AP Rains Update: ఏపీని వీడని వానగండం, బలహీనపడి.. మళ్లీ వెనక్కి పయనిస్తున్న అల్పపీడనం,ఈ వారం కూడా భారీ వర్షాలు-rainstorms continue to hit ap weakening low pressure moving back again alert for south coast ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rains Update: ఏపీని వీడని వానగండం, బలహీనపడి.. మళ్లీ వెనక్కి పయనిస్తున్న అల్పపీడనం,ఈ వారం కూడా భారీ వర్షాలు

AP Rains Update: ఏపీని వీడని వానగండం, బలహీనపడి.. మళ్లీ వెనక్కి పయనిస్తున్న అల్పపీడనం,ఈ వారం కూడా భారీ వర్షాలు

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 23, 2024 08:37 AM IST

AP Rains Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముప్పు తప్పినట్టే తప్పి మళ్లీ తిరగబెట్టింది. దిశ మార్చుకుని బంగాళాఖాతంలోనే కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలకు మరోసారి వానగండం పొంచి ఉంది.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

AP Rains Update: పశ్చిమ బంగాళాఖాతంలో గత వారం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అలాగే కొనసాగుతోంది. అల్పపీడనం పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ మంగళవారం నాటికి ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా తీరం వైపు వెళుతుందని ఐఎండీ తెలిపింది.అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి గురువారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

అల్పపీడనం ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశా‌ఖపట్నం వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. బుధ వారం సముద్రంలో గంటకు గరిష్టంగా 55 కి. మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేప థ్యంలో ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పోర్టులకు మూడో నంబరు హెచ్చరిక జారీ చేయనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురు వారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడిందని శనివారం ప్రకటించారు. అయితే ఆదివారం నాటికి అది సముద్రంలో కొనసాగుతూ దిశ మార్చుకోవడంతో దాని ప్రయాణం గందరగోళంగా మారింది. అల్పపీడనం కదలికలను ఐఎండీ కూడా స్పష్టంగా అంచనా వేయలేకపోతోంది. ఆదివారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే పూర్తిగా బలహీన పడుతుందని భావించారు.

కానీ అది అలాగే కొనసాగుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా (ఏపీ) తీరాల వైపు పయనిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు లేకపో వడంతో ఈ పరిస్థితి నెలకొందని, ఇలాంటివి అరుదుగా జరుగుతాయని ఐఎండీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం వరకు అల్పపీడనం ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. అల్పపీడనం తీరానికి చేరువగా పయనిస్తుందా లేక తీరం దాటుతుందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో డిసెంబర్‌ 16న ఏర్పడిన అల్పపీడనం తర్వాత వాయుగుండంగా బలపడి, తమిళ నాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని నిపుణులు భావించారు. తర్వాత తీవ్ర అల్పపీడనంగా బలపడి ఏపీ తీరం వైపు వచ్చింది. మరో రెండు రోజులకు వాయు గుండంగా మారింది. శనివారం నాటికి క్రమేణా తీవ్ర అల్పపీడనంగా బలహీనమైంది. గత వారం రోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారతం నుంచి వీచే పశ్చిమ గాలుల ప్రభావంతో వాయుగుండం ఉత్తర కోస్తా (ఏపీ) తీరం వెంబడి ప్రయాణించిందని భావిస్తున్నారు. పశ్చిమ గాలుల ప్రభావం తగ్గడంతో మళ్లీ దిశ మార్చుకుని సముద్రంలోనే పయనిస్తోందని చెబుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో గత వారం రోజులుగా హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మరో వారం ఇదే రకమైన పరిస్థితిఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని స్పష్టం చేస్తున్నారు.

Whats_app_banner