Health Check Ups | ఏడాదికి ఒక్కసారైనా ఫుల్ బాడీ చెకప్ చేయించుకోండి, ఎందుకంటే?!
Health Checkups: క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలను చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఫుల్ బాడీ స్కాన్ చేసుకోవాలని సిఫారసు చేస్తున్నారు. ఎందుకో కారణాల మీరు తెలుసుకోండి.
World Health Week 2023: మనం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మన ఆరోగ్యాన్ని కొనసాగించడానికి రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చాలా అవసరం. నేటి జీవనశైలిలో ఎప్పుడు ఏ అనారోగ్య సమస్య ముంచుకొస్తుందో, ఏ వ్యాధి ప్రబలుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ముందుగానే పరీక్షలు చేయించుకుంటే ఏవైనా సంభావ్య అనారోగ్య సమస్యలను ప్రారంభంలోనే గుర్తించవచ్చు, దానిని నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే మన ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాల పరీక్షలు ఉంటాయి. వీటన్నింటినీ ఒక్కొక్కటిగా చేసుకునే బదులు, ఒకేసారి ఫుల్ బాడీ చెకప్ (Full Body Check up) చేయించుకుంటే చాలా ప్రయోజనం.
ఫుల్ బాడీ చెకప్ అనేది మీ శరీరంలోని వ్యవస్థలన్నింటి ఆరోగ్యాన్ని అంచనా వేసే ఒక సమగ్రమైన పరీక్ష. ఇందులో భాగంగా రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, మల పరీక్ష, మధుమేహం పరీక్ష, థైరాయిడ్ పరీక్ష (Thyroid Test) , శారీరక పరీక్షలు (Physical Fitness Tests) సహా ఇతర రోగనిర్ధారణ పరీక్షలు (Diagnosis) అన్నీ చేస్తారు. దీంతో మీ శరీరంలో ఏ చిన్న సమస్యనైనా గుర్తించే వీలు ఉంటుంది, తద్వారా ఏవైనా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు, సమర్థవంతంగా చికిత్స చేయడం సాధ్యపడుతుంది. తద్వారా మీరు మీ ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది.
Reasons for Health Checkups - ఆరోగ్య పరీక్షలు చేసుకోవడానికి కారణాలు
చాలా మంది తమలో ఏదైనా అనారోగ్య సమస్య బయటపడుతుందేమోనన్న భయంతో లేదా బిజీ షెడ్యూల్‌ల కారణంగా ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే కనీసం సంవత్సరానికి ఒకసారైనా పూర్తి శరీర పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం అని వైద్యులు అంటున్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలను (Regular Health Checkups) ఎందుకోసం చేసుకోవాలో కారణాలను తెలియజేశారు. అవేమిటో మీరు తెలుసుకోండి మరి.
వ్యాధులను ముందస్తుగా గుర్తిండానికి
ఫుల్ బాడీ స్కాన్ ద్వారా వ్యాధులను వాటి ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు, ఇది మీకు చికిత్స విజయవంతం కావడానికి, మీరు వేగంగా కోలుకోవడానికి అవకాశాలను మెరుగుపరుస్తుంది.
తీవ్రమైన అనారోగ్య సమస్యల నివారణ
రెగ్యులర్ చెక్-అప్‌లు గుండె జబ్బులు, క్యాన్సర్ , మధుమేహం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
మీ ఆరోగ్యంపై సమగ్రమైన అంచనా
పూర్తి బాడీ చెకప్ ద్వారా మీ శారీరక , మానసిక ఆరోగ్యంతో సహా మీ సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర అంచనాను అందిస్తుంది.
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నియంత్రణ
హైపర్‌టెన్షన్, డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వారికి, ఈ రెగ్యులర్ చెక్-అప్‌లు వారి పరిస్థితిని నియంత్రించడానికి , అనారోగ్యం నుంచి కోలుకోవడానికి సహాయపడతాయి.
క్యాన్సర్‌ను జయించవచ్చు
క్యాన్సర్‌ను దాని ప్రారంభ దశలోనే గుర్తించడం వలన ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు, రెగ్యులర్ చెక్-అప్‌ల ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించి, అది మరింత అభివృద్ధి చెందకుండా విజయవంతమైన చికిత్స తీసుకోవడానికి, క్యాన్సర్ వ్యాధిని జయించటానికి అవకాశం ఉంటుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు
హెల్త్ చెక్-అప్‌లతో మీరు మీ జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు (Healthy Lifestyle) చేసుకోవచ్చు. మధుమేహం, గుండెపోటు, గుండెజబ్బులు వంటి వ్యాధులను నివారించవచ్చు. సరైన పోషకాహారం తీసుకోవడానికి, వ్యాయామం చేయడానికి, మంచి అలవాట్లను కలిగి ఉండటానికి దోహదపడుతుంది.
చికిత్స ప్రభావం, ఔషధాల మార్పు
రెగ్యులర్ చెక్-అప్‌లతో వ్యాధి చికిత్సకు సంబంధించి వారి పురోగతిని పర్యవేక్షించడానికి వీలు కలుగుతుంది. తద్వారా చికిత్స ప్రణాళికలను సర్దుబాటు చేయడానికి, ఔషధాలను మార్చడానికి అవకాశం ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్