జ్వరం వస్తే శరీరం వేడిగా అవుతుంది, జలుబు చేసే గొంతునొప్పిగా ఉంటుంది, కామెర్లు వస్తే కళ్లు పచ్చగా తయారవుతాయి. ఇలా ప్రతీ అనారోగ్యాన్ని మనం అనుభవంచే లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చు. మనకు ఎలాంటి సాధారణ అనారోగ్య సమస్య తలెత్తినా వెంటనే ఆ లక్షణాలను తగ్గించేందుకు ఔషధాలు, చికిత్స తీసుకుంటాము. మరి మన గుండె అనారోగ్యానికి గురైనట్లు ఎలా తెలుసుకోవచ్చు?
చాలా సార్లు మనం మన గుండె అనారోగ్యాన్ని పట్టించుకోము. మనం అనుభవిస్తున్న కొన్ని లక్షణాలు గుండె జబ్బుకి సంబంధించినవి అని మనం గుర్తించలేము. కొరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండెకు రక్తప్రసరణ ఆగిపోవడం, గుండెపోటు మొదలైనవి అన్నీ గుండెకు సంబంధించిన జబ్బులే. వీటికి వేర్వేరు చికిత్సలు అవసరమవుతాయి, కానీ ఒకే విధమైన లక్షణాలను ప్రదర్శించవచ్చు. కచ్చితమైన రోగ నిర్ధారణ చేయడంతో పాటు, వెంటనే చికిత్స పొందినపుడే ప్రాణాలతో బయటపడగలము. గుండె జబ్బులకు సత్వర వైద్య సహాయం అవసరం. కానీ మనలో చాలా మందికి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయో లేదో కూడా తెలియదు.
ఈ రోజుల్లో ప్రజలు అనుసరిస్తున్న అస్థిరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది చిన్న వయస్సులోనే వివిధ రకాల గుండె జబ్బులను కలిగి ఉన్నారు. గుండె జబ్బులు ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి, శరీరం మీకు కొన్ని సంకేతాలను పంపుతుంది. వాటిని విస్మరించకూడదు.
కొరోనరీ ఆర్టరీ వ్యాధి అనేది గుండె కండరాలకు సంబంధించిన సమస్య. గుండెకు ఆక్సిజన్, ఇతర పోషకాలను సరఫరా చేసే ధమనులను ప్రధానంగా ప్రభావితం చేసేపరిస్థితి. ఇది ధమనులలో కొలెస్ట్రాల్ చేరడాన్ని సూచిస్తుంది.
గుండె జబ్బులకు అనేక సంకేతాలు ఉన్నాయి. అయినప్పటికీ, కొన్ని లక్షణాలు చాలా సాధారణమైనవి, వాటిని గుర్తించడం కష్టం. గొంతు నొప్పి, దవడ నొప్పి, మెడ నొప్పి , పొత్తికడుపు నొప్పి వంటివి కూడా గుండె జబ్బుకు సంకేతాలే కానీ మనం గ్రహించలేము. అదనంగా, వెన్నునొప్పి , చేతులు లేదా కాళ్ళలో చల్లదనం, చల్లగా చమటలు కూడా గుండె జబ్బులకు సూచికలు కావచ్చు. కాబట్టి ఇలాంటి లక్షణాలు అనుభవిస్తున్నప్పుడు వైద్యులను సంప్రదించి ఒకసారి చెకప్ చేయించుకోవడం మంచిది.
సంబంధిత కథనం