Improve Creativity | సృజనాత్మకంగా ఆలోచించడం ఎలా? ఇవిగో టిప్స్!
World Creativity and Innovation Day 2023: అందరిలా ఆలోచించడం కాదు, విభిన్నంగా ఆలోచించే వారే విజేతలు. సృజనాత్మకంగా ఆలోచించటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి చూడండి.
World Creativity and Innovation Day 2023: సృజనాత్మకంగా ఆలోచించినప్పుడే కొత్త ఆవిష్కరణలు ఆవిర్భవిస్తాయి, సృజనాత్మకంగా ఆలోచించినపుడే ఒక కొత్త కళారూపం బయటకు వస్తుంది, సృజనాత్మకంగా ఆలోచించినప్పుడే ఎక్కువ ప్రజాదరణ దక్కుతుంది. సృజనాత్మకంగా ఆలోచించిన వాడే లోకాన్ని ఏలుతాడు. మరి సృజనాత్మకంగా ఆలోచించడం ఎలా? అందుకు ఏవైనా డిగ్రీలు చదవాలా అంటే అవసరం లేదు, సృజనాత్మకత అనేది ఏ ఒక్కరిసొత్తు కాదు, దీనిని ఎవరైనా సాధించవచ్చు. అందరికీ ఆలోచించే శక్తి ఉంటుంది, కాస్త విభిన్నంగా మరింత వినూత్నంగా ఆలోచించేవారికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది.
వేసవి కాలం చాలా మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, సమ్మర్ జాబ్‌ల కోసం అన్వేషించే సమయం. మీ సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణ నైపుణ్యాలపై పని చేయడానికి ఇది గొప్ప సమయం, మీరు మీ కలల ఉద్యోగాన్ని పొందడానికి, మీ అనుకున్న లక్ష్యాలను సాధించడానికి మీలోని సృజనాత్మకతను పదునుపెట్టండి. సృజనాత్మకంగా ఆలోచించడంలో సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ అందిస్తున్నాం.
What if.. ఇలాగే ఎందుకు?
సృజనాత్మకంగా ఆలోచించడంలో మొదటి దశ మీరు ఏదైనా వస్తువు లేదా వ్యవస్థ లేదా సంబంధాన్ని భిన్నమైన కోణంలో చూడటం. "ఇలాగే ఎందుకు.. దానిని మార్చినట్లయితే- What if" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
ఈ ఫోన్ ఇలాగే ఎందుకు ఉంది? దీనిని మరోలా ఎందుకు మార్చకూడదు. ఈ వ్యవస్థ ఇలా ఎందుకు ఉంది, ఇలా ఎందుకు ఉండకూడదు, బంధం అంటే ఇలాగే ఎందుకు ఉండాలి, మరోలా ఎందుకు ఉండకూడదు వంటి ఆలోచనల ద్వారా మీ క్రియేటివ్ థింకింగ్ పెంచుకోవచ్చు.
Keep Dreaming- కలలు కనడం సాధన చేయండి
కలలు కనమని కలాం లాంటివారు చెప్పేవారు. కల మిమ్మల్ని ఊహాలోకంలోకి తీసుకెళ్తుంది, అందమైన ప్రపంచాన్ని చూపిస్తుంది, భయాలనూ పరిచయం చేస్తుంది, భవిష్యత్తుపై అంచనాలను కలిగిస్తుంది, అందుకు మార్గాలను చూపిస్తుంది. కలలు కనడం సాధన చేయడం ద్వారా మీ మెదడును సృజనాత్మకంగా ఆలోచించేలా శిక్షణ ఇవ్వవచ్చు.
Do Experiments - ప్రయోగాలు చేయండి
మీ ఫీల్డ్‌లో మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. నిర్భయంగా కొత్త శైలులతో ప్రయోగాలు చేయండి. ఉదాహరణకు మీరు ప్రాథమికంగా శాస్త్రీయ సంగీతాన్ని వాయించే సంగీతకారులు అయితే, దానికి వెస్ట్రన్ జోడించి చూడండి. జాజ్ లేదా పాప్‌లో ప్రయోగాలు చేయడం వల్ల మీ స్వంత శైలి సంగీతంతో కూడా సృజనాత్మకతను పొందడంలో మీకు సహాయపడవచ్చు. మీరు సాధారణంగా డిజిటల్‌గా గీసే ఆర్టిస్ట్ అయితే, మీ నైపుణ్యాలను , మీ ఆలోచనలను విస్తరించుకోవడానికి మీరు వాటర్‌కలర్ లేదా కలర్ పెన్సిల్‌లను ఉపయోగించి ప్రయత్నించవచ్చు.
Have Confidence - నమ్మకం కలిగి ఉండండి
మీరు సృజనాత్మకంగా ఆలోచించే క్రమంలో మీపై మీరు నమ్మకం ఉంచడం, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడం చాలా అవసరం. మరింత కొత్తగా కావాలనే ఆశ, ఇంకేదో ప్రయత్నం చేయాలనే జిగ్నాస, అంతకుమించిన ఓర్పు అవసరం. మీ పనిపై విశ్వాసం కలిగి ఉండటం వలన మీరు సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చు. మీరు కొత్త విషయాలను ప్రయత్నించడానికి భయపడితే, సృజనాత్మకంగా ఉండటం కష్టం.
Read a Book- పుస్తకాన్ని చదవండి
సృజనాత్మకంగా ఆలోచించటానికి జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కూడా అవసరం. ఒక్కోసారి మీకు ఎలాంటి ఆలోచనలు రానప్పుడు ఏదైనా పుస్తకం తీసి చదవండి. పుస్తకపఠనం మీ మెదడుకు ప్రేరణలు ఇస్తుంది. లోతైన ఏకాగ్రతను కలిగించడంలో మీకు సహాయకారిగా ఉంటుంది.
Go For a Walk - నడకకు వెళ్లండి
ఎప్పుడూ నాలుగు గోడల మధ్య ఉండకుండా నాలుగు అడుగులు బయటకు నడవండి. ఉదయం లేదా సాయంత్రం వేళ ఒక కొత్త వాతావరణంలోకి మీరు చేసే నడక మీ మనసుకు విశ్రాంతినివ్వడమే కాకుండా, మీలో స్ఫూర్తిని పెంచుతుంది. మీ మెదడులో కొత్త ఆలోచనలు రేకెత్తడానికి ప్రేరణనిస్తుంది.
Collaborate - ఇతరులతో కలసి పనిచేయండి
ఒక గొప్ప కళాఖండం ఆవిష్కృతం కావాలంటే అది ఒక్కడితోనే అయ్యేపని కాదు, అందుకు కొంతమంది సహాకారం అవసరం. విభిన్నమైన ఆలోచనలు, ఒక ఆలోచనగా బయటకు వస్తే అది ఎంతో శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి కలిసి పనిచేయడానికి వెనకాడకండి.
సంబంధిత కథనం