Delhi Liquor Scam : దర్యాప్తులో దూకుడు… ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సోదాలు-enforcement directorate investigation in delhi liquor scam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Delhi Liquor Scam : దర్యాప్తులో దూకుడు… ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సోదాలు

Delhi Liquor Scam : దర్యాప్తులో దూకుడు… ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సోదాలు

B.S.Chandra HT Telugu
Sep 20, 2022 06:44 AM IST

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ సిండికేట్ల వ్యవహారంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో జరుగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తు వేగం పెరిగింది. ఢిల్లీ లిక్కర్‌ సిండికేట్లకు రాజకీయ పార్టీలతో సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్‌లోని వ్యక్తులు లక్ష్యంగా ఈడీ దర్యాప్తు సాగుతోంది. మనీ లాండరింగ్ అభియోగాలపై హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి వెన్నమనేని శ్రీనివాసరావును ఏడు గంటల పాటు ప్రశ్నించారు.

<p>ఢిల్లీ లిక్కర్‌ స్కాం‌ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు (ఫైల్‌)</p>
ఢిల్లీ లిక్కర్‌ స్కాం‌ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు (ఫైల్‌) (ANI)

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో దర్యాప్తు హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతోంది. కరీం నగర్‌ జిల్లాకు చెందిన వెన్నమనేని శ్రీనివాసరావును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఏడు గంటల పాటు ప్రశ్నించారు. ఈ దర్యాప్తులో కీలక సమాచారం రాబట్టారని చెబుతున్నారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన రామచంద్ర పిళ్ళైపై ఈడీ కేసులు నమోదు చేసింది. పిళ్లైతో పాటు ప్రేమచంద్ర సాగర్‌, శ్రీనివాసరావులు కలిసి వ్యాపారాలు నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. శ్రీనివాసరావుకు చెందిన సంస్థ ద్వారా హవాలా లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. లిక్కర్‌ స్కాంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌ లావాదేవీలు జరిగాయని సిబిఐ అనుమానిస్తోంది. Delhi Liquor Scam ఢిల్లీ లిక్కర్‌ సిండికేట్లకు రాజకీయ పార్టీల వెన్నుదన్నుగా నిలిచాయనే ఆరోపణల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఈడీ సోదాలు జరిగాయి. గత వారం హైదరాబాద్‌తో పాటు దేశంలోని 40ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిగాయి. సోమవారం మరోసారి హైదరాబాద్‌లో ఈడీ సోదాలు నిర్వహించింది.

Delhi Liquor Scam వ్యవహారంలో సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ లిక్కర్‌ స్కాం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉందని ఆప్‌తో పాటు టిఆర్‌‌ఎస్‌ ఆరోపిస్తోంది. డిల్లీ లిక్కర్‌ స్కాంలో తెలంగాణ సిఎం కేసీఆర్‌ కుమార్తె కవిత పేరు మొదట్లో వినిపించింది. బీజేపీ నేతలు నేరుగా కవితను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పించారు. దీంతో లిక్కర్‌ సిండికేట్ల వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత వివరణ ఇచ్చారు. కేసీఆర్‌ను ఢీకొట్టలేక తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.

సోమవారం హైదరాబాద్‌లో జరిగిన Delhi Liquor Scam దర్యాప్తులో నిధుల తరలింపుకు సంబంధించి కీలక ఆధారాలను ఈడీ సేకరించింది. ఢిల్లీ మద్యం సరఫరాకు కాంట్రాక్టు దక్కించుకున్న లిక్కర్‌ కంపెనీలకు గోరంట్ల అసోసియేట్స్‌ ఆడిటింగ్‌ సేవల్ని అందించింది. ఆడిట్‌ కంపెనీలో కీలక ఫైల్స్‌, హార్డ్‌ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. ఆడిట్ కంపెనీలో లభించిన పత్రాల్లో ఢిల్లీ మద్యం సిండికేట్ల మధ్య లావాదేవీలను గుర్తించారు. ఈ లావాదేవీల నేపథ్యంలో సోమవారం మరోసారి ఈడీ దర్యాప్తు కొనసాగించింది. Delhi Liquor Scam కు సంబంధించి నగదు లావాదేవీలు హైదరాబాద్ నుంచి జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఢిల్లీలో లిక్కర్‌ సిండికేట్లకు జరిపిన జోన్ల కేటాయింపుల్లో అక్రమంగా నగదు చెల్లింపులు హైదరాబాద్‌ నుంచి జరిగినట్లు గుర్తించారు.

Delhi Liquor Scam కోసం జరిగిన నగదు లావాదేవీలు ఎవరి కోసం ఎవరు చేశారనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. సోమవారం ఈడీ ప్రశ్నించిన వెన్నమనేని శ్రీనివాసరావుకు పలువురు రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయని ఈడీ గుర్తించింది.

ప్రముఖులతో సంబంధాాలు….

ఢిల్లీ లిక్కర్‌ సిండికేట్లతో సంబంధాల నేపథ్యంలో ఈడీ ప్రశ్నించిన వెన్నమనేని శ్రీనివాసరావుకు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన వెన్నమనేని శ్రీనివాసరావు పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌లో గ్రానైట్‌ వ్యాపారంతో పాటు వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో ఇసుక క్వారీలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌‌లో రియల్‌ ఎస్టేట్ వ్యాపారం కూడా వెన్నమనేని నిర్వహిస్తున్నారు. ఢిల్లీ మద్యం సిండికేట్ల వ్యవహారంలో సిబిఐ అరుణ్‌ రామచంద్ర పిళ్లైపై కేసులు నమోదు చేసింది.

పిళ్లైకు చెందిన రాబిన్ డిస్ట్రిలరీస్‌ కంపెనీలో గండ్ర ప్రేమ సాగర్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. వెన్నమనేని, ప్రేమసాగర్‌ బావ అవుతారు. హవాలా పద్ధతుల్లో మద్యం కాంట్రాక్టుల మద్యం హైదరాబాాద్‌ నుంచి ఢిల్లీ వరకు చేరిందని అనుమానిస్తున్నారు. సోమవారం వెన్నమనేనికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని రెండు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో కూడా సోదాలు నిర్వహించారు. 2016లో ఏర్పాటైన ఐటీ కంపెనీలో ఈడీ తనిఖీలు నిర్వహించింది. రామాంతపూర్‌లో ఉన్న కంపెనీతో పాటు, మాదాపూర్‌లోని మరో సంస్థలో తనిఖీలు జరిపారు. రెండు సంస్థల్లో ఏడుగురు డైరెక్టర్లు ఉన్నారు. మద్యం ముడుపుల కేసులో దర్యాప్తు కొలిక్కి వచ్చినట్టేనని ప్రచారం జరుగుతోంది. పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహించాయో దర్యాప్తు సంస్థలు గుర్తించారని చెబుతున్నారు. రాజకీయ ప్రమేయం ఉన్న వ్యవహారంలో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Whats_app_banner