MP Komatireddy : మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్, కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు-mancherial congress mp komatireddy sensational comments on telangana election brs government ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mp Komatireddy : మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్, కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

MP Komatireddy : మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్, కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu
Apr 15, 2023 08:43 AM IST

MP Komatireddy : తెలంగాణలో ఎన్నికలు, దళిత సీఎం పై ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కేబినెట్ లో ఎంత మంది దళిత మంత్రులు ఉన్నారని ప్రశ్నించారు.

ఎంపీ కోమటిరెడ్డి
ఎంపీ కోమటిరెడ్డి

MP Komatireddy : మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణలో అకాల వర్షాలతో రైతులు నష్టపోతుంటే బీఆర్ఎస్ నేతలు ఏపీ మంత్రులపై, నాందేడ్ లో బీఆర్ఎస్ పార్టీని బలపరచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. ప్రజ్ఞాపూర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన... మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెడతారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ప్రజలలోకి వెళ్తుందని, ఈసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

భట్టిని వైఎస్ తో పోలుస్తూ

భట్టి విక్రమార్కను చూస్తుంటే వైఎస్ఆర్ గుర్తుకు వస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారం నమ్మొద్దన్న ఆయన.. అందరూ కలిసి చేస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో ఏదో చేసినట్టు మహారాష్ట్ర గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేసీఆర్ ఒప్పుకున్నరా, లేదా కేసీఆర్ ప్రమాణం చేయాలని సవాల్‌ విసిరారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టిన కేసీఆర్, తన కేబినెట్ లో సామాజిక న్యాయం ఎందుకు పాటించడంలేదన్నారు. కేసీఆర్ కేబినెట్ లో ఒక దళిత మంత్రే ఉన్నారన్నారు. మాదిగ సామాజిక వర్గానికి ఎందుకు స్థానం కల్పించలేదని ప్రశ్నించారు. మంత్రి పదవే ఇవ్వలేదు, ఇక అందరికీ దళిత బంధు ఇస్తారా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

కోమటిరెడ్డి దళిత సీఎం ప్రతిపాదన

అంతకు ముందు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొత్త ప్రతిపాదన తెచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేయాలని అధిష్టానాన్ని కోరతామన్నారు. రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం కూడా లేకపోలేదు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన కోమటిరెడ్డి ...అదంతా అవాస్తవం అన్నారు. తాను పార్టీ మారడంలేదని క్లారిటీ ఇచ్చారు. దళితులకు సీఎం కేసీఆర్ చేసిందేం లేదన్నారు. దళిత బంధు పథకం బీఆర్ఎస్ నేతలకు దోపిడీగా మారిందని ఆరోపించారు. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసినంత మాత్రాన దళితులకు అండగా ఉన్నట్టు కాదన్నారు. దళిత నాయకుడు మల్లిఖార్జున ఖర్గేను తమ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామన్న కోమటిరెడ్డి... కాంగ్రెస్‌లో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంటుందని స్పష్టం చేశారు.

IPL_Entry_Point