Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తవ్వుతుంటే.. మరో ట్విస్ట్!
ED Rains In Andhra Pradesh and Telangana : దిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచుతోంది. సోదాల్లో అనుమానితులను రహస్యంగా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంది.
దిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. సెర్చ్ ఆపరేషన్ల కోసం హైదరాబాద్‌లో 25 ఈడీ బృందాలు రంగంలోకి దిగాయి. దేశవ్యాప్తంగా 40 చోట్ల ఈడీ సోదాలు(ED Raids) జరిగాయి. కరీంనగర్(Karimnagar) జిల్లాకు చెందిన వెన్నమనేని శ్రీనివాసరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గంటల పాటు ప్రశ్నించారు. ఈ దర్యాప్తులో కీలక సమాచారం రాబట్టారు. అయితే ఈ కేసు ఏపీలోనూ ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తోంది.
అనుమానితులను ఈడీ రహస్యం(ED Enquiry)గా విచారిస్తోంది. కీలక ఆధారాలను రాబడుతోంది. ఓ ఫార్మా కంపెనీ ముఖ్యుడితోపాటుగా స్టాఫ్ట్ వేర్ కంపెనీ డైరెక్టర్లు కూడా ఉన్నట్టుగా సమాచారం. ఫార్మా కంపెనీకి చెందిన వ్యక్తితో ఏపీ ప్రభుత్వ పెద్దలకు సైతం బంధుత్వం ఉందట. తెలంగాణలోనూ ఈడీ దూకుడు పెంచుతోంది. ప్రముఖులపై సోదాలు జరిగే అవకాశం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కేసు ఎటు వైపు తీసుకెళ్తుందోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఫార్మా కంపెనీ(Pharma Company) ప్రముఖుడిని ఈడీ రహస్యంగా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అది నిజమే అయితే.. ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో చూడాల్సి ఉంది.
రాయదుర్గం ప్రాంతంలోని జయభేరి అపార్ట్‌మెంట్స్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా, చెన్నై, బెంగళూరులోని పలు చోట్ల సోదాలు జరిగాయి. హైదరాబాద్‌లోని రామచంద్రన్ పిళ్లై(ramachandran pillai) కంపెనీలు, ఇంటిపై దాడులు కూడా జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు పిళ్లై డైరెక్టర్‌గా ఉన్నారు. కంపెనీ భాగస్వాములైన అభిషేక్‌రావు, జి ప్రేంసాగర్‌ల ఇళ్లలోనూ సోదాలు చేశారు. మద్యం పాలసీ కేసుకు సంబంధించి దిల్లీ, ఇతర నగరాల్లో ఈడి సోదాలు నిర్వహిస్తోంది.
కిదంటి సోమవారం రామంతపూర్, మాదాపూర్‌లలోని రెండు సాఫ్ట్‌వేర్ సంస్థల్లో సోదాలు జరిగాయి. అయితే ఇందులోని ఓ వ్యక్తికి.. ఓ ప్రజాప్రతినిధితో దగ్గరి సంబంధాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈడీ స్వాధీనం చేసుకున్న పత్రాలు, హార్డ్‌డిస్క్ లు చూస్తే.. వచ్చిన లాభాలకు, జరిగిన లావాదేవీలకు సంబంధం లేదని తేలింది. నిధుల మళ్లింపు కోసమే సంస్థను వాడుకున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ కంపెనీలకు చెందిన డైరెక్టర్లను ఈడీ విచారణ చేస్తున్నట్టుగా సమాచారం.
రాబిన్ డిస్టిలరీస్ పై విచారణ చేస్తుంటే.. మిగతా కంపెనీల పేర్లు కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మద్యం కాంట్రాక్టుల కోసం.. దిల్లీకి చాలా సార్లు వెళ్లినట్టుగా సమాచారం. దీనికోసం ఓ ఫార్మా కంపెనీ ప్రముఖుడే విమానం సమకూర్చడట. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. వ్యాపార లావాదేవీల కోసం పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు వెలిశాయని ఈడీ గుర్తించినట్టుగా తెలుస్తోంది. దిల్లీ మద్యం స్కామ్(Delhi Liquor Scam) లో ఈ కంపెనీలకు సంబంధం ఉన్నా లేకపోయినా.. లాభాలు వచ్చినట్టు చూపించి.. ఇతర కంపెనీలకు డబ్బులు మళ్లీస్తున్నారు. ఇది కూడా చట్ట విరుద్ధమే.. దీనిని సైతం ఈడీ సీరియస్ గా తీసుకుంది.
దిల్లీ లిక్కర్ సిండికేట్లతో సంబంధాల నేపథ్యంలో ఈడీ ప్రశ్నించిన వెన్నమనేని శ్రీనివాసరావు(Vennamaneni Srinivas Rao)కు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన వెన్నమనేని శ్రీనివాసరావు పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌లో గ్రానైట్ వ్యాపారంతో పాటు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఇసుక క్వారీలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా వెన్నమనేని నిర్వహిస్తున్నారు. దిల్లీ మద్యం సిండికేట్ల వ్యవహారంలో అరుణ్ రామచంద్ర పిళ్లైపై కేసులు నమోదు అయ్యాయి.
దిల్లీ లిక్కర్ స్కాం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉందని ఆప్‌తో పాటు టిఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. దిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పేరు మొదట్లో వినిపించింది. బీజేపీ నేతలు(BJP Leaders) నేరుగా కవితను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పించారు. దీంతో లిక్కర్ సిండికేట్ల వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత(MLC Kavitha) వివరణ ఇచ్చారు. కేసీఆర్‌ను ఢీకొట్టలేక తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.
సంబంధిత కథనం