BRS AP : బీఆర్ఎస్ దెబ్బకే కేంద్రం దిగివచ్చింది.. త్వరలో విశాఖ వేదిక భారీ సభ - తోట చంద్రశేఖర్ -brs ap president thota chandra sekhar reaction on union minister statement over vizag steel plant privatization ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Brs Ap President Thota Chandra Sekhar Reaction On Union Minister Statement Over Vizag Steel Plant Privatization

BRS AP : బీఆర్ఎస్ దెబ్బకే కేంద్రం దిగివచ్చింది.. త్వరలో విశాఖ వేదిక భారీ సభ - తోట చంద్రశేఖర్

HT Telugu Desk HT Telugu
Apr 13, 2023 04:21 PM IST

Vizag Steel Plant Privatization Issue : ప్రజలకి అండగా నిలబడిన పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. తమ దెబ్బకే 'వైజాగ్ స్టీల్ ప్లాంట్' విషయంలో కేంద్రం దిగివచ్చిందన్నారు. ఏపీ విషయంలో హరీశ్ రావ్ కామెంట్స్ కూడా సరైనవే అని అన్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో తోట చంద్రశేఖర్(ఫైల్ ఫొటో)
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో తోట చంద్రశేఖర్(ఫైల్ ఫొటో)

AP BRS President Thota Chandra Sekhar: బీఆర్ఎస్ దెబ్బకే 'వైజాగ్ స్టీల్ ప్లాంట్' విషయంలో కేంద్రం దిగివచ్చిందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. ఇది ఏపీలో బీఆర్ఎస్ పార్టీ తొలి విజయం అన్నారు. కేటీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి లేఖ రాయడంతో పాటు, ఒక అధ్యయన బృందాన్ని పంపారని గుర్తు చేశారు. ఏపీలో టీడీపీ, వైసీపీ చేతులు ఎత్తివేశాయని... ఇక్కడి ప్రజలకి అండగా నిలబడిన పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే అని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' అన్న నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంటును సాధించుకుందామన్నారు.

ట్రెండింగ్ వార్తలు

"ఉక్కు ఉద్యమంలో 32 మంది అసువులు బాశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలువ రూ.3 లక్షల కోట్లు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మంది జీవిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను కేసీఆర్ ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటీకరణ చేస్తే రిజర్వేషన్లు ఎగిరిపోతాయి. జాతి సంపదను కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లడాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఒకవేళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం మొండివైఖరితో ప్రైవేటీకరణ చేసినా.... మళ్ళీ దాన్ని కాపాడుకొని, జాతీయo చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల 3 రోజుల పాటు విశాఖలో పర్యటించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల తరుపున పోరాటం చేశాం. వారికి అండగా నిలబడ్డాం. బీఆర్ఎస్ దెబ్బకే... కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఇవాళ విశాఖపట్నం లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదు... బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని ప్రకటించారు. బైలడిల్లా గనులను విశాఖ స్టీల్ ప్లాంట్, బయ్యారంకు ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ కూడా కేంద్రాన్ని ప్రశ్నించారు. క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా తెలుగు ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. RINL విలువ రూ.3 లక్షల కోట్లు అయితే... వాళ్ళు చూపించింది రూ.397 కోట్లు మాత్రమే" అని విమర్శించారు.

అదానీ ఇంకా స్టీల్ ప్లాంట్ పెట్టకముందే... బైలడిల్లా గనులను అదానీకి కట్టబెట్టారని తోట చంద్రశేఖర్ ఆరోపించారు. బైలడిల్లా గనులను అదానికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు వెంటనే గనులు కేటాయించాలన్నారు. 'వైజాగ్ స్టీల్ ప్లాంట్' ను ప్రైవేటీకరించమని వెంటనే కేంద్రం ప్రకటించాలన్నారు. RINL కు సొంత గనులు కేటాయించాలన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సంబంధించిన 20 వేల ఎకరాల భూములను రాష్ట్రపతి పేరు మీద పెట్టుకున్నారని... దాన్ని వెంటనే RINL మీద ట్రాన్స్ఫర్ చేయాలని కోరారు. RINL కు రూ.5 వేల కోట్లు తక్షణ సాయం చేయాలని... విశాఖ స్టీల్ ప్లాంట్ సొంతకాళ్ళ మీద నిలబడేలా ఆదుకోవాలన్నారు.

హరీశ్ నిజాలే చెప్పారు...

ఏపీ విషయంలో మంత్రి హరీష్ రావు అన్నీ నిజాలే మాట్లాడారని తోట చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఏపీ మంత్రుల దగ్గర సబ్జెక్ట్, సరుకు లేకనే ... హరీష్ రావు పై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సహా అన్ని అంశాలపై మంత్రి హరీష్ రావు వాస్తవాలే మాట్లాడారని... ఆంధ్ర ప్రజలు తమ సమస్యలను తీర్చగలగే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు...ఆ నాయకుడే కేసీఆర్ అని చెప్పారు. దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని... కేసీఆర్, కేటీఆర్ విజన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముగ్ధులవుతున్నారని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ లను ఆంధ్రాకి తీసుకురావాల్సిందిగా తనను ఏపీ ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. విశాఖపట్నంలో త్వరలోనే బీఆర్ఎస్ తరఫున భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడినందుకుగాను, ఉద్యోగులు, కార్మిక సంఘాలు అక్కడ విజయోత్సవ సభ నిర్వహించాల్సిందిగా అడుగుతున్నారని అన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం