Dim Lights Before Bedtime | నిద్రించడానికి 3 గంటల ముందు లైట్లు ఆర్పివేయండి.. తేల్చి చెప్పిన పరిశోధన!
నిద్రించడానికి 3 గంటల ముందు గదిలో లైట్లు ఆర్పివేయాలి, స్క్రీన్లను డిమ్ చేయాలి అని శాస్త్రజ్ఞులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు ఇది తప్పక పాటించాలని సలహా ఇస్తున్నారు. ఎందుకో తెలుసుకోండి.
అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీలో వైద్య విభాగానికి చెందిన పరిశోధకులు ఇటీవల నిర్వ పరిశోధన ప్రకారం, రాత్రివేళ నిద్రించడానికి 3 గంటల ముందు గదిలోని లైట్లు ఆర్పివేయాలి, గదిని చీకటిగా మార్చాలి. దీని వలన గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీలకు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతున్నట్లు పరిశోధనలో తేలింది. గర్భిణీ స్త్రీలు నిద్రవేళకు కొన్ని గంటల ముందు తమ ఇంటి లైట్లను ఆర్పి వేయాలి. అలాగే వారి స్క్రీన్‌లను (కంప్యూటర్ మానిటర్లు, స్మార్ట్‌ఫోన్‌లు) స్విచ్ ఆఫ్ చేయాలి లేదా కనీసం డిమ్ చేయాలి అని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు.
నార్త్‌వెస్టర్న్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం, నిద్రకు ముందు ఎక్కువగా కృత్రిమ కాంతికి గురైన మహిళలు, గర్భిణీ స్త్రీలు మల్టీ-సైట్ స్టడీలో జెస్టేషనల్ డయాబెటిస్ మెల్లిటస్‌ను అభివృద్ధి చేసినట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారు. నిద్రవేళకు ముందు రాత్రి కాంతికి గురికావడం వలన మహిళలకు వారి రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ అదుపుతప్పుతుంది. అదే సమయంలో పగటి కాంతిని గ్రహించిన వారికి, త్వరగా నిద్రపోయే వారికి ఈ సమస్య లేనట్లు తమ అధ్యయనంలో వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు.
గర్భస్థ మధుమేహం ప్రసూతి సంబంధ సమస్యలను పెంచుతుంది. ఇది తల్లుల్లో మధుమేహం, గుండె జబ్బులు, చిత్తవైకల్యం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. పిండం పెరిగేకొద్దీ స్థూలకాయం, గర్భస్థ రక్తపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అని నార్త్‌వెస్టర్న్ మెడిసిన్ న్యూరాలజిస్ట్ లీడ్ డాక్టర్ మింజీ కిమ్ అన్నారు. గర్భధారణ సమయంలో గ్లూకోజ్ సమస్యలు లేని వారితో పోలిస్తే గర్భధారణ మధుమేహం ఉన్న మహిళల్లో టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ వచ్చే అవకాశం దాదాపు 10 రెట్లు ఎక్కువ అని తమ డేటా చూపిస్తున్నట్లు కిమ్ చెప్పారు.
గర్భస్థ మధుమేహం వచ్చే ప్రమాదం గురించి చాలా మందికి చాలా తక్కువగా తెలుసు. ఇది తల్లీబిడ్డలు ఇద్దరికీ ఆరోగ్యపరమైన చిక్కులను కలిగిస్తుందని కిమ్ అన్నారు. ఈ ప్రమాదాన్ని నివారించాలంటే, పడుకునే మూడు గంటల ముందు గదిలో ఉన్న కాంతిని తగ్గించడానికి ప్రయత్నించాలి. ఈ సమయంలో మీ కంప్యూటర్ లేదా ఫోన్‌ని ఉపయోగించకపోవడమే మంచిది. ఒకవేళ ఉపయోగించాల్సి వస్తే, స్క్రీన్‌లను వీలైనంత మసకగా ఉంచండి అని కిమ్ స్పష్టం చేశారు. ప్రజలు నైట్ లైట్లను ఉపయోగించాలని, అలాగే బ్లూ లైట్‌ను ఆపివేయాలని సూచించారు.
టాపిక్