Things To Do After Meal | భోజనం తర్వాత అసౌకర్యంగా అనిపిస్తుందా? ఇవిగో చిట్కాలు!
అతిగా ఆహారం తినేసి అసౌకర్యంగా ఫీలవుతున్నారా? జీర్ణక్రియ వేగవంతం చేయటానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. వీటిని ఆచరించి చూడండి.
ఆహారం రుచికరంగా ఉంటే కాస్త ఎక్కువ తినేస్తాం. మనసులో ఏదైనా చింత, ఆందోళన ఉన్నప్పుడు కూడా మనకు తెలియకుండా ఎక్కువ తినేస్తాం. పార్టీలకు వెళ్లినపుడు కూడా అన్ని రకాల ఆహార పదార్థాలతో కడుపును నిండుగా నింపేసుకుంటాం. ఇలా అతిగా తినేయటం వలన కడుపు ఉబ్బిపోయి, అసౌర్యంగా అనిపిస్తుంది. తిన్నది కూడా సరిగ్గా జీర్ణం అవ్వక ఇబ్బంది పడాల్సి ఉంటుంది. క్యాలరీలు ఎక్కువగా చేరి బరువు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఎలా అంటే కొన్ని మార్గాలు ఉన్నాయి.
మీరు అనుకోకుండా అతిగా తిన్నప్పుడు అలాగే కూర్చోవటం కానీ, నేరుగా వెళ్లిపడుకోవటం కానీ చేయకూడదు. దీనివల్ల అసౌకర్యం మరింత పెరుగుతుంది. మిమ్మల్ని మీరు తేలిక పరుచుకోవటానికి కొన్ని చిట్కాలను ఆచరించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
తేలికపాటి నడక
తిన్న తర్వాత ఎప్పుడు కాసేపు నడకకు వెళ్లాలి. అది బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ అయినా లేదా డిన్నర్ అయినా.. భోజనం చేసిన తర్వాత తేలికపాటి నడక ఉండాలని పోషకాహార నిపుణులు సిఫారసు చేస్తున్నారు. కాబట్టి భోజనం చేసిన తర్వాత కాసేపు నడవండి. అతిగా భోజనం చేస్తే తిన్న భోజనం కడుపులో సర్దుబాటు కావటానికి ఒక 10 నిమిషాల పాటు నడవాలని చెబుతున్నారు. ఇలా నడవటం వలన కదలిక జరిగి జీర్ణక్రియ ప్రక్రియ వేగవంతం అవుతుంది. కడుపులో అసౌకర్యం అనేది తగ్గుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తిన్న తర్వాత ఎప్పుడూ కూడా వేగంగా నడవకూడదు, జాగింగ్ చేసినట్లు చేయకూడదు. దీనివల్ల వికారం, కడుపు నొప్పిని కలుగుతుంది. కాబట్టి నెమ్మదిగా, ప్రశాంతంగా ఇంటి లోపల గానీ, బయట గానీ అలా షికారు చేసినట్లు నడవండి.
డిటాక్స్ వాటర్ తాగండి
ఎక్కువగా తినేసినపుడు కడుపును శుద్ధిచేసే డిటాక్స్ వాటర్ తాగండి. ఈ డిటాక్స్ వాటర్ మీరు సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం, అలాగే ఒక చిటికెడు మిరియాల పొడి కలుపుకొని తాగవచ్చు. అయితే ఇందులో ఉప్పు, చక్కెర, తేనే లాంటివి కలపకూడదు. అలాగే చల్లటి నీరు కాకుండా గోరు వెచ్చని నీరు తాగాలి. ఒకేసారి గుటుక్కున తాగేయకుండా కొద్దికొద్దిగా ఆ నీటిని సిప్ చేసుకుంటూ తాగాలి. ఇది శరీరంలోని సోడియంను బయటకు పంపి జీర్ణక్రియ వేగవంతం కావటానికి సహాయపడుతుంది. అలాగే భోజనం తర్వాత జీరా టీ, ఫెన్నెల్ టీ , లెమన్‌గ్రాస్ టీ వంటివి కూడా తీసుకోవచ్చు.
యాంటాసిడ్ తీసుకోవాలి
భారీ భోజనం తర్వాత యాంటాసిడ్ వంటి ద్రావణాలు తాగటం, చూరన్ లాంటిది నమలటం చేయాలి. ఈ చూరన్ అనేది నిన్నటి తరం అమ్మమ్మలు, నానమ్మల వద్ద వారి సంచిలో ఎప్పుడూ ఉంటుంది. మీకు మీరుగా కూడా చేసుకోవచ్చు. వేయించిన జీలకర్ర, సోంఫు, ఇంగువ, వాము అన్నీ సమపాళ్లలో పావు టీస్పూన్ చొప్పున తీసుకొని బాగా మిక్స్ చేసి, గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగాలి. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణం అయిపోతుంది.
ఏం చేయకూడదు?
భారీగా భోజనం చేసిన తర్వాత వెంటనే వెళ్లి మంచం మీద పడుకోవటం గానీ, రిలాక్స్ గా కూర్చోవటం గానీ చేయకూడదు. ఇది యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను కలిగిస్తుంది. అలాగే వ్యాయామాలు లాంటివి చేయకూడదు. వికారం, కడుపులో నొప్పి కలుగుతుంది. తేలికపాటి నడక మాత్రం ఉండాలి. అలాగే ఎక్కువ తినేశామని తిన్నదానిని వాంతి చేసుకొనే ప్రయత్నాలు చేయవద్దు. సులభంగా ఆచరించేటువంటి పైన చిట్కాలు పాటిస్తే ప్రభావవంతంగా ఉంటుంది.
సంబంధిత కథనం