BRS Internal Clashes: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా కీలక నేతలు, అసమ్మతిపై దృష్టిపెట్టిన అధిష్ఠానం!
BRS Internal Clashes : పార్టీలో అసంతృప్తిపై బీఆర్ఎస్ అధిష్ఠానం దృష్టి సారించింది. ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా ఉంటున్న నేతలు, అసమ్మతి నాయకులపై ఆరా తీస్తుంది.
BRS Internal Clashes: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో నేతల బాహాబాహీపై అధిష్ఠానం దృష్టిపెట్టింది. ఇటీవల మేడ్చల్ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. స్టేట్ పైనే వీరిద్దరూ మాటలదాడి చేసుకున్నారు. తరచూ ఇలాంటి ఘటన జరగడంపై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ అయింది. ఎన్నికల ఏడాది కాబట్టి ముందు కార్యకర్తలు, నేతలను కూల్ చేసేందుకు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుంది. అయితే కొందరు అసమ్మతి నేతలు ఈ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై అసంతృప్తితో ఉన్న నేతలు ఈ సభలు, సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. అసంతృప్తిలో ఉన్న నేతలపై బీఆర్ఎస్ అధిష్ఠానం దృష్టిపెట్టింది.
ఆత్మీయ సమావేశాలకు దూరంగా కీలక నేతలు
ఆత్మీయ సమ్మేళనాలలో పార్టీపై విమర్శలు చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఇద్దరి సస్పెన్షన్ తో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వేటు తప్పదనే సంకేతాలు ఇచ్చింది. నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాల బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించింది అధిష్ఠానం. ఈ మేరకు ఆత్మీయ సమ్మేళనాల ప్రొగ్రెస్‌ను వారంతా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నివేదిస్తున్నారు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్దుకుపోవాలని నేతలకు మంత్రి కేటీఆర్ సూచించారు. సమస్య మరీ పెద్దదైతే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఇప్పటికే 40కి పైగా నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా ఉంటున్నట్లు అధిష్ఠానం గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో వారి అసంతృప్తికి కారణాలు తెలుసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ లను ఆదేశించింది. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడుతున్న నేతలు సడెన్ సైలెంట్ అవ్వడంపై ఆరా తీస్తుంది.
ఈ నెల 25 పార్టీ నేతల సమావేశాలు
ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నెల 27న ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 25న నియోజకవర్గ స్థాయిలో పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించాలని ఆదేశించింది. పార్టీ ఇన్‌ఛార్జ్ లు, ఎమ్మెల్యేల అధ్యక్షతన ఈ సభలు జరగనున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు సమావేశాల నిర్వహణను సమన్వయం చేయనున్నారు. 25న ప్రతి నియోజకవర్గంలోని గ్రామాలు, వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఎగురవేయాలని, ఆ తర్వాత ఉదయం 10 గంటల కల్లా నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రతినిధులు సభ సమావేశానికి హాజరవ్వాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ సూచించారు. రోజంతా నిర్వహించే ఈ సభల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలన్నారు. పార్టీ తరఫున చేపట్టే ఈ కార్యక్రమాలపై సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నట్టు చెప్పారు. నియోజకవర్గాల్లో ఈ సభలను కనీసం 2500 -3000 మందితో నిర్వహించాలన్నారు. ఈ సమావేశాల్లో పార్టీ అంతర్గత వ్యవహారాలు కూడా చర్చించాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.
సంబంధిత కథనం