MP Komatireddy : నల్గొండలో ప్రియాంక గాంధీ సభ... పోటీపై ఎంపీ కోమటిరెడ్డి కీలక ప్రకటన-congress mp komatireddy venkat reddy key statement on bhatti padayatra and upcoming elections ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Congress Mp Komatireddy Venkat Reddy Key Statement On Bhatti Padayatra And Upcoming Elections

MP Komatireddy : నల్గొండలో ప్రియాంక గాంధీ సభ... పోటీపై ఎంపీ కోమటిరెడ్డి కీలక ప్రకటన

HT Telugu Desk HT Telugu
Apr 22, 2023 04:08 PM IST

Congress MP Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇక భట్టి పాదయాత్రకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు.

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (facebook)

MP Komatireddy Venkat Reddy Comments: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు డబ్బులు ఇచ్చిందంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానే రేపుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి పాదయాత్ర నడుస్తుండగా... భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి తీరుతానని తేల్చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే ఓ ఓటు ఎక్కువే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

నల్గొండలోని ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డి.... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చామని గుర్తు చేశారు. 12 శాతం రిజర్వేషన్ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. దత్తత తీసుకుంటున్న అని చెప్పిన నల్గొండలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టలేదని దుయ్యబట్టారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నల్గొండ ఈద్గా దగ్గరలో రాజీవ్ గృహకల్ప కింద 300 ఇళ్లు కట్టించానని... ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని చెప్పారు. సొంత జాగా ఉంటే లక్ష రూపాయలు ఇచ్చామని ప్రకటించారు. గజ్వేల్ లో 5 వేల ఇళ్లు కట్టించిన కేసీఆర్.. నల్గొండలో ఎందుకు కట్టలేదని సూటిగా నిలదీశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వానికి నాలుగున్నర నెలల సమయమే ఉందన్నారు కోమటిరెడ్డి. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. గతంలో సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి లక్ష రూపాయలు ఎలా ఇచ్చామో.. ఈసారి 5 లక్షలు ఇస్తామని హామీ ఇస్తున్నామని చెప్పారు. ఈసారి కూడా తాను నల్గొండ నుంచే పోటీ చేస్తానని... అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. " దేశంలో అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారు. ప్రధాని మోడీ ఇంటికో ఉద్యోమన్నారు. 15 లక్షలు ఇస్తానన్నారు. ఎక్కడా ఉద్యోగాలు లేవు.. 15 లక్షలు ఇచ్చింది లేదు. వంట గ్యాస్ మాత్రం 15 వందలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సబ్సిడీ భరిస్తూ 500 రూపాయలకే వంటగ్యాస్ అందిస్తాం"అని తెలిపారు.

ప్రియాంక గాంధీ సభ...

ఇక భట్టి విక్రమార్క పాదయాత్రకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు ఎంపీ కోమటిరెడ్డి. భట్టి విక్రమార్క పాదయాత్ర భువనగిరి నియోజకవర్గం, అలాగే నల్గొండ మీదుగా ఖమ్మం వెళ్తుందని చెప్పారు. నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని... ఈ సభకు ప్రియాంక గాంధీని తీసుకురావాలని చూస్తున్నామని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లామని... సానుకూలంగానే మాట్లాడారని పేర్కొన్నారు. నల్గొండలో ప్రియాంక గాంధీ సభ ఉంటుందని కామెంట్స్ చేశారు. ఇక నల్గొండలోని 12 అసెంబ్లి స్థానాల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం