Liquor scam: లిక్కర్ స్కామ్‌లో ఈడీ యాక్షన్.. హైదరాబాద్‌లో దాడులు..
ED raids in Liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దర్యాప్తుతో పాటు ఈడీ ఇప్పటికే రంగంలోకి దిగింది. హైదరాబాద్‌లోని పలువురి నివాసాలు, కార్యాలయాలపై దాడులు జరుపుతోంది.
ED raids in Liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై చర్యలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలోకి దిగింది. లిక్కర్ పాలసీలో పెద్ద ఎత్తున నల్లధనం చేతులు మారిందనడానికి ప్రాథమిక ఆధారాలను సేకరించిన ఈడీ.. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, చండీఘడ్, చెన్నై తదితర నగరాల్లో సోదాలు ప్రారంభించింది.
ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితుల నుంచి సీబీఐ సమాచారం సేకరించింది. ఇందులో మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించిన వ్యవహారాలపై లోతైన దర్యాప్తులో భాగంగా ఈరోజు ఈడీ సోదాలు ప్రారంభించింది.
రాబిన్ డిస్టిలర్స్ ప్రధాన కార్యాలయంఫై సోదాలు కొనసాగుతున్నట్టు ప్రాథమిక సమాచారం. ఈ సంస్థ డైరెక్టర్లు గండ్ర ప్రేమ్‌సాగర్, అరుణ్ రామచంద్ర పిళ్లైల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు సాగుతున్నట్టు సమాచారం.
ఢిల్లీకి చెందిన ఇండో స్పిరిట్ ప్రయివేటు లిమిటెడ్ యజమాని సమీర్ మహేంద్రుతో రాబిన్ డిస్టిలర్స్ ప్రయివేటు లిమిటెడ్‌కు లింక్స్ ఉన్నట్టు సీబీఐ ప్రాథమిక విచారణలో తేలింది. రామచంద్ర పిళ్లై లిక్కర్ డిస్ట్రిబ్యూటర్స్‌కు మధ్యవర్తిగా, మహేంద్రు లిక్కర్ షాపుల సిండికేట్‌కు మధ్యవర్తిగా వ్యవహరించినట్టు సీబీఐ ప్రాథమిక విచారణలో తేలింది. పిళ్లై కోకాపేట్ నివాసంలోనూ, బెంగళూరు నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం.
స్కామ్‌తో సంబంధం ఉందని అనుమానిస్తున్న పిళ్లై వ్యాపార భాగస్వామి బోయినపల్లి అభిషేక్ రావ్ నివాసాలు, కార్యాలయాలపై కూడా సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
వ్యాపారులకు అనుకూలంగా లిక్కర్ పాలసీ తయారైందని, షాపుల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా లేదని, కేటాయింపుల్లో భారీగా నల్లధనం చేతులు మారిందని సీబీఐ ప్రాథమిక విచారణలో తేలింది.
మొత్తం వ్యవహారంలో 14 మందిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది.