Yoga Asanas for Mental Health। మానసిక ఆరోగ్యం మెరుగుపడేందుకు ఉత్తమ యోగాసనాలు ఇవే
Yoga Asanas for Mental Health: యోగాతో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని యోగాసనాలు మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచి మెదడుపనితీరును మెరుగుపరుస్తాయి, తద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఆ యోగాసనాలు ఏమిటో ఇక్కడ చూడండి.
యోగా అనేది మనసును, శరీరాన్ని మన నియంత్రణలో ఉంచుకునేందుకు ఉపయోగపడే ఒక సాధనం. క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేయడం వల్ల శారీరక సమతుల్యతను మెరుగుపరచటమే కాకుండా ఒత్తిడి, ఆందోళన లక్షణాలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. డిప్రెషన్, యాంగ్జయిటీ డిజార్డర్, స్కిజోఫ్రెనియాతో సహా ఇతర మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులలో యోగా ఒక సహజమైన థెరపీలాగా ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నిరాశ, నిద్రలేమితో బాధపడేవారు యోగాభ్యాసాలు చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు.
యోగా భంగిమలను ఆచరించడం ద్వారా రెండు విధాల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. శారీరకంగా కండరాల బలోపేతానికి, వశ్యతను పెరుగుపరచటానికి, ఫిట్‌నెస్ కాపాడుకోవటానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మానసికంగానూ అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకున్నాం. మానసికంగా బాగుండాలంటే మెదడు పనితీరు బాగుండాలి. మెదడు కూడా ఒక కండరం లాంటిది, ఇది సరైన పనితీరును కనబరచాలంటే దీనికి వ్యాయామం అవసరం ఉంటుంది. అయితే మెదడు పని తీరును మెరుగుపరచడానికి యోగా ఉత్తమ మార్గం. కాబట్టి యోగా జ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది అనడంలోనూ ఆశ్చర్యం లేదు.
Yoga Asanas for Mental Health
యోగా సాధన చేసేవారు స్పష్టమైన ఆలోచనలను కలిగి ఉంటారు, విషయాన్ని త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. ఇది వ్యక్తుల్లో శ్రద్ధను, ఏకాగ్రతను పెంచుతుంది. తద్వారా ఏదైనా కొత్త విషయాన్ని కూడా సులభంగా నేర్చుకోగలుగుతారు.
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే కొన్ని యోగా భంగిమలు ఇక్కడ చూడండి.
సిద్ధాసనం
యోగా నిష్ణాత భంగిమ లేదా సిద్ధి భంగిమ అని కూడా పిలుస్తారు. ధ్యానం చేయడానికి ఈ భంగిమ ఒక గొప్ప మార్గం. ఈ యోగాసనం తుంటి, గజ్జలు లేదా లోపలి తొడ కండరాలను సరళంగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ భంగిమ మానసిక శక్తిని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.
ఆంజనేయాసనం
ఈ ఆసనం భుజాలు, మెడను మరింత ఫ్లెక్సిబుల్‌గా మార్చడంలో సహాయపడుతుంది. ఇది తొడలు, గజ్జలకు లోతైన సాగతీతను ఇస్తుంది. అలాగే ఛాతీ, భుజాలను సాగదీయడానికి సహాయపడుతుంది. ఈ వ్యాయామం తర్వాత శరీరం పునరుజ్జీవం పొందిన అనుభూతి కలుగుతుంది. లోపలి నుంచి శరీరానికి మరింత శక్తిని, స్థిరత్వాన్ని ఇస్తుంది. అదేవిధంగా మానసిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది.
ఉత్తనాసనం
ఈ శక్తివంతమైన ఆసనం వీపు కండరాలను సాగదీస్తుంది, బలపరుస్తుంది. తలను గుండె క్రింద ఉంచే ఉత్తనాసనం మెదడుకు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, మానసిక సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ భంగిమను క్రమం తప్పకుండా పాటించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది.
ఇవేకాకుండా ఇంకా చాలా భంగిమలు ఉన్నాయి. సేతుబంధాసన, శవాసన, విపరీతకరణి వంటి ఆసనాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
సంబంధిత కథనం