Sunday Thoughts | సెలవు రోజు ఎలాంటి పనులు చేయకండి, కానీ ఈ పనులు మాత్రం చేయండి!
వారం రోజుల తర్వాత వీకెండ్ మళ్లీ వచ్చేసింది. మరి మీరు ఏమైనా ప్లాన్ చేశారా? ఏమీ చేయకండి. అసలు ఈరోజు ఎలాంటి శ్రమ తీసుకోకండి. మిమ్మల్ని రీఫ్రెష్ చేసే కొన్ని వీకెండ్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో చూడండి.
వారంలో అన్ని రోజులు కష్టపడి పనిచేసి వీకెండ్‌లో ఒకరోజు సెలవు వస్తే ఎంత రిలీఫ్ ఉంటుంది కదా? ఎందుకంటే మన మైండ్ ప్రిపేర్ అయి ఉంటుంది, ఈరోజు పనిలేదు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అని. మరి అలాంటపుడు మీ వీకెండ్‌లో ఇంకా ఏం చేయాలి అని ఇంకా ఆలోచించడం ఎందుకు? ఏమీ చేయకండి, హాయిగా విశ్రాంతి తీసుకోండి. మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే అంశాలపై దృష్టిపెడతాడు. వారం రోజులుగా పని ఒత్తిళ్లతో శారీరకంగా, మానసికంగా చాలా అలసిపోయి ఉంటారు. కాబట్టి ఆదివారంలాగా ఒకరోజు సెలవు వచ్చినపుడు, ఇంకా ఏమైనా పనులు ఉంటే చూద్దాం అనుకోవద్దు. వారంలో ఒక్కరోజైనా మానసికంగా, శారీరకంగా ఎలాంటి శ్రమ లేకుండా చేసుకోండి, ఏ విధమైన ఒత్తిళ్లు లేని ప్రశాంతమైన రోజును గడపండి అయితే మీకు నచ్చిన పనులు చేయవచ్చు. మనకు నచ్చిన పనులు చేయటం అవి కూడా స్వార్థంగా మన కోసం మనం చేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మరుసటిరోజు మీరు ఫుల్ ఛార్జ్‌తో పనులు చేసుకోగలుగారు. మండే ఉదయం మూడ్ ఆఫ్ అయిపోరు.
కాబట్టి, ఆదివారం అయినా, మరెలాంటి సెలవు రోజైనా మీరు పాటించాల్సిన ఏకైక ధర్మం.. అసలు ఏమీ చేయకపోవడం. సెలవురోజు అంటే సెలవు లాగే ఉపయోగించుకోవాలి. పనిని పక్కన పెట్టేయండి. ఫోన్ లు, ల్యాప్ ట్యాప్ లు తెరవకండి. కుదరకపోతే 'డూ నాట్ డిస్టర్బ్ మోడ్‌లో పెట్టేయండి. సెలవు రోజున మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకునే ఐడియాలు ఇక్కడ కొన్ని అందిస్తున్నాం. వీటిలో మీకు నచ్చినవి ఫాలో అయిపోండి.
ఆదివారం మీ మెన్యూ ఇలా ఉండాలి
- ఎలాంటి ఆలోచనలు, గందరగోళం లేకుండా ప్రశాంతంగా నిద్రలేవండి. సూర్యోదయాన్ని ఆస్వాదించండి. టైంపాస్ కోసం మార్నింగ్ వాక్ చేయండి.
- మీకు నచ్చిన ప్లేలిస్ట్ సిద్ధం చేసుకొని కాసేపు మ్యూజిక్ వినండి లేదా యూట్యూబ్ లో చూస్తూ యోగా, జుంబాలాంటివి చేయండి.
- మీ ఇంట్లో మీకు నచ్చినట్లుగా కాఫీ చేసుకోండి. ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ తినండి.
- మీ పడకగదిని శుభ్రంగా సర్దుకోండి. మీ కార్, బైక్ శుభ్రం చేసుకోండి. ఇది ఒక వ్యాయామం అవుతుంది.
- చాలాసేపు విలాసవంతంగా స్నానం చేయండి. వారం రోజుల మురికి ఈ ఒక్కరోజే పోవాలి. వీలైతే స్నానానికి ముందు మసాజ్ చేసుకోండి.
- స్వీయ సంరక్షణ చర్యలు తీసుకోండి. ఫేస్ ప్యాక్ వేసుకోండి.
- మధ్యాహ్నం లంచ్ కోసం ఏదైనా కొత్త రెసిపీ ట్రై చేయండి. ఆ పనులు చేస్తూనే నెట్‌ఫ్లిక్స్ లో సినిమా లేదా కామెడీ షోలు చూడండి.
- కనీసం ఒక రెండు గంటల పాటు ఫోన్ లేకుండా గడపండి. వాట్సాప్‌లు, ఇమెయిల్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లు ఏవీ వద్దు. ఇలా ఉంటే మీకు ఎంత రిఫ్రెష్‌గా ఉంటుందో చూడండి.
- మధ్యాహ్నం అద్భుతమైన భోజనం చేయండి. వీలైతే ఒకరోజు బయటకు వెళ్లి తినండి, షాపింగ్ చేయండి. వచ్చాక ఒక 20 నిమిషాలు పడుకోండి.
- ఆ తర్వాత, మీకు ఎప్పుడైనా మీకు చాలా నచ్చిన ప్రదేశానికి టూర్ వెళ్లాలనుకుంటే దాని గురించి ప్లాన్ చేసుకోండి. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉంటే కొద్దిసేపు ప్లాన్ చేసుకోండి. మీ స్నేహితులకు కాల్ చేస్తూ ఉండండి.
- అనంతరం రాత్రి త్వరగా పడుకొని, హాయిగా నిద్రపోండి.
ఇంతే. సెలవు రోజు అంటే ఇలాగే ఉండాలి. నిత్యావసరాలు ఎప్పుడూ ఉండేవే. వాటి కోసం వేరే రోజు కేటాయించండి. కానీ వారంలో ఒక్కరోజైనా ఏం చేయకుండా ప్రశాంతంగా ఉండేలా గడపండి. మీ సంపూర్ణ ఆరోగ్యానికి ఎలాంతీ ఢోకా ఉండదు.
సంబంధిత కథనం