువగా తాగటం, మద్యపానం ఎక్కువగా చేయటం మొదలైన అనారోగ్యకరమైన జీవనశైలి కారణాల వలన మలబద్ధకం ఏర్పడుతుంది.
తరచుగా మలబద్ధకం సమస్య బాధిస్తుంటే తాత్కాలిక ఉపశమన చర్యలు కాకుండా, మళ్లీ మీ జీవితంలో మలబద్ధకం పునరావృతం కాకుండా నిరోధించడానికి యోగా ఉత్తమ మార్గంగా పనిచేస్తుంది. రోజువారీగా కొన్ని నిమిషాలపాటు యోగాభ్యాసం ప్రేగు కదలికలు, ఒత్తిడి, ఉబ్బరాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇంకా, శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది, వ్యవస్థలో రక్తం, ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది.
Yoga for Constipation- మలబద్ధకం నుంచి ఉపశమనం కోసం యోగాసనాలు
మలబద్ధకం నుండి ఉపశమనం కోసం ఇక్కడ కొన్ని యోగా ఆసనాలు సూచిస్తున్నాం, వీటిని క్రమం తప్పకుండా సాధన చేస్తే అంతా సెట్ అవుతుంది.
బద్ధ కోనాసనా (Butterfly Pose)
ఇది కూర్చుని చేసే ఒక గొప్ప ఆసనం. గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరిల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు బద్ధ కోనాసనా అభ్యాసం చేస్తే.. లోపలి తొడలు, గజ్జలు మరియు మోకాళ్లకు మంచి సాగతీత లభిస్తుంది. ఇది ప్రేగుల కదలికలో సహాయపడుతుంది, ఎక్కువ గంటలు నిలబడి నడవడం వల్ల కలిగే అలసట తొలగిపోతుంది. రుతుక్రమ అసౌకర్యం, రుతువిరతి లక్షణాల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది, గర్భిణీలకు సాఫీగా డెలివరీకి సహాయపడుతుంది.
అర్ధ-మత్స్యేంద్రసనా (Seated Half Spinal Twist Pose)
ఇది కూడా సౌకర్యంగా కూర్చుని చేసే ఆసనం. ఈ ఆసనం వేయడం వలన ప్యాంక్రియాస్, కాలేయం, ప్లీహము, మూత్రపిండాలు, కడుపు పనితీరును ప్రేరేపిస్తుంది. వెన్నెముకను మృదువుగా చేస్తుంది, వెన్నెముక స్థితిస్థాపకతను పెంచుతుంది.ఛాతీని విస్తరించి, ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది.
మయూరాసన (Peacock Pose)
ఇది కూర్చొని చేసే ఆసనం కాదు. ఈ ఆసనంలో భాగంగా బోర్లా పడుకొని, రెండు చేతులతో శరీరాని గాలిలో బ్యాలెన్స్ చేసే భంగిమ. ఈ ఆసనం ప్రాక్టీస్ చేయడం వలన కండరాలను బలోపేతం చేయడం, ముంజేతులు, మోచేతులు, తొడలు, వీపు (వెన్నెముక), ఛాతీ, మణికట్టు కీళ్లను బలోపేతం చేస్తుంది.మయూరాసనం శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది,మధుమేహం, పైల్స్‌కు అద్భుతమైన చికిత్సగా పేర్కొంటారు.
సంబంధిత కథనం