Heart Attack Warning Signs । గుండెపోటు ఆకస్మికంగా రాదు.. ఇలాంటి సంకేతాలు పంపుతుంది!
Heart Attack Warning Signs: గుండె పోటు వచ్చే ముందు మన శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. వీటిని నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో చికిత్స తీసుకుంటే ప్రాణాలకి మంచిది. కార్డియాక్ అరెస్ట్ సంభవించినపుడు సీపీఆర్ ఎలా చేయాలో తెలుసుకోండి.
ఆకస్మిక గుండెపోటు అని మనం తరచూ వ్యాఖ్యానిస్తాం. కానీ నిజానికైతే గుండెపోటు వచ్చే ముందర కొన్ని ముందస్తు సంకేతాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. గుండెకు రక్త ప్రవాహం తీవ్రంగా తగ్గినప్పుడు లేదా పూర్తిగా నిరోధించడం జరిగినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది. గుండెకు వెళ్లే ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్, ఇతర పదార్థాల చేరిక వల్ల రక్త ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతుంది. సాధారణంగా కొవ్వు, కొలెస్ట్రాల్ కలిగిన నిక్షేపాలను ఫలకాలు అంటారు. కొన్నిసార్లు రక్త ప్రసరణ ఎక్కువైనపుడు ఆ పీడనానికి ఈ ఫలకం చీలిపోవచ్చు, అది అక్కడే గడ్డకట్టవచ్చు. హైబీపీ ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ఈ కారణంగా రక్తప్రసరణ సరిగ్గా జరగదు. రక్త ప్రవాహం లేకపోవడంతో గుండె కండరాలు దెబ్బతింటాయి.
దీర్ఘకాలికమైన ఒత్తిడి, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామాలు చేయకపోవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా రక్తం సరఫరాకు అడ్డంకి కలగడం వలన, అది గుండె పోటుకు దారితీస్తుంది.
గుండెపోటుకు దారితీసే ముందు శరీరం పంపించే సంకేతాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా ఆకస్మిక గుండెపోటును నివారించవచ్చు.
Heart Attack Warning Signs- గుండెపోటుకి దారితీసే సంకేతాలు ఇలా ఉంటాయి
- గుండెపోటు వచ్చే కొన్ని రోజుల ముందే ఎడమవైపు శరీరభాగాల్లో నొప్పి ఉంటుంది. ఎడమ చేయి లాగడం, దవడ వరకూ నొప్పి ఉండటం అనుభూతి చెందవచ్చు.
- ఎడమ చేయి భుజం నుంచి మెడ వరకు నొప్పి, దవడ, పళ్ళు కూడా లాగినట్లు అనిపిస్తుంది. వెన్నుభాగంలో కూడా లాగుతుంది.
- ఛాతీలో నొప్పి, ఛాతీపై ఒత్తిడి ఉన్నట్లుగా బిగుతుగా అనిపించడం ఉంటుంది. ఆకస్మికంగా ఛాతీ నొప్పి కలిగినపుడు, చాలా మంది ఎసిడిటీ అనుకొని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ తీవ్రంగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు.
- ఛాతీ బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. శ్వాస సరిగా సరిగ్గా ఆడదు. స్పృహ తప్పే అవకాశాలు కూడా ఉంటాయి.
- చల్లగా చెమటలు పడుతుంటాయి, ఎన్ని నీళ్లు తాగినా నోరు పొడిబారినట్లే ఉంటుంది.
- ఆకస్మికంగా గుండెల్లో మంట, అజీర్ణం, ఆకస్మిక మైకము, వికారం, అలసట ఉండవచ్చు.
- స్త్రీలకైతే ఎడమ చేయి నుంచి మెడ వరకు, వెనక వీపు భాగంలో కూడా గట్టిగా పట్టుకున్నట్లు, లేదా పొడిచినట్లుగా నొప్పి వంటి విలక్షణ లక్షణాలను కలిగి ఉండవచ్చు.
గుండెపోటుకు సంబంధించిన మొదటి రోగలక్షణ సంకేతం ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్. గుండెపోటుకు దారితీసే పరిస్థితులు గుండె ఎలక్ట్రిక్ ప్రేరణల్లో అంతరాయానికి కారణం అవుతాయి. ఇది ఆకస్మిక కార్డియాక్ అరెస్టుకు దారితీస్తుంది. కార్డియాక్ అరెస్ట్ అనేది గుండెపోటుకు విభిన్నమైన పరిస్థితి, గుండెపోటు వచ్చినపుడు ధమనులు మూసుకుపోవడం కనిపిస్తుంది. అయితే కార్డియాక్ అరెస్ట్ వస్తే గుండె కొట్టుకోవడం ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కార్డియాక్ అరెస్ట్ సంభవించినపుడు వ్యక్తికి వెంటనే సీపీఆర్ చేయాలి.
సకాలంలో కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) అందించినట్లయితే.. వారిని రక్షించవచ్చని వైద్యులు తెలిపారు. కార్డియాక్ అరెస్ట్ తో వ్యక్తి కుప్పకూలినపుడు, అతడి ఛాతీ భాగంలో 30 సార్లు ఆపకుండా నొక్కడం ద్వారా ఆగిపోయిన గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. వారికి శ్వాస ఆడేలా చేసి అత్యవసరంగా వైద్యసహాయం అందించడం ద్వారా ప్రాణాలతో బయటపడవచ్చు.
సంబంధిత కథనం