TRS MPTC : పొలం అమ్మలేదని వృద్ధ దంపతులపై దాడి… టిఆర్‌‌ఎస్‌ నాయకుడి దారుణం-trs mptc husband attacked on elderly couple in vikarabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Trs Mptc Husband Attacked On Elderly Couple In Vikarabad

TRS MPTC : పొలం అమ్మలేదని వృద్ధ దంపతులపై దాడి… టిఆర్‌‌ఎస్‌ నాయకుడి దారుణం

HT Telugu Desk HT Telugu
Sep 20, 2022 10:42 AM IST

TRS MPTC మూడున్నర ఎకరాల పొలాన్ని అమ్మడం లేదనే కోపం వృద్ధ జంటపై టిఆర్‌ఎస్‌ నాయకుడు దాడి చేశాడు. ఈ దాడిలో వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. కర్రలు, రాతి బండలతో వృద్ధులనే కనికరం లేకుండా ఎంపీటిసి భర్తతో పాటు అతని సోదరుడు దాడి చేయడం సిసిటివిలో రికార్డైంది.

వికారాబాద్‌ వృద్ధ జంటపై టిఆర్‌‌ఎస్‌ నాయకుడి దాడి
వికారాబాద్‌ వృద్ధ జంటపై టిఆర్‌‌ఎస్‌ నాయకుడి దాడి

TRS MPTC పొలం అమ్మడం లేదని వృద్ధ దంపతులపై టీఆర్ఎస్​ ఎంపీటీసీ భర్త, అతని తమ్ముడు తీవ్రంగా దాడి చేసిన ఘటన వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలో జరిగింది. పులుమామిడి గ్రామానికి చెందిన యాదయ్యకు గ్రామంలో మూడున్నర ఎకరాల పొలం ఉంది. పులుమామిడి ఎంపీటీసీ భర్త సోమన్నోళ్ల రామకృష్ణారెడ్డి ఆ పొలాన్నితనకు విక్రయించాలని యాదయ్యను అడగితే, ఆయన ఒప్పుకోలేదు. ఈ విషయంపై వారి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. యాదయ్య పొలం చుట్టూ ఉన్న భూముల్ని రామకృష్ణరెడ్డి సోదరులు కొనుగోలు చేశారు.

పొలం విక్రయించాలంటూ TRS MPTC రామకృష్ణారెడ్డి, అతడి తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గతంలో యాదయ్యను బెదిరించారు. సోమవారం మధ్యాహ్నం యాదయ్య తన భార్యతో కలిసి పొలానికి వెళ్లారు. పొలం దగ్గర ఉన్న షెడ్డులో ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులతో రామకృష్ణారెడ్డి తన భార్య, తమ్ముడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో రెచ్చిపోయిన అన్నదమ్ములు కర్రలు, బండలతో వృద్ధులపై దాడి చేశారు. ఈ దాడిలో బాధితులు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు వారిని వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పొలం అమ్మడం లేదనే కక్షతోనే TRS MPTC ఎంపీటీసీ, ఆమె భర్త రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు దాడి చేశారని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీటీసీతో పాటు ఆమె భర్త రామకృష్ణారెడ్డి, తమ్ముడు శ్రీనివాసరెడ్డి, అతడి భార్యపై కేసు నమోదు చేశారు. TRS MPTC అగడాలపై గతంలో పలుమార్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. సోమవారం తాను లేని సమయం చూసి దాడికి దిగారని యాదయ్య కుమారుడు ఆరోపిస్తున్నాడు. తమ పొలం చుట్టూ ఉన్న భూముల్ని అమ్మాలని కొన్నాళ్లుగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు. వికారాబాద్‌ ఎస్పీకి సైతం గతంలో ఫిర్యాదు చేశామని పోలీసులు నిందితుడికే మద్దతుగా నిలిచారని చెబుతున్నారు.

పులుమామిడి TRS MPTC ఎంపీటిసి భర్త తీరుపై పలు ఆరోపణలు ఉన్నాయి. సోమవారం విచక్షణా రహితంగా వృద్ధులపై దాడి చేయడంతో స్థానికులు ఎంపిటిసి భర్త అడగాలను మొరపెట్టుకుంటున్నారు. గ్రామంలో ఎదురు తిరిగిన వారిపై దాడి చేయడం, ప్రత్యర్థుల వాహనాలను ధ‌్వంసం చేయడం అలవాటుగా మారిందని చెబుతున్నారు. గతంలో అతనిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానిక ఎస్సై అతనికి అండగా నిలుస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫిర్యాదు చేసిన వ్యక్తి పైన తిరిగి కేసు పెట్టి , జైలుకు పంపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఎంపీటీసీ భర్త రామకృష్ణారెడ్డి పై టిఆర్ఎస్‌ పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చుట్టుపక్కల భూముల్ని ఎంపీటీసీ కొనుగోలు చేశారని, పోలీసు కేసులు పెట్టినా, ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని, భూములు ఇవ్వనందుకు తమపై దాడి చేశారని బాధితుల కుటుంబీకు వాపోతున్నారు.

IPL_Entry_Point

టాపిక్