Cardiac Arrest । డియోడరెంట్ స్ప్రే చేస్తే ఆగిపోయిన గుండె.. కార్డియాక్ అరెస్ట్‌తో టీనేజర్ మృతి!
Cardiac Arrest Due To Deo: మీరు పరిమళాలు వెదజల్లే డియోడరెంట్లు ఎక్కువగా ఉపయోగిస్తారా? అయితే జాగ్రత్త గుండె ఆగిపోవచ్చు.
Cardiac Arrest Due To Deo: చాలా మంది చెమట వాసనను నివారించడానికి అలాగే స్నానం చేయని సందర్భంలో చాలా డియోడరెంట్‌లను లేదా డియో పెర్ఫ్యూమ్‌లను ఉపయోగిస్తున్నారు. మీరు ఈ జాబితాలో ఉంటే తస్మాత్ జాగ్రత్త.
ట్రెండింగ్ వార్తలు
ఈరోజుల్లో గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ మొదలైన హృదయ సంబంధింత సమస్యలతో మరణిస్తున్న వారి సంఖ్య చాలా పెరుగుతుంది. చిన్నవారు, పెద్దవారు అని కాకుండా వయసుతో సంబంధం లేకుండా ఆకస్మిక గుండెపోటుకు గురై ఉన్నచోటునే కుప్పకూలిపోతున్నారు. కొన్నిసార్లు కార్డియాక్ అరెస్ట్ వంటి ప్రాణాంతకమైన పరిస్థితి ఎప్పుడు ముంచుకు వస్తుందో, ఏ కారణంగా వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ఇటీవలే బ్రిటన్ దేశానికి చెందిన జార్జియా గ్రీన్ అనే 14 ఏళ్ల బాలిక తన గదిలో డియోడరెంట్ (Deodorant) స్ప్రే చేసి ఆ తర్వాత కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్టుకు గురయ్యింది. ఆ తర్వాత తన గదిలోనే శవమై కనిపించింది. ఆ అమ్మాయి ప్రమాదవశాత్తూ డియోడరెంట్‌లోని ఏరోసోల్‌ను పీల్చడంతో గుండె ఆగిపోయిందని వైద్యులు తెలిపారు. అయితే ఆమెకు అంతకుముందు ఎప్పుడూ, ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలాతో బాధపడలేదు. సంపూర్ణ ఆరోగ్యంతో, ఫిట్‌గా ఉన్న అమ్మాయి. కేవలం డియోడరెంట్ వాసన పీల్చి, కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
డియోడరెంట్లలో ఉపయోగించే ఏరోసోల్ (Aerosol) హానికరమైన, విషపూరితమైన రసాయనాలను కలిగి ఉంటుంది. ఆ వాయువులు పీల్చడం ప్రాణాంతకం కావచ్చు, ముఖ్యంగా వీటి నుంచి పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు కలిగిన వారు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఉత్పత్తులను పిల్లలకు దూరంగా ఉంచాలి. గర్భిణీలు, పసిబిడ్డలు ఉన్న గదులలో ఏరోసాల్స్ కలిగిన స్ప్రేలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి అయితే వీటికి బదులుగా టాల్కమ్ పౌడర్‌ని ఉపయోగించవచ్చునని తెలియజేస్తున్నారు.
What is Cardiac Arrest - కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి?
కార్డియాక్ అరెస్ట్ అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి. ఈ పరిస్థితి సంభవించినపుడు వారి గుండె రక్తాన్ని పంపిణీ చేయడం నిలిచిపోతుంది, శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది ఉంటుంది. దీంతో అకస్మాత్తుగా గుండెకొట్టుకోవడం ఆగిపోతుంది, తక్షణ వైద్య సహాయం అందించలేకపోతే ప్రాణాలకే ప్రమాదం.
కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు
- ఛాతి నొప్పి
- వివరించలేని గురక
- శ్వాస ఆడకపోవుట
- మూర్ఛపోవడం
- తల తిరగడం
- లైట్-హెడ్నెస్
- క్రమరహిత హృదయ స్పందనలు
- లయబద్ధంగా లేని గుండె చప్పుడు
కార్డియాక్ అరెస్ట్ అనేది గుండెపోటుకు విభిన్నమైన పరిస్థితి, గుండెపోటు వచ్చినపుడు ధమనులు మూసుకుపోవడం కనిపిస్తుంది. అయితే కార్డియాక్ అరెస్ట్ వస్తే గుండె కొట్టుకోవడం ఆగిపోయే పరిస్థితి ఉంటుంది.
కాబట్టి కార్డియాక్ అరెస్ట్ సంభవించినపుడు వ్యక్తికి వెంటనే సీపీఆర్ చేయాలి, శ్వాస ఆడేలా చూడాలి, అత్యవసరంగా వైద్యసహాయం అందించాలి.
సంబంధిత కథనం