Excise policy probe: లిక్కర్ స్కామ్‌పై ఈడీ స్పీడ్.. 36 ప్రాంతాల్లో సోదాలు..-in delhi excise policy probe ed raids at over 3 dozen places in multiple states ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Excise Policy Probe: లిక్కర్ స్కామ్‌పై ఈడీ స్పీడ్.. 36 ప్రాంతాల్లో సోదాలు..

Excise policy probe: లిక్కర్ స్కామ్‌పై ఈడీ స్పీడ్.. 36 ప్రాంతాల్లో సోదాలు..

HT Telugu Desk HT Telugu
Sep 16, 2022 10:47 AM IST

Excise policy probe: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా 36 ప్రాంతాల్లో సోదాలు జరుపుతోంది.

<p>ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకాలు జరిగాయన్న ఆరోపణలపై సోదాలు జరుపుతున్న ఈడీ</p>
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకాలు జరిగాయన్న ఆరోపణలపై సోదాలు జరుపుతున్న ఈడీ ((Facebook) )

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం పలు రాష్ట్రాల్లోని 36 ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించిందని అధికారులు తెలిపారు. దేశ రాజధానిలో బీజేపీ, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య రాజకీయ ప్రతిష్టంభనకు మద్యం పాలసీ కేసు కేంద్రంగా మారింది.

అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి పుట్టిందని గొప్పగా చెప్పుకునే ఆప్‌పై ప్రత్యర్థి పార్టీలు మనీలాండరింగ్ ఆరోపణలు చేశాయి. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా గతంలో ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. ఆయన సూచన మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ పెద్దఎత్తున సోదాలు చేపట్టింది.

దర్యాప్తు సంస్థల రాడార్‌లో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆప్ పదే పదే ఆరోపిస్తోంది.

ఏపీ, తెలంగాణల్లోనూ సోదాలు..

ఢిల్లీతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరుపుతోంది. తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరులోని పలు ప్రదేశాల్లో సోదాలు జరుపుతోంది. బెంగళూరు, చెన్నై‌లో కూడా సోదాలు చేపడుతోంది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఇదివరకే ఒకసారి ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఈ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ చేసిన ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు సాగుతోంది.

హైదరాబాద్‌లో ఇదివరకు అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ప్రేమ్ సాగర్ రావు, అభిషేక్ తదితరుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిపింది. వీరంతా రాబిన్ డిస్టిలరీ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు. ఇటీవలి సోదాల్లో వెలుగు చూసిన సమాచారం ఆధారగా శుక్రవారం మరికొన్ని చోట్ల సోదాలు జరుపుతున్నారు.

ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎక్సైజ్ పాలసీలో పెద్ద ఎత్తున చేతులు మారాయని, ఇందులో ఏపీ, తెలంగాణకు సంబంధించిన కంపెనీలు, ప్రముఖులకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి.

Whats_app_banner