Massage Before Bathe| స్నానానికి ముందు బాడీ మసాజ్ చేసుకుంటే కలిగే ప్రయోజనాలివే!
వర్షాకాలంలో శరీరానికి ఆయిల్ మసాజ్ చేయడం ద్వారా మంచి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
మీరు ఎప్పుడైనా గమనిస్తే పసిపిల్లలకు స్నానం చేయించే ముందు వారికి సున్నితంగా ఆయిల్ మసాజ్ చేస్తారు. ఆ తర్వాత వారికి స్నానం చేయిస్తారు. ఇలా చేయడం ద్వారా పిల్లలు రోజంతా హుషారుగా ఉంటారు. సరిగ్గా ఆహారం తీసుకుంటారు, సరైన నిద్రపోతారు. ఇదే సూత్రం ఎవరికైనా వర్తిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి శరీరానికి ఆయిల్ మసాజ్ అనేది పురాతన సహజ పద్ధతులలో ఒకటి.
ముఖ్యంగా వర్షాకాలంలో చాలా బద్ధకంగా ఉంటుంది. చురుకుగా ఏ పని చేయాలనిపించదు. ఈ సమయంలో శరీరం ఫిట్‌గా ఉంచుకోవటానికి కొబ్బరి నూనెతో బాడీ మసాజ్ చేసుకోవాలని వెల్ నెస్ నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో ప్రకారం ఒళ్లు నొప్పులను తగ్గించడానికి, శరీరానికి విశ్రాంతిని ఇవ్వడానికి, మనస్సును శాంత పరచటానికి ఆయిల్ మసాజ్ ఉపయోగపడుతుంది.
మరి ఈ వర్షాకాలంలో బాడీ మసాజ్ అవసరం ఏమిటి, కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఇక్కడ తెలుసుకోండి.
స్నానానికి గంట ముందు మసాజ్
వర్షాకాలంలో స్నానానికి ఒక గంట ముందు కొబ్బరినూనెతో మొత్తం శరీరాన్ని, పాదాలకు మర్దన చేయాలి. తద్వారా చర్మంలో నూనె బాగా ఇనుకుతుంది. ఇలా చేయటం ద్వారా అలసట మాయమవుతుంది. శరీరంలోని ప్రతి భాగం ఉపశమనం పొందుతుంది. మీరు రిఫ్రెష్ అవుతారు. వెన్నునొప్పి సహా ఇతర ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. అలాగే సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
పునరుజ్జీవనం లభిస్తుంది
వర్షాకాలంలో శరీరంలో శక్తి స్థాయులు తగ్గుతాయి. అయితే కొబ్బరినూనెతో బాడీ మసాజ్ చేసుకోవడం వలన పునరుజ్జీవనం, శక్తి లభించినట్లవుతుంది. చర్మ ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. కండరాలు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కండరాలు ఫ్లెక్సిబుల్ అవుతాయి. అయితే బాడీ మసాజ్ చేసుకునేటపుడు మంచం లేదా చాప మీద ఉదరంపై పడుకోవాలని సూచితున్నారు.
పరిశుభ్రమైన చర్మం
వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది, దీని కారణంగా మీ చర్మం మరింత మృదువుగా మారుతుంది. అప్పుడు బ్యాక్టీరియా, ఫంగల్ ఇతర సూక్ష్మక్రిములకు ఆవాసంగా తయారవుతుంది. ఈ క్రమంలో స్కిన్ ఇన్ఫెక్షన్లు సోకవచ్చు. అయితే ఆయిల్ మసాజ్ చేసుకొని స్నానం చేయడం వలన మీ చర్మం మరింత పరిశుభ్రం అవుతుంది, కాంతివంతంగా మెరుస్తుంది. దురద, తామర లాంటి చర్మ సమస్యలు నివారించవచ్చు. మెరుగైన ఫలితాల కోసం శుద్ధి చేయని పచ్చి కొబ్బరినూనె ఉపయోగించడం మంచిది.
హెడ్ మసాజ్
వారానికి 2 రోజులు పడుకునే ముందు కొబ్బరి నూనెతో మీ స్కాల్ప్, జుట్టును మసాజ్ చేయండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ స్కాల్ప్ సెల్స్ కు పోషణనిచ్చి సెల్యులార్ రిపేర్ ను ప్రోత్సహిస్తాయి. దీంతో మీ జుట్టు సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు.
సంబంధిత కథనం