తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tomato For Face | మొఖంలో నిగారింపు, మెరిసే చర్మం కోసం టొమాటోను ఇలా ఉపయోగించండి!

Tomato for Face | మొఖంలో నిగారింపు, మెరిసే చర్మం కోసం టొమాటోను ఇలా ఉపయోగించండి!

HT Telugu Desk HT Telugu

23 August 2022, 22:49 IST

    • Tomato for Skin Care: మీది జిడ్డు చర్మమైనా, ముఖంపై మొటిమలు ఉన్నా లేదా ముఖం నల్లగా ఉన్నా.. ఏవేవో క్రీములు, ఫేస్ ప్యాకులు వేసుకోవాల్సిన అవసరం లేదు. టొమాటోతో అన్ని సమస్యలు దూరం అవుతాయి. చర్మానికి టొమాటోతో కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.
Tomato for Skin Care
Tomato for Skin Care (istock)

Tomato for Skin Care

Tomato for Skin Care | ఎర్రగా నిగనిగలాడే టొమాటోలను చూస్తే ఎవరైనా సరే టెంప్ట్ అవ్వాల్సిందే. టొమాటొ కూర నోరూరిస్తుంది, టొమాటో పప్పు రుచికరంగా ఉంటుంది. టొమాటోలను చట్నీకూడా చేసుకోవచ్చు. జ్యూసీగా రసాలూరుతూ ఉండే టొమాటోను ఏ వంటకంలో వేసినా వచ్చే రుచే వేరు. ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి.

అయితే టొమాటోనూ కేవలం తినటానికి మాత్రమే కాకుండా మీ ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చే ఒక సౌందర్య సాధనంగా కూడా ఉపయోగించవచ్చు. మీ చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను టొమాటోతో దూరం చేసుకోవచ్చు. టాన్ తొలగించడం నుంచి జిడ్డును శుభ్రం చేయటం, మొటిమలతో పోరాడటం.. ఇలా ఎన్నో విధాలుగా టొమాటో ఒక సహజ రెమెడీగా ఉపయోగపడుతుంది. టొమాటోను ఫేస్ ప్యాక్‌లో ఉపయోగించవచ్చు లేదా దాని రసాన్ని నేరుగా ముఖంపై అప్లై చేయడం ద్వారా మచ్చలను శుభ్రం చేసుకోవచ్చు.ఆరోగ్యకరమైన, శుభ్రమైన చర్మాన్ని పొందటానికి టొమాటో సహాయపడుతుంది.

మీరు అందంగా తయారవ్వాలి అనుకుంటే, మీకు అందం పట్ల స్పృహ ఉంటే మీ చర్మానికి టొమాటో ద్వారా కలిగే కొన్ని ప్రయోజనాలను (Tomato for Skin Care) ఇక్కడ తెలుసుకోండి.

సున్నితమైన చర్మానికి

చాలా మంది సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి వారు మేకప్ వేసుకున్నా లేదా మార్కెట్లో లభించే చర్మ సౌందర్య ఉత్పత్తులు వాడినా అది వారికి ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. అది మీ చర్మానికి సరిపోకపోవచ్చు. ఈ కారణంగా మీ చర్మం మంటగా ఉంటుంది, దద్దుర్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి వారు టోమాటో గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. టొమాటోలో బీటా కెరోటిన్, లుటిన్, విటమిన్లు సి, ఇ వంటి అనేక యాంటీ ఇన్ల్ఫమేటరీ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి చర్మంపై చల్లటి ప్రభావాన్ని కలిగిస్తాయి. సహజంగా నిగారింపును అందిస్తాయి.

ముఖంపై రంధ్రాలను పూడ్చవచ్చు

టొమాటో సహజ రక్తస్రావ నివారిణి (astringent) గా పనిచేస్తుంది. కాబట్టి ముఖంపై ఏర్పడిన రంధ్రాలు, బ్లాక్‌హెడ్స్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. టొమాటోను సగానికి కట్ చేసి ఆ ముక్కను చర్మంపై రుద్దాలి, రసాన్ని రంధ్రాలలోకి పంపాలి. ముఖంపై టొమాటో గుజ్జును అలాగే 15 నిమిషాల పాటు ఉంచుకొని, ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఇలా చేయడం వల్ల ముఖంపై రంధ్రాలు, మొటిమలు తగ్గిపోతాయి.

జిడ్డును తొలగించటానికి

మీది ఆయిలీ స్కిన్ అయితే టొమాటోను ముఖంపై రుద్ధండి. ఐదు, పది నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత నీటితో కడిగేసుకోవాలి. దీంతో జిడ్డు పోవటమే కాకుండా మీ చర్మం శుభ్రంగా, తాజాగా కనిపిస్తుంది.

ఒక గిన్నెలో కొద్దిగా గంధపు పొడి వేసి, నిమ్మరసం, టమోటా రసం కలపండి. ఈ పేస్ట్‌ని ముఖం, మెడపై అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆరాక చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే మీ చర్మం తెల్లగా, యవ్వనంగా కనిపిస్తుంది.

టాన్ తొలగిస్తుంది.

టొమాటోలోని గుణాలు మీ చర్మంపై సన్ టాన్‌ను తొలగించి టోన్డ్, ప్రకాశవంతమైన ఛాయను అందించడంలో మీకు సహాయపడతాయి. సన్‌టాన్‌ను వదిలించుకోవడానికి మీరు టొమాటోను పెరుగు, నిమ్మరసం కలిపి మాస్క్‌ను సిద్ధం చేసుకోవాలి.

2 టేబుల్ స్పూన్ల టమోటా గుజ్జులో 1 టేబుల్ స్పూన్ పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని మిశ్రమాన్ని మీ ముఖం, మెడపై సమానంగా వర్తించండి. దీన్ని 15-20 నిమిషాల వరకు ఉంచుకొని, ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇది టాన్‌ను తగ్గించడమే కాకుండా సూర్యుని UV కిరణాల వల్ల కలిగే నిర్జీవత్వాన్ని తొలగిస్తుంది. దీంతో మీ చర్మం కాంతివంతగా మెరుస్తుంది.

మొటిమలకు సహజ పరిష్కారం

మీ ముఖంపై మళ్లీ మళ్లీ మొటిమలు వస్తుంటే, మీరు టొమాటోను అప్లై చేయాలి. టొమాటోలోని గుణాలు చర్మంపై వేడిని తగ్గిస్తాయి. ఇవి మొటిమలను తగ్గించటమే కాకుండా, మళ్లీ రాకుండా పరిష్కారం చూపుతాయి. చర్మంలో మంట, దద్దుర్లు ఇతర చర్మ సమస్యలకు కూడా టొమాటీను ఉపయోగించాలి. అంతేకాదు టొమాటోలోని యాంటీ-ఏజింగ్ గుణాలు ముఖంపై వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. ఫైన్ లైన్స్, ముడతలు, వయసు మచ్చలు, డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ వంటి సంకేతాలను దూరం చేస్తాయి.

ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి కృత్రిమమైన ప్రొడక్టులు వాడే బదులు టొమాటో వాడితే సహజ సిద్ధంగా చర్మ సమస్యలకు పరిష్కారం చూపవచ్చు, ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.