Morning Walk | ప్రతిరోజూ ఉదయం నడిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోండి!-know benefits of morning walk ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Morning Walk | ప్రతిరోజూ ఉదయం నడిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోండి!

Morning Walk | ప్రతిరోజూ ఉదయం నడిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోండి!

HT Telugu Desk HT Telugu
May 05, 2022 06:37 AM IST

ప్రతిరోజూ మార్నింగ్ వాక్ కు వెళ్లడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఏ సమయంలో నడకకు వెళ్లాలి, ఎంతసేపు నడవాలి మొదలగు విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

<p>Morning Walk</p>
Morning Walk (Pixabay)

ప్రతిరోజూ వ్యాయామం చేయడంలో ఇంకా ఇబ్బంది ఉందా? అయితే జాగింగ్ చేయండి. ఇదీ సాధ్యం కాకపోతే వాకింగ్ చేయండి. ఉదయాన్నే లేచి ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు నడవటం కూడా మంచి వ్యాయామమే. మీ వయసు, ఫిట్‌నెస్ స్థాయితో సంబంధం లేకుండా నడక మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు ఉదయపు నడకకు వెళ్లడం సరైన సమయం. అయితే ఏదో మొక్కుబడిగా అప్పుడప్పుడు లేచి నడవడం కాకుండా వారానికి కనీసం 5 రోజులు నడవాలని ఆరోగ్య నిపుణులు సిఫారసు చేస్తున్నారు. నడిచే వ్యక్తుల్లో ఒత్తిడి తగ్గి క్రియేటివిటీ కూడా పెరుగుతుందని పలు అధ్యయనాలు తెలిపాయి.

నడక ద్వారా బరువును నియంత్రణలో ఉంటుంది. శరీరంలో సత్తువ పెరుగుతుంది. వివిధ వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది, వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. ఇలా ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఉదయం నడక ద్వారా కలిగే ప్రయోజనాలు

  • ప్రతిరోజూ ఉదయం నడకకు వెళ్లడం వలన గుండెపోటు వచ్చే ప్రమాదం సగం వరకు తగ్గుతుంది. నడక గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది, తద్వారా మీరు అలసిపోకుండా ఎక్కువ గంటలు పని చేయగలుగుతారు.
  • ఈవెనింగ్ వాక్‌లతో పోలిస్తే ఉదయపు నడకలు ఎంతో మేలైనవి, ఎందుకంటే ఉదయాన్నే నడకకు వెళ్తే మీరు రోజంతా చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు.
  • పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరిగించుకోవాలంటే కచ్చితంగా వ్యాయామాలు చేయాలి కుదరకపోతే ప్రతిరోజూ నడక ద్వారా కూడా కొద్దికొద్దిగా కొవ్వు తగ్గుతుంది.
  • కీళ్లల్లో వశ్యత పెరుగుతుంది. కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్, వాపు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
  • ఉదయపు నడక చర్మ సంరక్షణకు కూడా తోడ్పడుతుంది. కాస్మోటిక్స్ వాడే బదులు నడకకు వెళ్తే ముఖంలో మంచి కళ వస్తుంది.

ఎలా ప్రారంభించాలి?

- ప్రతిరోజూ ఉదయం నడక కోసం ఒక నిర్ధిష్టమైన సమయం కేటాయించుకోండి. ఆ సమయం నడక కోసం మాత్రమే ఉపయోగించుకోవాలి. కాలక్రమేణా అది మీరు వదులుకోలేని అలవాటుగా మారుతుంది.

- ఉదయం నడక ప్రారంభించే ముందు తేలికగా ఉండే ఏదైనా చిన్న ఆహారం తీసుకోండి. ఒక పండు లేదా ఒక టోస్ట్ లేదా డ్రైఫ్రూట్స్, పలుకులు తీసుకోండి. ఇవి మీకు నడిచేందుకు శక్తినిస్తాయి.

- వాతావరణ మార్పులను గమనించండి. బాగా చలిగా ఉన్నపుడు అవసరమైన ఏర్పాట్లు ఉండాలి. భారీ వర్షం ఉన్నపుడు ఆరోజుకు ఇంటి వద్దే నడవండి.

- నడకతో పాటు చేతులు, కాళ్లు అలాగే కండరాలను సాగదీయండి. స్ట్రెచింగ్స్ చేయడం వలన తేలికగా అనిపిస్తుంది. రిలాక్స్ అవుతారు.

- నడక అంటే మరి నత్తనడకలా కాకుండా కొద్దిగా వేగంగా, కొద్దిగా నెమ్మదిగా ఇలా వేగంలో మార్పులు చేసుకోండి. మధ్యమధ్యలో విరామాలు తీసుకోండి.

మీతో పాటు ఒక మిత్రుడిని తోడుగా చేసుకోండి.. ఇద్దరూ కలిసి నడిస్తే అలసట ఉండదు, ఆసక్తి పెరుగుతుంది. ఇంకేం. నడిచేందుకు అనువుగా ఉండే మంచి షూ ధరించి నడకకు బయలుదేరండి..

Whats_app_banner

సంబంధిత కథనం