Etala On KCR: రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసు నమోదు చేశారన్న ఈటల
Etala On KCR: తెలంగాణలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నాయకుడు ఈటల స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. పోలీసుల విచారణకు హాజరైన ఈటల, అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిపానన్నారు.
Etala On KCR: ఎస్సెస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. నాలుగో తేదీన హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ పైవాట్సాప్ కాల్ వచ్చినట్లు ఆరోపణలపై పోలీసులు ఇచ్చిన నోటీసులతో డీసీపీ వరంగల్ విచారణకు హాజరైనట్లు చెప్పారు.
ప్రశాంత్ నుంచి తనకు ఎలాంటి వాట్సాప్ కాల్, ఫోన్ రాలేదని వారు నిర్దారించుకున్నట్లు ఈటల తెలిపారు. నగేష్ యాదవ్ అనే వ్యక్తి నుంచి తనకు వాట్సాప్ మెసేజీ వచ్చిందని, దానిని కనీసం తాను చూడలేదని, ఇతరులకు పంపే అవకాశం లేదని నిర్దారించుకున్నారని చెప్పారు.
26ఏళ్లుగా తాను ప్రజా జీవితంలో ఉన్నానని బాధ్యత కలిగిన పౌరుడిగా, రాజకీయ నాయకుడిగా , బీజేపీలో ప్రస్తుతం ఉన్నానని, ఎండ కాలంలో పిల్లలు మాత్రమే కాకుండా, తల్లిదండ్రులు కూడా టెన్షన్‌లో ఉంటారని, పరీక్షల ముందు దేశ ప్రధాని పిల్లలకు ధైర్యం చెప్పారని, అలాంటి పార్టీలో తాను నాయకుడిగా ఉన్నానని పిల్లల భవిష్యత్తు కోరే పార్టీలో ఉన్న తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు.
9.30కు పరీక్ష మొదలైతే 11.30కు పేపర్ బయటకు లీకైందని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. తెలంగాణలో జరిగినది, మాల్ ప్రాక్టీస్ తప్ప పేపర్ లీక్ కాదన్నారు. ప్రగతి భవన్ లో కూర్చున్న కేసీఆర్‌కు, ప్రజల్లో తాము తిరుగుతున్నాం, క్రియాశీలకంగా తిరుగుతున్నామనే ఉద్దేశంతో కుట్ర పూరితంగా తనపై తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం 30లక్షల మంది ఏళ్ల తరబడి సిద్ధమై, పరీక్షల కోసం చదివితే, నాలుగు పరీక్షలు రాసిన వాళ్లు కూడా, రద్దై పోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. 30లక్షల మంది జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వ అసమర్థ వైఖరి నుంచి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీక్ నుంచి దృష్టి మరల్చడానికి పదో తరగతి పేపర్ లీక్ అంశాన్ని హడావుడి చేస్తున్నారన్నారు.
ఢిల్లీ నుంచి కేసీఆర్‌కు డబ్బులు అప్పగించానని లిక్కర్ స్కామ్ నిందితుడు చెప్పాడని, దేశ వ్యాప్తంగాబిఆర్‌ఎస్ పార్టీ దోషిగా ఎలా నిలబడిందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజ్‌దీప్ సర్దేశాయ్ వంటి వారు కేసీఆర్ ఉద్దేశాన్ని బయటపెట్టారని, తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుని ఎన్నికలల్లో ఖర్చు పెట్టేందుకు సిద్దమవుతున్నారని ఈటల విమర్వించారు.
ప్రస్తుతం కేసీఆర్ ఖజానా నిండుగా ఉందని, దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బిఆర్‌ఎస్ అవతరించిందని, 2014కు ముందు ఆంధ్రా పార్టీలు డబ్బులు పంచుతున్నాయని ఆరోపించిన కేసీఆర్‌కు, ఇప్పుడు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.
అసైన్డ్ భూములను కూడా లాక్కుని దందాలు చేస్తూ రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా పనిచేస్తున్నారని వీటిపై చర్చ జరగకుండా ఉండేందుకే అక్రమ కేసులు పెట్టి డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తారని చెప్పారు. ప్రభుత్వ దందాకు తాము భయపడే ప్రసక్తి లేదన్నారు.
పోలీసుల విచారణలో తనను నిందితుడు ఫోన్ చేశారా అని అడిగారని, ప్రశాంత్ తో సంబంధాలు ఉన్నాయా అని అడిగారని, లేవని చెప్పినట్టు స్పష్టం చేశారు. పోలీసులకు కూడా అది తప్పుడు కేసు అనే సంగతి తెలుసని, పోలీసులంతా తప్పులు చేయరని, చట్టం మీద నమ్మకం ఉన్న వ్యక్తిగా నోటీసులకు స్పందించి విచారణకు హాజరయ్యానని ఈటల చెప్పారు.