Bharatmala Project : ఆంధ్రప్రదేశ్‌లో రెండు హైవే ప్రాజెక్టులు
భారతమాల ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రాజెక్టులకు పరిపాలనా ఆమోదం లభించిందని కేంద్ర రోడ్డు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇందులో భాగంగా రెండు హైవే ప్రాజెక్టులు రానున్నాయి.
భారతమాల ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రాజెక్టులకు పరిపాలనా ఆమోదం లభించిందని కేంద్ర రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. చిల్లకూరు క్రాస్ రోడ్డు నుంచి తూర్పు కాన్పూర్ వరకు రూ.909.47 కోట్లతో మొత్తం 36.05 కిలోమీటర్ల పొడవునా నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవేను నిర్మిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.
అలాగే నాయుడుపేట (గ్రీన్‌ఫీల్డ్స్) నుంచి తుర్పు కాన్పూర్ వరకు మొత్తం 34.881 కి.మీ పొడవునా ఆరు లేన్ల రహదారి నిర్మాణం రూ.1,398.84 కోట్లతో జరుగుతుందని కేంద్ర మంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు.
భారతమాల ప్రాజెక్ట్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చేపడుతున్న పథకమన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సరకు రవాణా, ప్రయాణీకులకు ట్రాఫిక్ సమస్యను తప్పించడంలాంటివి ఈ ప్రాజెక్టు ఉద్దేశం. మొదటి దశలో 34,800 కిలోమీటర్ల ఆర్థిక కారిడార్లు, పోర్ట్ కనెక్టివిటీ రోడ్లు, సరిహద్దు, అంతర్జాతీయ కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధిని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
భారత్‌మాల ప్రాజెక్టు మొదటి దశ కింద ప్రభుత్వం డిసెంబర్ వరకు రూ.5.60 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను మంజూరు చేసింది. 6,750 కిలోమీటర్ల ప్రాజెక్టుల అభివృద్ధి పూర్తయిందని గత డిసెంబర్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు.
2022-23 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను ఆర్థిక సంవత్సరంలో 25,000 కి.మీల మేర విస్తరించాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు 68 శాతం పెంచారు.