Revanth Reddy Vs Etela : ఆగని 'మునుగోడు' మంటలు.. 25 కోట్ల ఆరోపణలపై రేవంత్ రెడ్డి సవాల్-tpcc revanth reddy challenged bjp etela rajender on rs 25 crore allegations ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy Vs Etela : ఆగని 'మునుగోడు' మంటలు.. 25 కోట్ల ఆరోపణలపై రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy Vs Etela : ఆగని 'మునుగోడు' మంటలు.. 25 కోట్ల ఆరోపణలపై రేవంత్ రెడ్డి సవాల్

HT Telugu Desk HT Telugu
Apr 22, 2023 09:52 AM IST

Revanth Reddy Vs Etela : కేసీఆర్ నుంచి కాంగ్రెస్ రూ.25 కోట్లు తీసుకుందని ఈటల రాజేందర్ చిల్లర ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసేందుకు రావాలని సవాల్ చేశారు.

ఈటల ఆరోపణలు... రేవంత్ రెడ్డి రియాక్షన్
ఈటల ఆరోపణలు... రేవంత్ రెడ్డి రియాక్షన్

Revanth Reddy Vs Etela :కాంగ్రెస్ కు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈటలకు దేవుడిగా నమ్మకం ఉంటే తడిబట్టలతో చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ లో ప్రమాణానికి రావాలని సవాల్ చేశారు. మునుగోడు ఉపఎన్నికలో ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి కాంగ్రెస్ కార్యకర్తలు చందాల రూపంలో ఇచ్చిందేనన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ, ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటల రాజేందర్ మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్‌ నుంచి సాయం పొందినట్లు ఈటల చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఒక్క రూపాయి పొందలేదన్నారు. ఈ మేపరు చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయం ఎదుట తడిబట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ఆలయం వద్దకు రావాలని ఈటల రాజేందర్ కు సవాల్ చేశారు. ఈటలకు భాగ్యలక్ష్మి అమ్మవారిపై నమ్మకం లేకపోతే మరో దేవాలయంలోనైనా తడి బట్టలతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల కోసం ఈటల దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిల్లర ఆరోపణలు

కేసీఆర్ డబ్బులు ఇచ్చినట్లు ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు నిరూపించాలని రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎన్నికల సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క సమక్షంలో అందరినీ సాయం అడిగామన్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు సాయం అందించారు. నీచ రాజకీయాల కోసం ఈటల క్షమించరాని నేరం చేశారన్నారు. చిల్లర ఆరోపణలు చేసేవాళ్లు చిత్తు కాగితం లాంటి వాళ్లని విమర్శించారు. మునుగోడు ఎన్నికల్లో పెట్టిన ఖర్చు.. బడుగు, బలహీన వర్గాలు నాయకులు ఇచ్చిన సాయమే అన్నారు.

క్షమించరాని నేరం

"ఈటల రాజేందర్ తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలి, శనివారం సాయంత్రం 6 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా? భాగ్యలక్ష్మి అమ్మవారిపై ఈటలకు నమ్మకం లేకుంటే మరో ఆలయంలోనైనా తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. నేను ఏంటో రాజేందర్ కి తెలుసు. భాగ్యలక్ష్మి గర్భగుడిలో ప్రమాణం చేసేందుకు సిద్ధం. నీచ రాజకీయం కోసం ఈటల క్షమించరాని నేరానికి పాల్పడ్డారు. చిల్లర ఆరోపణలు చేసే వారు నాకు చిత్తు కాగితంతో సమానం." - రేవంత్ రెడ్డి

ఈటల రాజేందర్ ఆరోపణలు

కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ఎన్నికల ముందైనా, తర్వాతైనా రెండు పార్టీలు కలిసిపోతాయన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి సీఎం కేసీఆర్ రూ. 25 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. దేశంలోని అన్ని పార్టీల ఎన్నికల ఖర్చు భరించేంత వేల కోట్లు సీఎం కేసీఆర్ కు ఎలా వచ్చాయో చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Whats_app_banner