తెలుగు న్యూస్  /  Telangana  /  Gutha Sukender Reddy Son Amith Reddy Eye On Munugodu Assembly Seat

TS Assembly Elections : 'వారసుడి' ఎంట్రీకి స్కెచ్! మరీ ఆ BRS నేత ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

HT Telugu Desk HT Telugu

07 May 2023, 12:00 IST

    • TS Assembly Elections 2023: మరికొద్ది నెలల్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల శంఖారావం మోగనుంది. పలు స్థానాలపై నజర్ పెట్టిన కొందరు నేతలు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే మునుగోడు సీటుపై ఓ యువనేత కన్నేశారు.ఈ పరిణామం కాస్త ఉమ్మడి నల్గొండ జిల్లా పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

Telangana Assembly Elections 2023: తెలంగాణలో ఎన్నికల ఏడాది కావటంతో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించే వారి సంఖ్య పెరిగిపోతోంది. సిట్టింగ్ లు ఉన్నచోట కూడా ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలన్న టార్గెట్ తో అడుగులు వేస్తున్నారు నేతలు. ఆ విషయానికొస్తే అధికార బీఆర్ఎస్ లో ఈ పరిస్థితి కాస్త ఎక్కువగానే ఉంది. చాలా నియోజకవర్గాల్లోనూ అసమ్మతి మంటలు రాజుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లిన బీఆర్ఎస్.... రేసు గుర్రాలపై ఫోకస్ పెంచుతోంది. చాలా స్థానాల్లో సిట్టింగ్ లకే మరోసారి ఛాన్స్ ఉండగా... మరికొన్ని స్థానాల్లో మాత్రం కొత్త అభ్యర్థులను నిలిపాలని చూస్తోంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సీటుపై ఓ యువనేత కన్నేశారన్న చర్చ గట్టిగా జరుగుతోంది. ఇదీ కాస్త టాక్ ఆఫ్ ది నల్గొండగా మారిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

TS DOST Notification 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Padmasri Awardee Mogulaiah: దినసరి కూలీగా పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగలయ్య, గౌరవ వేతనం ఆగడంతో కష్టాలు

3 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

'గుత్తా' వారసుడిగా ఎంట్రీ...!

వచ్చే ఎన్నికల్లో తాము బరిలో ఉండకుండా... వారసులను దింపాలని కొందరు సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఆ దిశగా అధినాయకత్వంతో కూడా చర్చలు జరుపుతున్నారు. అలాంటి నేతల్లో బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒకరిగా ఉన్నారు. ఆయన వారసుడిగా అమిత్ రెడ్డిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలపాలని యోచిస్తున్నారు. ఇక అమిత్ రెడ్డి కూడా నల్గొండ జిల్లా కేంద్రంగా యాక్టివిటిస్ పెంచుతున్నారు. ‘గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్’ పేరుతో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు, ఆన్ లైన్ కోచింగ్ వంటి వాటిని కూడా తీసుకొస్తున్నారు. అయితే ఓవైపు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూనే.... పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు ఆయనకు కనిపిస్తున్న ఆప్షన్ 'మునుగోడు' సీటు అన్న టాక్ జిల్లాలో గట్టిగా వినిపిస్తోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ దిశగా పావులు కదుపుతున్నారని... ఇప్పటికే అధినేత కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లారన్న చర్చ జోరందుకుంది.

నిజానికి ఉమ్మడి నల్గొండ జిల్లాపై మంచి పట్టు ఉన్న నేతల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి ఒకరని చెప్పొచ్చు. ముఖ్యంగా నల్గొండ, మిర్యాలగూడ, మునుగోడు నియోజకవర్గాల్లో మంచి అనుచరగణం కూడా ఉంది. గతంలో పలుమార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన ఆయన... ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్ గా ఉన్నారు. మొన్న జరిగిన మునుగోడు బైపోల్ సందర్భంలోనూ గుత్తా పేరు గట్టిగా వినిపించింది. దాదాపు ఆయనకే ఖరారు అన్న రేంజ్ లో చర్చ జరిగింది. అయితే చివరికి కూసుకుంట్లకే టికెట్ ఇచ్చారు కేసీఆర్. ప్రస్తుతం నల్గొండ, మిర్యాలగూడ సీట్లతో పోల్చితే... మునుగోడుపై కాస్త ఎక్కువగానే ఫోకస్ చేశారని తెలుస్తోంది. మొత్తంగా ఈ మూడింటిల్లో ఎక్కడ్నుంచి టికెట్ ఇచ్చినా బరిలో దిగాలని భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే పలువురు సిట్టింగ్ లకు హెచ్చరికలు జారీ చేశారు కేసీఆర్. పని తీరు మార్చుకోకపోతే టికెట్ ఉండదని కూడా తేల్చి చెప్పారు. అయితే ఈ జాబితాలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఎవరైనా ఉంటారా..? ఉంటే ఎవరు..? అన్న చర్చ కూడా షురూ అయింది. అలాంటి పరిణామాలే జరిగితే జరిగితే గుత్తా వారుసుడికి దాదాపు లైన్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో గులాబీ బాస్ ఆలోచన ఎలా ఉండబోతుందనేది చివరి వరకు ఆసక్తికరంగానే ఉండనుంది.

మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో....టికెట్ల కోసం బిజీ అయిపోతున్నారు నేతలు. ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ సర్వేల ఆధారంగానే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ దిశగానే కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు స్థానాల నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.