ఆదివారం బ్రేక్‌ఫాస్ట్ లైట్‌గా తీసుకుంటే.. ఆ తర్వాత నాన్-వెజ్ టైట్‌గా తినొచ్చు
ఆదివారం విందులు, వినోదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉదయం అల్పాహారం తేలికగా ఉండేది తీసుకోవాలి. అందులోనూ ఇది వేసవి కాబట్టి ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మీ కోసం ఓ సరికొత్త అల్పాహారం రెసిపీ ఇక్కడ అందజేస్తున్నాం..
ఎండలు రోజురోజుకి ముదురుతున్నాయి. వారం రోజులు బాగా పనిచేసి అలిసిపోయిన తర్వాత మనల్ని మనం రీఛార్జ్ చేసుకునేందుకు ఆదివారం వచ్చేసింది. కాబట్టి ఈ ఎండాకాలానికి తగినట్లుగా మనం తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అందులోనూ ఈరోజు ఆదివారం.. మాంసాహార ప్రియులకు ముక్క లేనిదే, ముద్ద దిగదు కాబట్టి మధ్యాహ్నం భోజనానికి ముందు తేలికైన అల్పాహారం తీసుకోవాలి. అందుకు ఓట్స్ ఆరెంజ్ ఫ్లేవర్ పుడ్డింగ్ చాలా బాగుంటుంది.
ట్రెండింగ్ వార్తలు
వేడిని తట్టుకోవడానికి, ఆహారం సులభంగా జీర్ణమవడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ సులభమైన, రుచికరమైన ఓట్స్ ఆరెంజ్ ఫ్లేవర్ పుడ్డింగ్ (Oats Orange Flavour Pudding) వంటకం రెసిపీ ఇక్కడ ఇస్తున్నాం. మీరూ ఒకసారి ప్రయత్నించి చూడండి.
కావలసిన పదార్థాలు
ఓట్స్ ½ కప్పు
నారింజ రసం ¾ కప్పు
దానిమ్మ గింజలు 2 టేబుల్ స్పూన్లు
ఆరెంజ్ తొక్క తురుము ¼ టీస్పూన్
ఎండుద్రాక్ష 2 స్పూన్లు
రుచికి తగినట్లుగా చక్కెర వేసుకోవచ్చు
తయారు చేసుకునే విధానం
సగం కప్పు నీటిలో నారింజ రసం వేసి మరిగించండి. ఆపై ఓట్స్ వేసి 2-3 నిమిషాలు చిన్న మంటపై ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ఓట్స్ పై దానిమ్మ గింజలు, నారింజ తురుము, ఎండుద్రాక్ష, అవసరం అనుకుంటే కొద్దిగా చక్కెర వేసుకొని బాగా కలపండి. అంతే తేలికైన, రుచికరమైన అరెంజ్ పుడ్డింగ్ రెడీ అయింది. ఈ అల్పాహారం తేలికగా జీర్ణం అవుతుంది. ఈ వేసవిలో ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వంటల నిపుణురాలు స్మితా శ్రీవాస్తవ తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్