Bedtime Yoga । నిద్రపట్టడం లేదా? కేవలం ఒక నిమిషం ఈ యోగా చేయండి, హాయిగా నిద్రపోతారు!-bedtime yoga 5 simple yoga exercises to release stress and fall asleep easily ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bedtime Yoga । నిద్రపట్టడం లేదా? కేవలం ఒక నిమిషం ఈ యోగా చేయండి, హాయిగా నిద్రపోతారు!

Bedtime Yoga । నిద్రపట్టడం లేదా? కేవలం ఒక నిమిషం ఈ యోగా చేయండి, హాయిగా నిద్రపోతారు!

HT Telugu Desk HT Telugu
Apr 22, 2023 09:15 PM IST

Bedtime Yoga: ప్రతి రాత్రి నిద్రపోవడానికి కష్టపడుతున్నారా? నిద్రవేళకు ముందు ఈ 5 యోగా ఆసనాలను ప్రయత్నించండి, ఎందుకంటే అవి మీ మనస్సులోని, శరీరంలో ఒత్తిడి, ఆందోళన, టెన్షన్‌ను తొలగించి, మీరు విశ్రాంతిగా నిద్రపోయేలా మిమ్మల్ని సిద్ధం చేస్తాయి.

Bedtime Yoga
Bedtime Yoga (Unsplash)

Bedtime Yoga: ఇప్పటికే చాలా ఆలస్యమైనది. మీరు అలసిపోయి కూడా ఉన్నారు, అదనంగా మీ టెన్షన్‌లు మీకు ఉన్నాయి. ఇది మీరు తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలసిన సమయం. నిద్రపోదామనుకుంటున్నా నిద్రరావడం లేదు. ఏం చేయాలి.. అని మీకెప్పుడైనా అనిపించిందా? అయితే ఇలాంటి సమయంలోనే యోగా చేయాలి. యోగా అనేది కేవలం ఒక నిర్ణీత సమయంలోనే చేసే వ్యాయామం కాదు, మీరు ఏ సమయంలోనైనా చేయగలిగే యోగాసనాలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రివేళ కూడా చేసే యోగాసనాలు ఉన్నాయి, ఇవి మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి సహకరిస్తాయి.

యోగా మీ నాడీ వ్యవస్థను శాంతపరిచే గుణాలను కలిగి ఉంది. లోతైన శ్వాస, సుదీర్ఘంమైన సాగదీతలు, విశ్రాంతి భంగిమల ద్వారా ఈ వ్యాయామాలు మీ కండరాలను సడలించి, మీకు మంచి రాత్రి నిద్రను ప్రేరేపించడంలో సహాయపడతాయి. మరి అలాంటి యోగాసనాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

Thunderbolt Pose- వజ్రాసనం

ఎప్పుడైనా భోజనం చేసిన తర్వాత ఆచరించగల ఏకైక యోగా భంగిమ వజ్రాసనం. ఇది ఉదర ప్రాంతంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, తద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మీరు రాత్రి భోజనం చేసిన తర్వాత 5 నుండి 10 నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చోండి. ఇది అసిడిటీ, మలబద్ధకం వంటి అన్ని జీర్ణ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీరు తేలికగా, ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. సుదీర్ఘమైన సమయం పాటు కూర్చొని పనిచేసి అలసిపోయిన వారికి తీవ్రమైన వెన్ను నొప్పి నుండి ఉపశమనం పొందడంలో కూడా ఇది సహాయపడుతుంది. మంచి నిద్ర కోసం ఇది సులభమైన యోగా భంగిమ.

Stick Pose - యస్తికాసనం

యస్తికాసనం అనేది శరీరం, మనస్సుకు విశ్రాంతిని అందించడంలో సహాయపడే ఒక అద్భుతమైన టెక్నిక్. ఇది వెన్నెముకకు తగినంత సాగదీతను అందించి వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరాన్ని గరిష్టంగా సాగదీయడానికి వీలు కల్పిస్తుంది, కండరాల బిగుతు, అసౌకర్యానికి ఉపశమనాన్ని అందిస్తుంది, విశ్రాంతి భావాలను కలిగిస్తుంది. తద్వారా ఈ ఆసనం మంచి నిద్రను ప్రేరేపిస్తుంది. ఈ యోగాసనాన్ని పడుకునే ముందు సాధన చేయవచ్చు.

Wall Butterfly Pose- భద్రాసనం

ఇది కాస్త వాలుగా సీతాకోక చిలుక ఆసనంలో ఉన్న భంగిమ. ఈ భద్రాసనం మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది అలాగే దిగువ శరీరానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ సులభమైన భంగిమ తొడ కండరాలకు మంచి సాగదీతను అందించి, కండరాలను సడలిస్తుంది, నిద్రను ప్రేరేపిస్తుంది.

Legs Up The Wall Pose- విపరీత కరణి

విపరీతకర్ణి శరీరానికి గురుత్వాకర్షణ సంపూర్ణ ప్రభావాలను అందిస్తుంది. ఇది ముఖ్యమైన ఎండోక్రైన్ గ్రంధులతో సహా నడుము పైన ఉన్న శరీరంలోని వివిధ అవయవాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. శరీరం ఎగువ భాగంలో పెరిగిన రక్త ప్రసరణ, రక్తం పరస్పర మార్పిడి కారణంగా విశ్రాంతికరమైన మార్పులు జరుగుతాయి. ఇది మెడ, మొండెం, కాళ్ళలో అద్భుతమైన సాగతీతను అందిస్తుంది. మీకు మంచి విశ్రాంతిని చేకూర్చి, నిద్రను ప్రేరేపిస్తుంది.

Lizard Pose- ఉత్తాన పృష్ఠాసనం

ఇది అనేక మానసిక ప్రయోజనాలు కలిగిన యోగా భంగిమ. ఇది మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది, ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఇంకా భావోద్వేగాలను అదుపు చేయడం, దృష్టిని మెరుగుపరచడం, సృజనాత్మకతను ఉత్తేజపరచడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఆసనాన్ని కనీసం 1 నిమిషం పాటు లేదా 10-15 శ్వాసల వరకు చేయడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇది మీ బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించి, మీ ఫ్లెక్సిబిలిటీని కూడా మెరుగుపరుస్తుంది.

ఈ యోగాసనాలలో మీకు అనుకూలమైన ఆసనం వేయండి. ఆసనం ప్రాక్టీస్ చేసే ముందు రిలాక్సింగ్ సంగీతాన్ని (Relaxing Music) ప్లే చేయండి, లైట్లను డిమ్ చేయండి, సౌకర్యంగా, హాయిగా ఉండే పైజామాలను ధరించండి, ఎందుకంటే మీరు ఈ ఆసనాలు చేస్తూనే నేరుగా నిద్రలోకి జారిపోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం